రియో నీగ్రో నది: ఈ నది దట్టమైన అటవీ ప్రాంతాల గుండా ప్రవహిస్తుంది. ఈ క్రమంలో చెట్ల ఆకులు, మొక్కల అవశేషాలు కుళ్ళిపోయి నీటిలో కలిసే సేంద్రియ పదార్థాల వల్ల నీటికి ముదురు నలుపు లేదా నీలం రంగు వస్తుంది.
సోలిమోయెస్ నది: ఈ నది ఆండీస్ పర్వత ప్రాంతాల నుంచి కొట్టుకొచ్చే భారీ మొత్తంలో మట్టి, ఇసుక, అవక్షేపాలను తనతో పాటు మోసుకొస్తుంది. ఆ మట్టి అవశేషాలు నీటిలో తేలుతుండటం వల్ల ఇది కాఫీ లేదా గోధుమ రంగులో కనిపిస్తుంది.
కలిసిన వెంటనే నీరు ఒకే రంగులోకి ఎందుకు మారదు?
రెండు నదులు కలిసినప్పటికీ నీరు వెంటనే ఒకదానితో ఒకటి కలిసిపోయి నీటి రంగు మారదు. దీని వెనక కారణాలు కూడా ఉన్నాయి. రెండు నదుల నీరు ప్రవహించే వేగంలో తేడా ఉంటుంది. నీటి ఉష్ణోగ్రతలు వేర్వేరుగా ఉంటాయి. నీటిలోని సేంద్రియ పదార్థాలు, అవక్షేపాల వల్ల సాంద్రతలో మార్పు ఉంటుంది.
ఈ వ్యత్యాసాల కారణంగా నీరు వెంటనే కలిసిపోకుండా, దాదాపు కొన్ని కిలోమీటర్ల దూరం వరకు పక్కపక్కనే ప్రవహిస్తుంది. అయితే ఈ నీరు అసలు కలవదని అనుకోవడం పొరపాటే. నీరు క్రమంగా కలుస్తూనే ఉంటుంది, కానీ పూర్తిగా ఒకే రంగులోకి మారడానికి చాలా సమయం పడుతుంది.
ఇది నిజంగానే ఒక అద్భుతమా? శాస్త్రీయంగా చూస్తే ఇది ఒక సాధారణ భౌగోళిక, ప్రవాహ ప్రక్రియే. అయితే రెండు నదుల భౌతిక లక్షణాలు పూర్తిగా భిన్నంగా ఉండటం వల్ల ఈ కలయిక చూడటానికి వింతలా కనిపిస్తుంది. ఇది అక్కడికి వచ్చే పర్యాటకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది.