Sunday: ఆదివారం అంటే సెలవు దినం. సగటు ఉద్యోగి ఎప్పుడు ఆదివారం వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. అయితే ఆదివారం సెలవు సంప్రదాయం ముందు నుంచి లేదన్న విషయం మీకు తెలుసా.? దీని వెనకాల ఉన్న నేపథ్యంలో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆదివారం సెలవు దినం ఎప్పటినుంచో లేదు. 1890 జూన్ 10న అధికారికంగా ఆదివారాన్ని వారాంత సెలవుగా ప్రకటించారు. ఈ నిర్ణయం వెనుక కార్మికుల పోరాటం ఉంది. బ్రిటిష్ పాలనలో కార్మికులు వారంలో ఏడు రోజులు పనిచేయాల్సి వచ్చేది. ముఖ్యంగా బాంబే (ప్రస్తుతం ముంబై) మిల్లుల్లో పనిచేసే కార్మికుల పరిస్థితి చాలా కఠినంగా ఉండేది. పొడవైన పని గంటలు, విశ్రాంతి లేకపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారానికి ఒకరోజైనా సెలవు ఇవ్వాలని కార్మికుల్లో డిమాండ్ పెరిగింది.
25
నారాయణ్ లోఖండే పోరాటం
ఈ సమస్యను ముందుకు తీసుకువచ్చిన వ్యక్తి నారయణ్ లోఖండే. ఆయనను భారత కార్మిక ఉద్యమ పితామహుడిగా కూడా పిలుస్తారు. 1881 నుంచి 1884 మధ్య కాలంలో ఆయన కార్మికుల తరఫున ఆందోళనలు చేశారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించారు. సుమారు 10 వేల మంది కార్మికులను ఒకే తాటిపైకి తీసుకువచ్చారు. దాదాపు 7 సంవత్సరాల పాటు పోరాటం కొనసాగించారు. ఈ ఒత్తిడితో చివరకు బ్రిటిష్ ప్రభుత్వం 1890 జూన్ 10న ఆదివారాన్ని వారాంత సెలవుగా ప్రకటించింది. ఇది కార్మికుల హక్కుల కోసం సాధించిన పెద్ద విజయం.
35
ఆదివారాన్నే ఎందుకు ఎంపిక చేశారు?
ఆదివారం సెలవుగా ప్రకటించడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిగా, బ్రిటిష్ అధికారులు క్రైస్తవ మతాన్ని అనుసరించేవారు. వారికి ఆదివారం ప్రార్థన రోజు. చర్చికి వెళ్లే రోజు కావడంతో ఆదివారం సెలవుగా ఉండేది. రెండవది, భారతీయ సంప్రదాయంలో కూడా ఆదివారం ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు సూర్యభగవానునికి సంబంధించినది అని భావిస్తారు. కార్మికులు విశ్రాంతి తీసుకోవడానికి ఇది సరైన రోజు అని లోఖండే వివరించారు.
ఆదివారం సెలవు సంప్రదాయం భారత్‌లో మొదలుకాలేదు. దీని చరిత్ర చాలా పాతది. రోమన్ సామ్రాజ్యంలో Constantine the Great క్రీ.శ. 321లో ఆదివారాన్ని అధికారిక విశ్రాంతి దినంగా ప్రకటించారు. తర్వాత ఈ పద్ధతి యూరప్ దేశాలకు విస్తరించింది. బ్రిటిష్ పాలన ద్వారా భారత్‌కు వచ్చింది.
55
ఇప్పటికీ ఆదివారం ప్రాముఖ్యత
ఇప్పటికీ ఆదివారం ప్రపంచంలోని చాలా దేశాల్లో వారాంత సెలవు రోజుగా పాటిస్తున్నారు. భారత్‌లో కూడా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఎక్కువ ప్రైవేట్ సంస్థలు ఆదివారం మూసివేస్తాయి. కార్మికుల పోరాటంతో ప్రారంభమైన ఈ సంప్రదాయం ఇప్పుడు ప్రతి భారతీయుడి జీవితంలో భాగమైంది. ఆదివారం సెలవు వెనుక కార్మికుల చరిత్ర దాగి ఉంది.