తన కెరీర్ లో చివరి ప్రపంచకప్ ఆడుతున్న పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో లీగ్ దశలో సూపర్ షో తో తన జట్టు ప్రిక్వార్టర్స్ చేరేందుకు కృషి చేశాడు. అయితే రౌండ్ ఆఫ్ 16లో భాగంగా స్విట్జర్లాండ్ తో ముగిసిన మ్యాచ్ లో రొనాల్డో బెంచ్ కే పరిమితమయ్యాడు.
పోర్చుగల్ సారథినే పక్కనబెట్టడం ఆ జట్టు అభిమానులతో పాటు ఫుట్‌బాల్ అభిమానులకూ షాకిచ్చింది. అయితే కొత్త కుర్రాడు రామోస్ హ్యాట్రిక్ గోల్స్ తో పోర్చుగల్ ఈ మ్యాచ్ లో 6-1 తేడాతో స్విట్జర్లాండ్ ను ఓడించి క్వార్టర్స్ కు చేరింది.
క్వార్టర్స్ లో భాగంగా నేడు పోర్చుగల్.. మొరాకోతో ఆడనుంది. మరి ఈ మ్యాచ్ లో అయినా రొనాల్డో ఆడతాడా..? లేదా..? అన్నది మ్యాచ్ ప్రారంభానికి ముందు వరకూ సస్పెన్సే. అయితే మ్యాచ్ కు ముందే రొనాల్డో సోదరి కటియ అవెరో తన అన్న పోర్చుగల్ జాతీయ జట్టును వీడాలని సూచించింది. ఈ అవమానాలను భరించడం కంటే జట్టును వీడటమే బెటర్ అని సలహా ఇచ్చింది.
కటియ మాట్లాడుతూ.. ‘పోర్చుగల్ గెలిచింది. థ్యాంక్ గాడ. కొత్త కుర్రాళ్లు మ్యాచ్ ను గెలిపించారు. అద్భుతంగా ఉంది. స్టేడియంలో అందరూ రొనాల్డో రొనాల్డో అని అరుస్తున్నారు. అయితే ఆ అరుపులు పోర్చుగల్ గెలిచినందుకు కాదు. ఈ మాట అంటున్నది నేను కాదు. ప్రపంచం మొత్తం టీవీలలో చూసింది.
పోర్చుగల్ గెలిచినందుకు నాకూ చాలా సంతోషంగా ఉంది. అయినా మా దేశం మ్యాచ్ లు గెలవడం ఇదేం కొత్తకాదు. కానీ ఇది (రొనాల్డోను బెంచ్ కు పరిమితం చేయడం) సరైంది కాదు. పోర్చుగీసు ప్రజలు మిమ్మల్ని (హెడ్ కోచ్ ను ఉద్దేశిస్తూ) మిమ్మల్ని క్షమించరు.
నేనైతే రొనాల్డో తన జాతీయ జట్టును వదిలి ఇంటికి రావడమే బెటర్ అనుకుంటున్నా. ఖతర్ నుంచి వచ్చి మాతో ఉంటే బాగుండు. మేం అతడిని ఓదారుస్తాం. పోర్చుగల్ జట్టుకు అతడు ఏం చేశాడో గుర్తు చేసుకోండి. దానిని మరిచిపోవద్దు..’ అని వ్యాఖ్యానించింది.
ఫిఫా లో భాగంగా లీగ్ దశలో సౌత్ కొరియాతో మ్యాచ్ లో పోర్చుగల్ ఓటమి అనంతరం హెడ్ కోచ్ ఫెర్నాండో సాంటోస్ తో రొనాల్డో వాగ్వాదానికి దిగినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకే రొనాల్డోను స్విట్జర్లాండ్ మ్యాచ్ లో ఆడించలేదని.. హెడ్ కోచ్ తోనే గాక జట్టు సభ్యులతో కూడా రొనాల్డో సఖ్యతగా లేడని వార్తలు వినిపిస్తున్నాయి. మరి మొరాకో తో మ్యాచ్ లో అయినా రొనాల్డో ఆడతాడా..? లేదా..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.