FIFA: ఘనాతో మ్యాచ్‌కు ముందు రొనాల్డోకు భారీ షాక్.. రెండు మ్యాచ్‌ల నిషేధం..

First Published | Nov 24, 2022, 5:49 PM IST

FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్ లో  నేడు రాత్రి  ఘనాతో తొలి మ్యాచ్ ఆడనున్న పోర్చుగల్ సారథి  క్రిస్టియానో రొనాల్డోకు ఊహించని షాక్ తగిలింది.  అతడిపై ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ రెండు మ్యాచ్ ల నిషేధం విధించింది. 

పోర్చుగల్ ఫుట్బాల్   దిగ్గజం  క్రిస్టియానో రొనాల్డోకు   ఊహించని షాక్ తగిలింది.  ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా  నేటి రాత్రి (భారత కాలమానం ప్రకారం) 9 గంటలకు  పోర్చుగల్ జట్టు ఘనాతో తమ తొలిమ్యాచ్ ఆడే ముందు  ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ అసోసియేషన్  రొనాల్డోపై రెండు మ్యాచ్ ల నిషేధం విధించింది.  
 

ఇటీవలే  మాంచెస్టర్ యూనైటెడ్ క్లబ్ తో తన బంధాన్ని తెంపుకుని బయటకు వచ్చిన రొనాల్డో  పై రెండు మ్యాచ్ ల నిషేధంతో పాటు   సుమారు రూ. 50 లక్షల  జరిమానా కూడా వేసింది.  దీంతో  పోర్చుగల్ జట్టుతో పాటు ఆ దేశ అభిమానులను ఈ నిర్ణయం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. 


Image Credit: Getty Images

ఈ ఏడాది ఏప్రిల్ 9న గూడిసన్  వేదికగా ఎవర్టన్ ఎఫ్‌సీ, మాంచెస్టర్ యూనైటెడ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో  ఎవర్టన్ 1-0తో  విజయం సాధించింది. రొనాల్డో కు ఈ మ్యాచ్ లో గాయమైంది. మ్యాచ్ ముగిశాక  డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్తున్న  రొనాల్డోను ఓ అభిమాని  ఫోటో తీసేందుకు ప్రయత్నించాడు.  ఓటమి బాధలో ఉన్న రొనాల్డో ఆ ఫోన్ లాక్కుని  పగులగొట్టాడు.  

ఇదే రొనాల్డో కొంప ముంచింది.  ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో  బ్రిటన్ పోలీసులు రొనాల్డో పై కేసు నమోదు చేశారు.  దీంతో రొనాల్డో ఆ అభిమానికి క్షమాపణ చెప్పాడు.  కానీ ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ మాత్రం దీనిపై విచారణ జరిపి   రొనాల్డోకు జరిమానాతో పాటు రెండు మ్యాచ్ ల నిషేధం కూడా విధించడం గమనార్హం. 

అయితే  రెండు మ్యాచ్ ల నిషేధం అనేది ఫిఫా ప్రపంచకప్ లో వర్తించదు.  రొనాల్డో తర్వాత ఆడబోయే క్లబ్  స్థాయి మ్యాచ్ లకు మాత్రమే ఇది వర్తిస్తుంది.  మాంచస్టర్ యూనైటెడ్  నుంచి  తప్పుకోవడంతో అతడు తర్వాత  ఏ క్లబ్ లో చేరితే ఆ క్లబ్ తరఫున  రెండు మ్యాచ్ ల నిషేధం ఎదుర్కోవాల్సి వస్తుంది.   ఇది పోర్చుగల్ అభిమానులకు ఊరట.    
 

తన  కెరీర్ లో చివరి వరల్డ్ కప్ (?) గా భావిస్తున్న  రొనాల్డోకు  ఈ టోర్నీ చాలా కీలకం. క్లబ్ స్థాయి మ్యాచ్ లలో  తాను ఆడే ఫ్రాంచైజీలకు వందలకొద్దీ గోల్స్  చేసే  రొనాల్డో.. తమ దేశం తరఫున ఆడుతూ పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఈసారైనా రొనాల్డో  తన దేశానికి ప్రపంచకప్ అందిస్తాడో లేదోనని  అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Latest Videos

click me!