
ఒక నది పుట్టిన ప్రదేశానికి సమీపంలోనే సముద్రం ఉన్నప్పుడు.. అది అందులోనే కలుస్తుందని సాధారణంగా అనుకుంటాం. కానీ భారతదేశంలోని ప్రధాన నదుల్లో కొన్ని ఈ అంచనాకు భిన్నంగా ప్రవహిస్తాయి. అలాంటి నదుల్లో గోదావరి కూడా ఒకటి. అరేబియా సముద్రానికి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో పుట్టే ఈ నది.. పశ్చిమం వైపు కాకుండా తూర్పు దిశగా ప్రయాణిస్తూ చివరకు బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ క్రమంలో మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల భూములను సస్యశ్యామలం చేస్తూ లక్షలాది ప్రజలకు జీవనాధారం కల్పిస్తోంది.
అసలు అరేబియా సముద్రం ఇంత దగ్గరగా ఉన్నా గోదావరి అటువైపు ఎందుకు ప్రవహించదు? బంగాళాఖాతంలోనే ఎందుకు కలుస్తుంది? నది ప్రవహించే దిశను నిర్ణయించేది ఏమిటి? దక్షిణ గంగగా పేరొందిన గోదావరి తెలుగు రాష్ట్రాలకు ఎలా జీవనాడిగా మారింది? ఈ విషయాలన్నీ ఆసక్తికరమైనవే. వీటిగురించి తెలుసుకుందాం.
గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో పశ్చిమ కనుమల్లో జన్మిస్తుంది. ఇక్కడ ప్రసిద్ధ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం కూడా ఉంది. పర్వత ప్రాంతాల్లో కురిసే వర్షపు నీరు, చిన్నచిన్న నీటి ప్రవాహాలు కలిసి గోదావరి ప్రయాణానికి శ్రీకారం చుడతాయి. ఇలా గోదావరి నది జన్మించే ప్రాంతం అరేబియా సముద్రానికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.. ఈ నది పశ్చిమ దిశగా ప్రవహిస్తే తక్కువ దూరంలోనే సముద్రాన్ని చేరి ప్రయాణాన్ని ముగించేది.
అయితే గోదావరి అలా ప్రవహించదు. పుట్టిన ప్రాంతం నుంచి తూర్పు దిశగా సాగుతూ మార్గంలో అనేక ఉపనదులను కలుపుకుంటుంది. క్రమంగా నీటి పరిమాణం పెరిగి, చిన్న ప్రవాహం కాస్త ఒక భారీ నదిగా రూపాంతరం చెందుతుంది. చివరకు 1,465 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత బంగాళాఖాతంలో కలుస్తుంది.
గోదావరి దగ్గర్లోని అరేబియాలో కాకుండా బంగాళాఖాతంలో ఎందుకు కలుస్తుంది?
గోదావరి నది దగ్గర్లోని అరేబియా సముద్రంవైపు కాకుండా దూరంగా ఉన్న బంగాళాఖాతంవైపు ప్రయాణించడానికి ప్రధాన కారణం భూమి ఉపరితల స్వరూపం, భౌగోళిక వాలు. అన్ని నదులు తాము పుట్టిన ప్రదేశానికి సమీపంలో ఉన్న సముద్రం వైే ప్రయాణించవు... భూమిపై ఎత్తైన ప్రాంతాల నుంచి పల్లపు ప్రాంతాల వైపు, గురుత్వాకర్షణ ప్రభావంతో నీరు ప్రవహిస్తుంది. మార్గంలో ఉన్న పర్వతాలు, కొండలు, లోయలు, పీఠభూముల వాలు కూడా నది దిశను నిర్ణయిస్తాయి.
గోదావరి పుట్టే పశ్చిమ కనుమలకు అతి సమీపంలోనే అరేబియా సముద్రం ఉన్నప్పటికీ, ఆ ప్రాంతంలోని భౌగోళిక స్వరూపం, పీఠభూమి వాలు కారణంగా గోదావరి తూర్పు దిశగా ప్రవహించే నదీ వ్యవస్థలో భాగమైంది. పశ్చిమ కనుమల తూర్పు వైపు విస్తరించిన దక్కన్ పీఠభూమి మీదుగా నీరు తూర్పు వైపు ప్రయాణించడానికి అనువైన వాలు ఉంది. అందుకే గోదావరి పశ్చిమం వైపు ఉన్న సముద్రాన్ని చేరకుండా, తూర్పు దిశగా సుదీర్ఘ ప్రయాణం చేస్తుంది. అంటే సముద్రం ఎంత దగ్గరగా ఉందన్నది ముఖ్యం కాదు.. నీరు ప్రవహించే భూభాగం ఏ దిశలో పల్లంగా ఉందన్నదే కీలకం.
గోదావరి నది ప్రధానంగా మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. దీని నదీ పరీవాహక ప్రాంతం ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు కూడా విస్తరించి ఉంది. అందువల్ల గోదావరి ప్రభావం ఒక్క రాష్ట్రానికే పరిమితం కాదు.
మహారాష్ట్రలో ప్రారంభమైన ఈ నది తూర్పు దిశగా ప్రవహిస్తూ ప్రాణహిత, ఇంద్రావతి, మంజీరా వంటి ముఖ్యమైన ఉపనదుల నీటిని తనలో కలిపేసుకుంటుంది. ఈ ఉపనదులు గోదావరి ప్రవాహాన్ని మరింత బలోపేతం చేస్తాయి. తెలంగాణలోని బాసర, ధర్మపురి, భద్రాచలం వంటి ప్రాంతాలు గోదావరి తీరంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించిన తర్వాత నది డెల్టా ప్రాంతాన్ని ఏర్పరచి, అనేక పాయలుగా విడిపోయి బంగాళాఖాతంలో కలుస్తుంది.
భారతదేశంలో అత్యంత పొడవైన ద్వీపకల్ప నది ఇదే
గోదావరి సుమారు 1,465 కిలోమీటర్ల పొడవుతో భారతదేశంలోని అతి ముఖ్యమైన నదుల్లో ఒకటిగా నిలుస్తుంది. గంగా, సింధు వంటి పెద్ద నదీ వ్యవస్థలతో పోలిస్తే దీని పొడవు తక్కువే అయినప్పటికీ, ద్వీపకల్ప భారతదేశంలో అత్యంత పొడవైన నది గోదావరి. దీని పరీవాహక ప్రాంతం సుమారు 3,12,812 చదరపు కిలోమీటర్లు ఉంది… అంటే దేశంలోని విస్తారమైన భూభాగానికి ఈ నది నీటిని అందిస్తుంది.
పొడవు, పరీవాహక ప్రాంతం, నీటి ప్రవాహం వంటి అంశాల కారణంగా గోదావరిని దక్షిణ గంగగా పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో గంగానదికి ఉన్న సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం దక్షిణ భారతదేశంలో గోదావరికీ ఉంది. వ్యవసాయం, తాగునీరు, సాగునీటి ప్రాజెక్టులు, మత్స్య సంపద, పర్యావరణ వ్యవస్థలకు ఇది కీలక ఆధారం.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆర్థిక, వ్యవసాయ, సాంస్కృతిక జీవితాల్లో గోదావరి నదికి ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణలోని అనేక ప్రాంతాలకు సాగునీరు అందించడంతో పాటు తాగునీటి అవసరాలను తీర్చడంలోనూ ఈ నది కీలక పాత్ర పోషిస్తుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, నిజాంసాగర్ ప్రాజెక్టు వంటి నీటిపారుదల వ్యవస్థలు గోదావరి నదీ జలాలతో అనుసంధానమై ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి డెల్టా ప్రాంతం వ్యవసాయానికి ప్రసిద్ధి. రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం బ్యారేజీ గోదావరి నీటిని కాలువల ద్వారా పొలాలకు మళ్లించడంలో చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉంది. ఈ నీటితో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ప్రాంతాల్లో వరి సాగు విస్తృతంగా అభివృద్ధి చెందింది. గోదావరి డెల్టా ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వరి పండించే ప్రాంతాల్లో ఒకటిగా పరిగణిస్తారు.
గోదావరి డెల్టా
గోదావరి తన సుదీర్ఘ ప్రయాణం చివర్లో ఆంధ్రప్రదేశ్ తూర్పు తీర ప్రాంతానికి చేరుకుంటుంది. ఇక్కడ నది అనేక పాయలుగా విడిపోయి బంగాళాఖాతంలో కలుస్తుంది. నది తీసుకువచ్చే ఒండ్రుమట్టి, సారవంతమైన అవక్షేపాలు కాలక్రమంలో డెల్టా ప్రాంతాన్ని ఏర్పరచడంలో సహాయపడతాయి. ఈ నేలలు వ్యవసాయానికి అనుకూలంగా ఉండటంతో గోదావరి డెల్టా ప్రాంతం వరి సాగుకు పేరుగాంచింది.
డెల్టా ప్రాంతాలు కేవలం వ్యవసాయానికే కాదు.. మడ అడవులు, చేపలు, పక్షులు, ఇతర జీవులకు కూడా ఆవాసాలుగా ఉంటాయి. గోదావరి సముద్రంలో కలిసే ప్రాంతానికి సమీపంలోని కోరింగ మడ అడవులు తీరప్రాంత పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే సముద్రపు అలలు, తుపానులు, తీర కోత, ఉప్పునీరు భూభాగంలోకి చొచ్చుకురావడం వంటి సమస్యలు డెల్టా ప్రాంతాలకు సవాళ్లుగా నిలుస్తాయి.
గోదావరి ఇంత భారీ నదిగా మారడానికి దాని ఉపనదులు ప్రధాన కారణం. ప్రాణహిత, ఇంద్రావతి, మంజీరా, సబరి, పూర్ణ, వార్ధా, వైన్‌గంగా వంటి నదులు గోదావరి నదీ వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వీటిలో ప్రాణహిత నది ముఖ్యంగా తెలంగాణకు ప్రాధాన్యం కలిగినది. వార్ధా, వైన్‌గంగా నదుల వ్యవస్థలు కలిసి ప్రాణహితగా ఏర్పడి గోదావరిలో కలుస్తాయి.
ఈ ఉపనదుల ద్వారా వర్షపు నీరు విస్తారమైన ప్రాంతాల నుంచి ప్రధాన నదికి చేరుతుంది. వర్షాకాలంలో గోదావరిలో నీటి ప్రవాహం భారీగా పెరగడానికి ఇదొక ప్రధాన కారణం. అదే సమయంలో ఎగువ పరీవాహక ప్రాంతాల్లో అధిక వర్షాలు కురిసినప్పుడు దిగువ ప్రాంతాల్లో వరదల ముప్పు కూడా పెరుగుతుంది. అందువల్ల గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షపాతం, ప్రాజెక్టుల నీటి విడుదల, వరద హెచ్చరికలను నిరంతరం పర్యవేక్షించడం అవసరం.
గోదావరి పుష్కరాలు.. ఆధ్యాత్మిక ప్రాధాన్యం
గోదావరి నది తెలుగు ప్రజల ఆధ్యాత్మిక జీవితంలోనూ ప్రత్యేక స్థానం సంపాదించింది. బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయం, ధర్మపురిలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, భద్రాచలంలోని శ్రీరామాలయం, రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలు గోదావరి తీరంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలున్నాయి. ముఖ్యంగా భద్రాచలం వద్ద గోదావరి నది దృశ్యం, నదీ తీరంలోని ఆధ్యాత్మిక వాతావరణం ఎంతో ప్రసిద్ధి చెందాయి.
ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి జరిగే గోదావరి పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ సందర్భంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించడంతో పాటు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గోదావరి నది కేవలం నీటి వనరు మాత్రమే కాకుండా తెలుగు ప్రజల సంప్రదాయాలు, ఆచారాలు, జానపద సంస్కృతితో ముడిపడిన జీవన ప్రవాహం.