ప్రతి ఒక్కరి ఇంట్లో కామన్ గా ఉండే కూరగాయల్లో బంగాళ దుంప ఒకటి. చాలా మందికి ఈ బంగాళదుంప వేపుడు అంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది. ఇది చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అయితే.. వీటితో వచ్చిన సమస్య ఏంటంటే... వెంటనే మొలకలు వస్తూ ఉంటాయి.
గతంలో ఎక్కువ రోజులు అయితే మొలకలు వచ్చేవి. కానీ.. ఇప్పుడు అలా కాదు.. కొన్న రెండు, మూడు రోజులకే మొలకలు వచ్చేస్తున్నాయి. అలా మొలక వచ్చిన తర్వాత బంగాళదుంపలు తినకూడదు అని నిపుణులు చెబుతున్నారు. మరి.. ఇలా మొలకలు వచ్చాయి కదా.. వాటిని పారేయలేం. కానీ.. మనం కొన్ని చిట్కాలతో ఆలుగడ్డ లను స్టోర్ చేస్తే మొలకలు రాకుండా ఉంటాయట.
బంగాళాదుంపలను చల్లగా, గాలి, వెలుతురు వచ్చే చోట ఉంచాలి. వీలైనంత వరకు ఫ్రిజ్‌లో పెట్టకండి. చాలా చల్లని వాతావరణం పిండి పదార్థాన్ని చక్కెరగా మారుస్తుంది, దీనివల్ల బంగాళాదుంప రుచి మారిపోతుంది.
బంగాళాదుంపలను సూర్యకాంతి నుండి దూరంగా ఉంచడం మంచిది. ఎక్కువ వెలుతురు క్లోరోఫిల్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఆకుపచ్చగా మారడం వల్ల బంగాళాదుంపలు చేదుగా మారుతాయి, దీనివల్ల రుచి మారిపోతుంది.
నల్లటి మచ్చలు ఉన్న చెడిపోయిన బంగాళాదుంపలను కొనకండి. మార్కెట్ నుండి తెచ్చిన ఈ కూరకాయలను చల్లగా, పొడిగా, చీకటి ప్రదేశంలో ఉంచాలి.
బంగాళాదుంపల్లో మొలకలు రాకుండా ఉండటానికి ఉత్తమ మార్గం వాటిని పెద్ద పరిమాణంలో కొని నిల్వ ఉంచకపోవడమే. అవసరానికి తగ్గట్టుగా కొనడం మంచిది.
ఎక్కువ తేమ వల్ల మొలకలు వస్తాయి. కాబట్టి మూసివున్న ప్లాస్టిక్ సంచులకు బదులుగా కాగితం సంచి, గోనె సంచి, బుట్ట వంటి గాలి ఆడే పాత్రల్లో బంగాళాదుంపలు నిల్వ చేయడం మంచిది.
బంగాళాదుంపలను ఉల్లిపాయలు లేదా అరటిపండ్లతో కలిపి నిల్వ చేయకండి. ఇవి ఎథిలీన్ వాయువును విడుదల చేస్తాయి, దీనివల్ల బంగాళాదుంపలు త్వరగా మొలకెత్తుతాయి.