మనం ఏడ్చేటప్పుడు కళ్లలోంచే కాదు ముక్కులోంచి కూడా నీళ్లు కారతాయి.. ఎందుకో తెలుసా?

Published : Sep 28, 2026, 02:42 PM IST

మనం ఏడ్చేటప్పుడు కన్నీరు రావడం సాధారణ విషయమే.. అయితే ఎక్కువగా ఏడుస్తుంటే ముక్కులోంచి కూడా నీళ్లు వస్తాయి. ఇలా కళ్లు, ముక్కులోంచి వచ్చేది ఒకే నీరా? ఇవి కళ్లలోంచి ముక్కులోకి ఎలా చేరతాయి?

PREV
15
కళ్లు, ముక్కుకు సంబంధమేంటి?

మనం ఏడ్చేటప్పుడు కళ్ల నుంచి కన్నీళ్లు రావడం సహజమే. అయితే కళ్లలోంచి నీళ్లు వస్తున్నాయంటే ఆటోమెటిగ్గా ముక్కు నుంచి కూడా నీళ్లు కారుతుంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఏడ్చినప్పుడు కళ్లతో పాటు ముక్కు నుంచి కూడా నీరు కారడం గమనిస్తాం. పెద్దవాళ్లు ఏడ్చేటప్పుడు కూడా తరచూ ముక్కు చీదడం లేదా తుడుచుకోవడం చూస్తుంటాం. అసలు కంటికి, ముక్కుకు సంబంధమేంటి? కన్నీళ్లు వచ్చే సమయంలోనే ముక్కులోంచి నీళ్ళు ఎందుకు వస్తాయి? అనేది ఇక్కడ తెలుసుకుందాం.

25
కళ్లు, ముక్కును కలిపే నాళం ఏది?

మన కళ్ల నుంచి ముక్కు వైపు కన్నీళ్లు వెళ్లేందుకు సహాయపడే వ్యవస్థను ''లాక్రిమల్ డ్రైనేజ్ సిస్టమ్'' అంటారు. ఇందులో ముఖ్యమైన భాగం నెసోలాక్రైమల్ డక్ట్ (Nasolacrimal duct). ఇది కళ్లలో ఉత్పత్తయ్యే అదనపు కన్నీళ్లను ముక్కులోకి తీసుకెళ్లే మార్గంగా పనిచేస్తుంది.

ఏడ్చేటప్పుడే కాదు సాధారణ పరిస్థితుల్లో కూడా మన కళ్లలో నిరంతరం కొద్దిపాటి కన్నీళ్లు ఉత్పత్తి అవుతుంటాయి. ఇవి కళ్లను తేమగా ఉంచడంతో పాటు దుమ్ము, చిన్నపాటి మలినాల నుంచి కళ్లను రక్షించడంలో సహాయపడతాయి. ఉపయోగం పూర్తయిన కన్నీళ్లు కళ్ల మూలల్లో ఉండే చిన్న రంధ్రాల ద్వారా డ్రైనేజ్ వ్యవస్థలోకి వెళ్లి చివరకు ముక్కులోకి చేరుతాయి. అందుకే తరచూ ముక్కులోంచి నీళ్లు వస్తుంటాయి.

ఏడ్చేటప్పుడు ముక్కులోంచి నీళ్లు ఎందుకు వస్తాయి?

మనకు భావోద్వేగం కలిగినప్పుడు లేదా ఎక్కువగా ఏడ్చినప్పుడు సాధారణం కంటే ఎక్కువ మొత్తంలో కన్నీళ్లు ఉత్పత్తి అవుతాయి. కళ్ల నుంచి వచ్చే ఈ కన్నీళ్లన్నీ డ్రైనేజ్ వ్యవస్థ ద్వారా వెంటనే ముక్కులోకి వెళ్లలేవు… కొంత భాగం చెంపలపైకి ప్రవహిస్తే, మరికొంత భాగం నెసోలాక్రైమల్ డక్ట్ ద్వారా ముక్కులోకి చేరతాయి.

అందుకే ఏడ్చేటప్పుడు కళ్ల నుంచి కన్నీళ్లు రావడంతో పాటు ముక్కులో నీరు పెరిగినట్లు అనిపిస్తుంది. ముక్కులోకి చేరిన కన్నీళ్లు అక్కడ ఉన్న సహజమైన ద్రవాలతో కలవడంతో ముక్కు నుంచి పలుచని నీటిలా బయటకు వస్తాయి.

35
చిన్నపిల్లలు ఏడిస్తే కళ్లు, ముక్కులోంచి నీళ్లు వస్తాయి.. ఎందుకు?

సాధారణంగా చిన్నపిల్లలు పెద్ద శబ్దంతో, ఎక్కువసేపు ఏడుస్తుంటారు. అలా ఏడ్చే సమయంలో ఎక్కువ మొత్తంలో కన్నీళ్లు ఉత్పత్తి అవుతాయి. కన్నీటి ప్రవాహం పెరిగినప్పుడు ముక్కులోకి చేరే ద్రవం కూడా ఎక్కువవుతుంది. అందుకే పిల్లలు ఏడ్చేటప్పుడు కళ్లతో పాటు ముక్కు నుంచి కూడా నీళ్లు కారడం స్పష్టంగా కనిపిస్తుంది. పెద్దవాళ్లలో కూడా ఇదే ప్రక్రియ జరుగుతుంది. అయితే వారు వెంటనే ముక్కు తుడుచుకోవడం లేదా చీదడం వల్ల అది మనకు ప్రత్యేకంగా కనిపించకపోవచ్చు.

కళ్లలో మందు వేస్తే నోట్లో రుచి ఎందుకు తెలుస్తుంది?

చాలామందికి కళ్లలో ఏవైనా డ్రాప్స్ వేసుకున్న తర్వాత కొద్దిసేపటికి ముక్కులో లేదా గొంతులో మందు రుచి, వాసన అనిపిస్తుంటుంది. దీనికి కూడా కళ్ల నుంచి ముక్కు వైపు ఉండే కన్నీటి ప్రవాహ మార్గమే కారణం.

కంటిలో వేసిన డ్రాప్‌లో కొంత భాగం కన్నీటి ప్రవాహంతో పాటు నెసోలాక్రైమల్ డక్ట్ ద్వారా ముక్కులోకి చేరవచ్చు. అక్కడి నుంచి అది ముక్కు వెనుక భాగం, గొంతు వైపు వెళ్లడంతో మందు రుచి నోట్లో లేదా గొంతులో అనిపించవచ్చు. అంటే కంటికి వేసిన ద్రవం కంటిలోనే పూర్తిగా ఉండిపోదు… అది ముక్కు, నోటిలోకి చేరుతుంది.

45
కన్నీళ్లు కేవలం భావోద్వేగాల వల్లే రావు

కన్నీళ్లు అంటే మనం బాధపడినప్పుడు లేదా సంతోషించినప్పుడు మాత్రమే వచ్చే ద్రవం కాదు. కళ్ల ఆరోగ్యానికి అవి చాలా అవసరం. కళ్ల ఉపరితలాన్ని తేమగా ఉంచడం, కంటి ఉపరితలాన్ని రక్షించడం, దుమ్ము వంటి చిన్న కణాలను తొలగించడంలో కన్నీళ్లు కీలక పాత్ర పోషిస్తాయి.

కన్నీళ్లను సాధారణంగా బేసల్ టియర్స్, రిఫ్లెక్స్ టియర్స్, ఎమోషనల్ టియర్స్‌గా వివరిస్తారు. కళ్లను తేమగా ఉంచే కన్నీళ్లు ఎప్పటికప్పుడు ఉత్పత్తి అవుతుంటాయి. పొగ, దుమ్ము, ఉల్లిపాయ వంటివి కంటికి ఇబ్బంది కలిగించినప్పుడు రిఫ్లెక్స్‌గా కన్నీళ్లు రావచ్చు. ఇక భావోద్వేగాలకు స్పందనగా వచ్చే కన్నీళ్లను ఎమోషనల్ టియర్స్ అంటారు.

55
ముక్కు కారడం అంటే జలుబేనా?

ఏడ్చినప్పుడు ముక్కు నుంచి నీళ్లు రావడం కనిపిస్తే తప్పనిసరిగా జలుబు వచ్చిందని అర్థం కాదు. ఏడుపు కారణంగా ఎక్కువైన కన్నీళ్లు కన్నీటి డ్రైనేజ్ మార్గం ద్వారా ముక్కులోకి చేరడం వల్ల కూడా ముక్కు కారవచ్చు. అయితే ఏడుపు లేకుండానే తరచూ ముక్కు కారడం, ముక్కు మూసుకుపోవడం, కళ్ల నుంచి నిరంతరం నీరు కారడం వంటి సమస్యలు ఉంటే వాటికి అలర్జీ, ఇన్ఫెక్షన్ లేదా కన్నీటి నాళాల్లో ఇతర సమస్యలు కారణం కావచ్చు. అలాంటి లక్షణాలు కొనసాగితే వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories