
ఒకప్పుడు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపాలన్నా బ్యాంకుకు వెళ్ళాల్సి వచ్చేది… టెక్నాలజీ పుణ్యమా అని ఒక్క క్లిక్ తో అన్నిపనులు అయిపోతున్నాయి. ఫిజికల్ కరెన్సీ వినియోగం బాగా తగ్గిపోయింది… ఇప్పుడన్నీ ఆన్లైన్ లావాదేవీలే. స్మార్ట్ ఫోన్ వుందంటే చాలు…. ఫోన్ పే, గూగుడ్ పే నుండే అన్ని ఆర్థిక లావాదేవీలు జరిగిపోతున్నాయి… ఎక్కువమొత్తంలో అయితే బ్యాంక్ మొబైల్ యాప్స్ వినియోగిస్తున్నారు.
అయితే ఇలా ఆన్ లైన్ పేమెంట్స్ కి అలవాటుపడి చాలామంది అకౌంట్లో ఎన్ని డబ్బులున్నాయో కూడా చూసుకోవడం లేదు. ఇదే అదునుగా కొన్ని బ్యాంకులు ఏవేవో సర్వీసుల పేరిట మన అనుమతి లేకుండానే డబ్బులు కట్ చేసుకుంటున్నాయి. ఇలా మనకు తెలియకుండానే డబ్బులు కట్ అవ్వడం ఆందోళన కలిగించే అంశం.
కొన్నిసార్లు సైబర్ నేరగాళ్లు ఫేక్ మెసేజ్‌లు, మోసపూరిత లింక్‌లు, ఫోన్ కాల్స్, నకిలీ యాప్స్ ద్వారా బ్యాంక్ వివరాలు దొంగిలిస్తున్నారు. దీంతో కస్టమర్ ఎలాంటి తప్పు చేయకపోయినా అకౌంట్ నుంచి డబ్బులు మాయం అవుతాయి. ఇలా డబ్బులు పోగొట్టుకున్న బాధితులు వెంటనే తమ బ్యాంకును సంప్రదించి ఫిర్యాదు చేయాలి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూల్స్ ప్రకారం.. బ్యాంక్ తప్పు వల్ల డబ్బులు కట్ అయితే కస్టమర్‌కు ఎలాంటి బాధ్యత ఉండదు. బ్యాంక్ లేదా కస్టమర్ తప్పు లేకుండా థర్డ్ పార్టీ వల్ల మోసం జరిగినా.. నిర్ణీత సమయంలోగా ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యం. అయితే ప్రతి మోసంలోనూ పోయిన డబ్బులు మొత్తం ఆటోమేటిక్‌గా తిరిగి వస్తాయని గ్యారెంటీ లేదు.
మీ అకౌంట్లో అనుమానాస్పద లావాదేవీ జరిగినట్లు గుర్తించిన వెంటనే బ్యాంక్ కు సమాచారం అందించండి… అఫీషియల్ కస్టమర్ కేర్ నంబర్ లేదా యాప్ ద్వారా ఫిర్యాదు చేయండి. అవసరమైతే బ్యాంక్ అకౌంట్, డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను తాత్కాలికంగా బ్లాక్ చేయించండి.
లావాదేవీ జరిగిన తేదీ, కట్ అయిన అమౌంట్, ట్రాన్సాక్షన్ ఐడీ, బ్యాంక్ నుంచి వచ్చిన మెసేజ్, కంప్లైంట్ నంబర్‌ను సేవ్ చేసి పెట్టుకోండి. ఆన్లైన్ మోసాలకు సంబంధించి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి వెంటనే కాల్ చేయండి. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా కూడా ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు.
కంప్లైంట్ చేసిన తర్వాత వచ్చే అక్నాలెడ్జ్మెంట్ నంబర్‌ను జాగ్రత్తగా ఉంచుకుంటే.. తర్వాత విచారణకు, డబ్బులు వెనక్కి రప్పించడానికి ఉపయోగపడుతుంది. బ్యాంకులో, సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయడంలో అస్సలు ఆలస్యం చేయవద్దు.
బ్యాంక్ తప్పు లేదా లోపం వల్ల మీ ప్రమేయం లేకుండా డబ్బులు కట్ అయితే.. కస్టమర్‌కు ఎలాంటి బాధ్యత ఉండదు (జీరో లయబిలిటీ). కస్టమర్ తప్పు, బ్యాంక్ తప్పు లేకుండా థర్డ్ పార్టీ వల్ల డబ్బులు పోతే.. లావాదేవీ గురించి మెసేజ్ వచ్చిన మూడు పని దినాల్లోగా (వర్కింగ్ డేస్) ఫిర్యాదు చేయాలి. అప్పుడు రూల్స్ ప్రకారం కస్టమర్‌కు జీరో లయబిలిటీ వర్తిస్తుంది.
నాలుగు నుంచి ఏడు పని దినాల్లోగా ఫిర్యాదు చేస్తే.. అకౌంట్ రకం, లిమిట్స్‌ను బట్టి బాధ్యతను నిర్ణయిస్తారు. ఏడు రోజుల కంటే ఎక్కువ ఆలస్యమైతే బ్యాంక్ పాలసీ వర్తిస్తుంది. అయితే కస్టమర్ తన పాస్వర్డ్, ఓటీపీ లేదా బ్యాంక్ వివరాలను ఇతరులతో షేర్ చేసుకోవడం వల్ల డబ్బులు పోతే.. బ్యాంకుకు ఫిర్యాదు చేసే వరకు జరిగిన నష్టాన్ని కస్టమరే భరించాల్సి వస్తుంది. అందుకే మోసం ఎలా జరిగింది, ఎంత త్వరగా ఫిర్యాదు చేశామనేది ఇక్కడ చాలా ముఖ్యం.
ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. జీరో లయబిలిటీ లేదా లిమిటెడ్ లయబిలిటీ వర్తించే అనధికారిక లావాదేవీల విషయంలో, కస్టమర్ ఫిర్యాదు చేసిన 10 పని దినాల్లోగా ఆ మొత్తాన్ని బ్యాంక్ అకౌంట్లో తాత్కాలికంగా జమ చేయాలి. అయితే ఇదే ఫైనల్ కాదు, అన్ని మోసాలకు ఇది వర్తించదు. బ్యాంక్ దీనిపై విచారణ కొనసాగిస్తుంది. ఆ విచారణ ఫలితాన్ని బట్టి కస్టమర్ బాధ్యతను ఫైనల్‌గా నిర్ణయిస్తారు.
ఫిర్యాదు చేయడానికి ఏడు రోజుల వరకు వేచి చూడొచ్చు అనుకోవడం పొరపాటు. మోసం జరిగినట్లు తెలిసిన వెంటనే కంప్లైంట్ చేయడం మంచిది. ఫిర్యాదు కాపీ, బ్యాంక్ రిప్లై, లావాదేవీ వివరాలు, సైబర్ క్రైమ్ కంప్లైంట్ నంబర్‌ను సేవ్ చేసి పెట్టుకోండి. బ్యాంక్ మీ సమస్యను పరిష్కరించకపోతే.. బ్యాంక్ గ్రీవెన్స్ సెల్‌ను సంప్రదించిన తర్వాత ఆర్బీఐ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
బ్యాంక్ నుంచి వచ్చినట్లు కనిపించే అనుమానాస్పద లింక్‌లను అస్సలు ఓపెన్ చేయవద్దు. మీ ఓటీపీ, యూపీఐ పిన్, కార్డ్ వివరాలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. బ్యాంక్ అధికారులమని చెప్పి ఫోన్ చేసే వాళ్లకు కూడా మీ రహస్య వివరాలు చెప్పకండి. అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినట్లు మెసేజ్ వస్తే.. అది నిజమైన లావాదేవీనా కాదా అని బ్యాంక్ అఫీషియల్ యాప్ లేదా వెబ్సైట్లో చెక్ చేసుకోండి. మోసం జరిగిందని కన్ఫర్మ్ అయితే వెంటనే బ్యాంకును, 1930 హెల్ప్‌లైన్‌ను సంప్రదించండి.
ఫిర్యాదు చేయడంలో ఆలస్యం చేస్తే డబ్బులు తిరిగి పొందే అవకాశాలు తగ్గిపోతాయి. ఆర్బీఐ రూల్స్ కస్టమర్లకు రక్షణ కల్పించినప్పటికీ.. పోయిన డబ్బులు పూర్తిగా తిరిగి రావడం అనేది జరిగిన మోసం, విచారణపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి డబ్బులు పోయిన వెంటనే అలర్ట్ అవ్వడం, ఆధారాలు దాచుకోవడం, అఫీషియల్‌గా ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యం.