FIFA: నేను నైమర్‌కు అభిమానిని.. కానీ ఆ అర్జెంటీనా దిగ్గజమే గ్రేట్ : శుభమన్ గిల్

First Published | Nov 25, 2022, 11:39 AM IST

FIFA World Cup 2022: ప్రపంచమంతా ఫుట్‌బాల్ ఫీవర్ తాకింది. ఖతర్ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో  దిగ్గజ ఆటగాళ్లు తమ దేశానికి ప్రపంచకప్ అందించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. తాజాగా ఈ టోర్నీపై  టీమిండియా  యువ ఓపెనర్ శుభమన్ గిల్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

చిన్నా పెద్దా తేడా లేకుండా  ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులకు ఉర్రూతలూగిస్తున్న  ఫిఫా వరల్డ్ కప్  గురించి టీమిండియా యువ క్రికెటర్ శుభమన్ గిల్ స్పందించాడు.  తనకూ ఫుట్‌బాల్ అంటే మక్కువ ఎక్కువని, బ్రెజిల్ దిగ్గజం నైమర్ కు తాను వీరాభిమానినని  చెప్పుకొచ్చాడు. 

న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ లో  భాగంగా భారత జట్టు  సభ్యుడిగా ఉన్న గిల్  టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గిల్ మాట్లాడుతూ.. ‘నేను  14 ఏండ్ల వయసులో ఉన్నప్పట్నుంచే ఫుట్‌బాల్  చూస్తున్నా.  2014 ఫిఫా వరల్డ్ కప్ లో అనుకుంటా. మా అక్క బ్రెజిల్ మ్యాచ్ చూస్తున్నది. అప్పుడే నాకు నైమర్ గురించి చెప్పింది. 


అతడి ఆట నాకు ఎంతో నచ్చింది. నైమర్ వల్లే  నేను ఫుట్‌బాల్ ఆటను అర్థం చేసుకోగలిగాను. అప్పట్నుంచి  ఫుట్‌బాల్ ను ఫాలో అయ్యా. బ్రెజిల్ జట్టు అంటే నాకు ఇష్టం.  ఈసారి ప్రపంచకప్  బ్రెజిల్ గెలవాలని  నేను కోరుకుంటున్నా. ఆ జట్టులో ఉన్న ఒక్కో ఆటగాడికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అంటే వాళ్లంతా ఎంత ప్రతిభావంతులో అర్థం చేసుకోవచ్చు.  

బ్రెజిల్ కాకుండా అంటే  అర్జెంటీనా,  బెల్జియం, ఫ్రాన్స్ టీమ్ ల ఆట నాకు బాగా ఇష్టం.   నేను క్రికెట్ ఆడుతున్నా ఫుట్‌బాల్ అంటే చాలా ఇష్టం. కానీ నా చుట్టూ  ఆ ఆట ఆడే వాళ్లు ఎవరూ లేరు. కానీ నాకు వీలుంటే  మ్యాచ్ లు తప్పకుండా చూస్తా. టీమిండియాలో   చాలా మంది ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ఉన్నా  కుల్దీప్ యాదవ్ మాత్రం ఈ ఆటకు వీరాభిమాని.  ప్రస్తుతం మేమిద్దరం  న్యూజిలాండ్ తో సిరీస్ లో భాగంగా  ఖాళీ దొరికినప్పుడు  ఫిఫా మ్యాచ్ లు చూస్తున్నాం.. 

ఫుట్‌బాల్ మనకు  జీవితంలో కూడా చాలా నేర్పిస్తుంది.  ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోవద్దు అనే  సూత్రాన్ని ఈ ఆట నుంచి నేర్చుకోవచ్చు..’ అని చెప్పాడు.  అయితే పోర్చుగల్ స్టార్ ఫుట్బాలర్  క్రిస్టియానో రొనాల్డో, అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ మధ్య ఎవరు గొప్ప అన్న ప్రశ్నకు గిల్ తనదైన రీతిలో సమాధానం చెప్పాడు. 

‘మెస్సీ - రొనాల్డో లలో గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) ఎవరంటే నేను  మెస్సీ పేరే చెబుతా. ఆట మీద అతడికున్న అంకితభావం చాలా గొప్పది. మెస్సీకి చిన్నప్పుడే గ్రోత్ హార్మోన్  డెఫిషియన్సీ (జీహెడ్డీ - ఎదుగుదల లోపం) ఉన్నా ఫుట్‌బాల్ అంటే  తనకు ఉన్న ఇష్టంతో  ఇక్కడిదాకా రాగలిగాడు.  

నా దృష్టిలో మెస్సీనే  ఆల్ టైమ్ గ్రేట్.  పోర్చుగల్ - అర్జెంటీనా  మధ్య  మ్యాచ్ జరిగితే నేను మాత్రం  అర్జెంటీనానే గెలవాలని కోరుకుంటా.  దానికి కూడా కారణం మెస్సీనే.  ఈసారి తన దేశానికి ప్రపంచకప్ గెలిచేందుకు మెస్సీ అర్హుడు.  నేను నైమర్ ఫ్యాన్ అయినా  మెస్సీనే  గ్రేట్. అందులో సందేహమే లేదు..’ అని తెలిపాడు. 

Latest Videos

click me!