
వర్షాకాలం వస్తే చాలు.. బయట వర్షం కురుస్తుంటే ఇంట్లోకి పాములు వస్తున్నాయనే వార్తలు తరచుగా వింటూ ఉంటాం. చాలామంది పాములు కావాలనే మనుషులపై దాడి చేయడానికి లేదా ఇళ్లలోకి రావడానికి ప్రయత్నిస్తాయి అని అనుకుంటారు. కానీ అది ఎంతమాత్రం నిజం కాదు. పాములు ఇళ్లలోకి రావడం వెనుక ఉన్నది కేవలం వాటి జీవన పోరాటం, మనుగడ మాత్రమే.
వర్షాల వల్ల వాటి సహజ నివాసాలు దెబ్బతిన్నప్పుడు, అవి రక్షణ, వెచ్చదనం, ఆహారం కోసం మాత్రమే సురక్షితమైన ప్రదేశాలను వెతుక్కుంటూ ఇళ్ల వైపు వస్తాయి. వర్షాకాలంలో పాములు ఇళ్లలోకి ఎందుకు వస్తాయి? వాటిని నివారించడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
పాములు సాధారణంగా భూమిలోని కలుగులు, ఎలుకల రంధ్రాలు, రాళ్ల మధ్య ఖాళీలు, డ్రెయిన్లు, దట్టమైన పొదల్లో నివసిస్తాయి. అయితే వర్షాకాలంలో ఎడతెరిపి లేకుండా పడే వర్షాల వల్ల ఈ కలుగులు, రంధ్రాలు పూర్తిగా నీటితో నిండిపోతాయి. నేల మొత్తం నీటితో నిండిపోవడంతో పాములకు అక్కడ శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. దాంతో అవి నీటిలో మునిగిపోకుండా ఉండేందుకు, చలికి గడ్డకట్టుకుపోకుండా ఉండేందుకు ఎత్తైన, పొడిగా ఉండే ప్రదేశాల కోసం బయటకు వస్తాయి. ఈ క్రమంలోనే అవి సమీపంలోని గ్యారేజీలు, షెడ్లు, గదులు, ఇళ్లలోకి ప్రవేశిస్తాయి.
వర్షాకాలంలో కేవలం పాములు మాత్రమే కాదు, ఎలుకలు, కప్పలు, తొండలు, పెద్ద పెద్ద కీటకాలు కూడా వరద నీటి నుంచి తప్పించుకోవడానికి పొడిగా ఉండే ఇళ్ల వైపు వస్తాయి. పాములకు ఇవన్నీ ప్రధానమైన ఆహారం. ఎలుకలు, కప్పలు ఇళ్లలోని ధాన్యాల నిల్వలు, చెత్త డబ్బాలు, తడి ప్రదేశాల వైపు వచ్చినప్పుడు, వాటి వాసనను పట్టుకుంటూ పాములు కూడా నేరుగా ఇళ్ల ప్రాంగణంలోకి వస్తాయి. మీ ఇంట్లో ఎలుకలు లేదా కప్పలు ఎక్కువగా ఉంటే, పాములు వచ్చే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుంది.
పాములు చల్లని రక్తం కలిగిన జీవులు. అంటే అవి తమ శరీర ఉష్ణోగ్రతను సొంతంగా నియంత్రించుకోలేవు. బయట వాతావరణం చల్లగా, తడిగా మారినప్పుడు వాటి జీవక్రియ మందగిస్తుంది. శక్తి తగ్గిపోతుంది. అటువంటి పరిస్థితిలో వాటికి స్థిరమైన, వెచ్చని, పొడి వాతావరణం అవసరం అవుతుంది.
మన ఇళ్లు, భవనాలు వాటికి సరిగ్గా అటువంటి వాతావరణాన్ని అందిస్తాయి. అందుకే అవి ఇంట్లో ఎవరూ తిరగని చీకటి మూలలు, ఫ్రిజ్ వెనుక భాగం, వాషింగ్ మెషీన్ల దగ్గర, పెట్టెల వెనుక, మంచాల కింద, షూ రాక్లలో దాక్కోవడానికి ఇష్టపడతాయి. అంతేకాకుండా, కొన్ని ప్రాంతాల్లో వర్షాకాలం ప్రారంభం పాముల పునరుత్పత్తి సమయంతో కూడుకుని ఉంటుంది. జతను వెతుక్కునే క్రమంలో కూడా పాముల సంచారం పెరుగుతుంది.
పాములు చాలా చిన్న ఖాళీల గుండా కూడా ఇంట్లోకి ప్రవేశించగలవు. తలుపుల కింద ఉండే ఖాళీలు, గోడల ఫౌండేషన్ బిటౌన్లు, పైపుల చుట్టూ ఉండే రంధ్రాలు, డ్రెయినేజీ రంధ్రాలు, ఓపెన్ విండోస్ ద్వారా అవి ఇంట్లోకి ఈజీగా దూరిపోతాయి. బయట వర్షం ఎక్కువగా ఉన్నప్పుడు, పొడి ప్రదేశం కోసం వెతుకుతున్న పాముకు ఈ చిన్న ఖాళీలు లోపలికి రావడానికి దారి చూపిస్తాయి. ఇంటి చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలు, చెత్తకుప్పలు, కట్టెల నిల్వలు పాములకు స్థలాలుగా మారతాయి.
• ద్వారాలు, ఖాళీలు మూసివేయండి: తలుపుల కింద ఖాళీలు లేకుండా డోర్ స్వీప్స్ అమర్చండి. గోడలు, ఫ్లోరింగ్ పై ఉండే రంధ్రాలు, పైపుల చుట్టూ ఉన్న ఖాళీలను సిమెంట్ లేదా మెష్‌తో మూసివేయండి.
• ఆహార పదార్థాల నిల్వ: ఎలుకలు రాకుండా ధాన్యాలను గాలిచొరబడని డబ్బాల్లో ఉంచండి. చెత్త డబ్బాలపై మూతలు సరిగ్గా ఉంచండి. మిగిలిపోయిన పెంపుడు జంతువుల ఆహారాన్ని రాత్రివేళల్లో బయట ఉంచవద్దు.
• పరిసరాల పరిశుభ్రత: ఇంటి చుట్టూ ఉన్న గడ్డి, పొదలను ఎప్పటికప్పుడు కత్తిరించండి. ఇంటికి 10-15 అడుగుల దూరంలో కట్టెల కుప్పలు, ఇటుకలు, చెత్త లేకుండా చూసుకోండి.
• చెప్పులు, బ్యాగులు జాగ్రత్త: బయట ఉంచే షూలు, చెప్పులలో పాములు దాక్కునే అవకాశం ఉంది. కాబట్టి వాటిని ఎత్తైన ప్రదేశాల్లో ఉంచండి లేదా తొడుక్కునే ముందు ఒకసారి సరిచూసుకోండి.
కంగారు పడకండి, ప్రశాంతంగా ఉండండి. పాముకు దూరంగా ఉండండి. దానిని పట్టుకోవడానికి లేదా చంపడానికి ప్రయత్నించవద్దు. పిల్లలను, పెంపుడు జంతువులను దూరంగా ఉంచండి. వీలైతే ఆ గది తలుపు మూసివేసి, వెంటనే స్థానిక అటవీ శాఖ అధికారులకు లేదా శిక్షణ పొందిన పాముల రెస్క్యూయర్ కు సమాచారం అందించండి. చాలా వరకు పాములు దూకుడుగా ఉండవు, అవి బెదిరితే లేదా అనుకోకుండా తొక్కినప్పుడు మాత్రమే కరుస్తాయి.