మధుమేహులు ఉల్లిపాయలు తింటే..!

First Published | May 9, 2023, 12:30 PM IST

ఉల్లిపాయల్లో  ఎన్నో ఔషదగుణాలుంటాయి. వీటిని తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. మరి మధుమేహులు ఈ ఉల్లిపాయలను తినొచ్చా? ఒకవేళ తింటే ఏమౌంతుందంటే? 
 

భారతదేశాన్ని ప్రపంచ మధుమేహ రాజధాని గా పరిగణిస్తారు. ఎందుకంటే మన దేశంలో మధుమేహుల సంఖ్య అలా రోజు రోజుకు పెరిగిపోతోంది కాబట్టి. అయితే కొన్ని చిట్కాలు, జీవన శైలి మార్పులతో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించొచ్చు. నిపుణుల ప్రకారం.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఉల్లిపాయలు తినడం ఒక ప్రభావవంతమైన హోం రెమెడీ. 
 

onion

ఉల్లిపాయలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వంటకాల్లో ప్రధాన కూరగాయలు. వీటి ప్రయోజనాలు రుచి, పోషణకు మించి ఉంటాయి. ఉల్లిపాయల్లో ఫైబర్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్, షుగర్, విటమిన్ బి, విటమిన్ సి, ఫాస్పరస్ లు పుష్కలంగా ఉంటాయి. వీటిలోని పోషకాల కారణంగా వీటిని భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా సాంప్రదాయ చికిత్సలో ఉపయోగిస్తున్నారు. అయినప్పటికీ ఉల్లిపాయలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉన్నాయో లేదో ఇంకా స్పష్టంగా తెలియదని నిపుణులు అంటున్నారు. అయితే డయాబెటిస్ ఉన్నవారికి ఉల్లిపాయలు ప్రయోజనకరంగా ఉంటాయని చూపించే ఎన్నో అధ్యయనాలు ఉన్నాయి. ఉల్లిపాయలు మధుమేహులకు ఎలాంటి ప్రయోజనాలను అందిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 


రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి

ఉల్లిపాయలలో ఫ్లేవనాయిడ్లు, సల్ఫర్ సమ్మేళనాలు అని పిలువబడే సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో రక్తంలో చక్కెరను తగ్గించే లక్షణాలు ఉంటాయని కనుగొన్నారు. ఈ సమ్మేళనాలు ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడానికి, గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. 2011 నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. నాలుగు వారాల పాటు ఉల్లిపాయ సారం తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారి రక్తంలో చక్కెర స్థాయిలు బాగా తగ్గాయని కనుగొన్నారు. మరొక అధ్యయనం ప్రకారం.. ముడి ఉల్లిపాయలను రోజూ తీసుకోవడం వల్ల టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గాయని కనుగొన్నారు. 
 

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

డయాబెటిస్ ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి వీళ్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఉల్లిపాయలలో యాంటీఆక్సిడెంట్లు.. ముఖ్యంగా క్వెర్సెటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెపై రక్షణ ప్రభావాన్ని చూపుతాయని తేలింది. ఉల్లిపాయలను తినడం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని అధ్యయనంలో తేలింది. ఈ రెండూ గుండె జబ్బులకు ప్రమాద కారకాలు. ఒక అధ్యయనంలో ఎనిమిది వారాల పాటు రోజూ 2 గ్రాముల ఉల్లిపాయలు తిన్న 100 మంది డయాబెటిస్ పేషెంట్ల రక్తపోటు తగ్గిందని తేలింది. 
 

ఉల్లిపాయలు రోగనిరోధక పనితీరును పెంచుతాయి

డయాబెటిస్ ఉన్నవారు అంటువ్యాధులకు ఎక్కువగా గురవుతారు. అయితే ఉల్లిపాయలలో విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, అంటువ్యాధుల నుంచి రక్షించడానికి సహాయపడతాయి. రీసెర్చ్ గేట్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం..  ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక పనితీరు మెరుగుపడుతుంది. అలాగే అంటువ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుందని కనుగొన్నారు. 
 

Onion

ఉల్లిపాయలు బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తాయి

డయాబెటిస్ ఉన్నవారు ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం చాలా ముఖ్యం. ఎందుకంటే అధిక బరువు ఎన్నో అనారోగ్య సమస్యల ప్రమాదాల్ని పెంచుతుంది.  ఉల్లిపాయలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపును నిండుగా ఉంచుతుంది. ఇది మొత్తం కేలరీలను తీసుకోవడాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. 
 

జీర్ణ ఆరోగ్యానికి మద్దతు 

డయాబెటిస్ ఉన్నవారికి మలబద్ధకం, గ్యాస్ట్రోపరేసిస్ వంటి జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఉల్లిపాయలలో ప్రీబయోటిక్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రయోజనకరమైన గట్ బ్యాక్టీరియా  పెరిగేందుకు, జీర్ణ పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఉల్లిపాయలు జీర్ణ పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుందని, వృద్ధులలో మలబద్దకం లక్షణాలను తగ్గిస్తుందని ఇంతకు ముందు పేర్కొన్న అధ్యయనం కనుగొంది.
 

Latest Videos

click me!