అర్జెంటీనా సారథి, ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ తన కెరీర్, రిటైర్మెంట్ పై వస్తున్న ఊహాగానాలపై నోరువిప్పాడు. తాను చివరి మ్యాచ్ ఆడబోతున్నానంటూ సంచలన ప్రకటన చేశాడు. ఆదివారం ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో జరుగబోయే మ్యాచ్ తనకు చివరిదని స్పష్టం చేశాడు.
ప్రపంచకప్ తర్వాత మెస్సీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని కొద్దిరోజులగా ఊహాగానాలు వస్తున్నాయి. మెస్సీ వయసు ఇప్పుడు 35 ఏండ్లు. ఇప్పటివరకు నాలుగు ప్రపంచకప్ లు ఆడిన మెస్సీ తన జట్టును విశ్వవిజేతగా నిలపలేకపోయాడు. అయితే ఈసారి మాత్రం ఆరు నూరైనా ఆ పని చేయాల్సిందేనని పట్టుబట్టి ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే అర్జెంటీనా ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు.
వయసు భారం రీత్యా మెస్సీ త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడని.. తన కెరీర్ లో అర్జెంటీనా తరఫున ఇవే చివరి మ్యాచ్ లు అని వార్తలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మెస్సీ.. క్రొయేషియాతో ముగిసిన సెమీఫైనల్ తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మెస్సీ మాట్లాడుతూ.. ‘అవును. అది నిజమే. మరో ప్రపంచకప్ (2026) కు చాలా సమయముంది. కానీ అప్పటివరకు నేను ఆడతానని అనుకోవడం లేదు. ఈ వరల్డ్ కప్ ను ఘనంగా ముగిద్దామనుకుంటున్నా. ఆదివారం జరుగబోయే ఫైనల్ నాకు ప్రపంచకప్ లో చివరి మ్యాచ్..’ అని తెలిపాడు.
అయితే అర్జెంటీనా గెలిచినా ఓడినా మెస్సీ తన జట్టుకు రిటైర్మెంట్ ఇస్తానని స్పష్టం చేయలేదు. కానీ ప్రపంచకప్ లో మాత్రం ఇదే చివరి మ్యాచ్ అని మాత్రం కుండబద్దలుకొట్టాడు. ఒకవేళ అర్జెంటీనా గనక కప్ కొడితే మెస్సీ మరికొన్నాళ్లు జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశముంది. ఓడితే మాత్రం పరిణామాలు మారొచ్చు.
2005 ఫిఫా వరల్డ్ యూత్ ఛాంపియన్షిప్ లో అదరగొట్టి అదే ఏడాది సీనియర్ జట్టులోకి చేరాడు. 2006లో ఫిఫా ప్రపంచకప్ ఆడాడు. ఇప్పటివరకు నాలుగు ప్రపంచకప్ లు ఆడిన మెస్సీకి ఇది ఐదో టోర్నీ. అర్జెంటీనా తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా మెస్సీకి అరుదైన రికార్డు ఉంది. మరి మెస్సీ తన కెరీర్ ను విజయంతో ముగిస్తాడా..? లేక రొనాల్డో మాదిరిగా విషాదాంతాలే మిగులుతాయా..? అనేది ఈ ఆదివారం తేలనుంది.