
తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం నగరానికి సమీపంలో ఉన్న కడియం మండలం, కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా యావత్ భారతదేశానికే గర్వకారణమైన ఉద్యానవన కేంద్రం. పచ్చని తివాచీ పరిచినట్లు కనిపించే వేలాది ఎకరాల నర్సరీలు, రంగురంగుల పూలతో కడియం ప్రయాణికులకు కనువిందు చేస్తుంది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ ప్రాంతం, నేడు ప్రపంచ స్థాయి మొక్కల ఎగుమతి కేంద్రంగా ఎదిగింది.
వందేళ్లకు పైగా చరిత్ర – వేలాది నర్సరీలు
కడియం నర్సరీ రంగానికి వందేళ్లకు పైగా చరిత్ర ఉందని పలు అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. చిన్న కుటుంబ నర్సరీలతో మొదలైన ఈ రంగం నేడు వేలాది ఎకరాలకు విస్తరించింది. కాలక్రమంలో సంప్రదాయ మొక్కల పెంపకం ఆధునిక పద్ధతులతో కలసి పెద్ద వ్యాపార రంగంగా అభివృద్ధి చెందింది.కడియం ప్రాంతంలో నర్సరీల సంఖ్య, సాగు విస్తీర్ణం వివిధ నివేదికల్లో వేర్వేరుగా ఉన్నప్పటికీ, సుమారు 3,000 నర్సరీలు, 5,000 ఎకరాల వరకు విస్తరించిన నర్సరీ సాగు గురించి పలు నివేదికలు ప్రస్తావించాయి. ఈ రంగం స్థానిక ప్రజలకు ఉపాధి కల్పిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోంది.
కడియం ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ 'గులాబీ తోట' (Rose Garden of Andhra Pradesh) అని పిలుస్తుంటారు. అయితే అలా పిలవడానికి బలమైన కారణం ఉంది. ఇక్కడి గోదావరి ఒండ్రు నేలలు, అనుకూలమైన వాతావరణం గులాబీ మొక్కల పెంపకానికి అత్యంత అనువుగా ఉంటాయి. దేశంలో మరెక్కడా లేని విధంగా ఇక్కడ సుమారు 200కు పైగా రకాల గులాబీ మొక్కలు అందుబాటులో ఉంటాయి. సాధారణ నాటు గులాబీల నుంచి అరుదైన హైబ్రిడ్, బటన్ రోజ్, క్రీపర్ రోజ్, డచ్ రోజ్ వంటి ఎన్నో రకాల గులాబీలను ఇక్కడి రైతులు అంటుకట్టే (Grafting) పద్ధతిలో ఉత్పత్తి చేస్తారు. కేవలం మొక్కలే కాకుండా, అలంకరణకు ఉపయోగించే కట్ ఫ్లవర్స్ (గులాబీ పూలు) కూడా ఇక్కడి నుంచి భారీగా మార్కెట్‌కు వెళ్తాయి. అందుకే కడియం పేరు వినగానే గులాబీ తోటలు గుర్తుకువస్తాయి.
వేలాది రకాల మొక్కల నిలయం
కడియం నర్సరీలలో కేవలం పూల మొక్కలే కాకుండా పండ్ల మొక్కలు, అలంకరణ మొక్కలు (Ornamental plants), ఇండోర్ ప్లాంట్స్, బోన్సాయ్ మొక్కలు, ఔషధ మొక్కలు, నీడనిచ్చే భారీ వృక్ష జాతులు లభిస్తాయి. కడియపులంక, బుర్రిలంక, వేమగిరి, పొottilanka, జేగురుపాడు వంటి గ్రామాల్లో సుమారు 5,000 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 3000కు పైగా చిన్న, పెద్ద నర్సరీలు విస్తరించి ఉన్నట్టు సమాచారం మాత్రమే. థాయ్‌లాండ్, మలేషియా, చైనా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి విత్తనాలు, టిష్యూ కల్చర్ మొక్కలను తెప్పించి ఇక్కడి వాతావరణానికి అనుగుణంగా పెంచి విక్రయిస్తారు.
కడియం నర్సరీలు దేశంలోని అనేక రాష్ట్రాలకు మొక్కలను సరఫరా చేయడంతోపాటు విదేశీ మార్కెట్లకూ చేరుతున్నాయి. గల్ఫ్ దేశాలు, మధ్యప్రాచ్య ప్రాంతాల్లో తోటలు, పార్కులు, భవనాల సుందరీకరణ కోసం భారతీయ మొక్కలకు డిమాండ్ ఉంది. కడియం నుంచి మొక్కల ఎగుమతుల విషయంలో బహ్రెయిన్, కువైట్, మాల్దీవులు, ఒమన్, ఖతార్, యూఏఈ వంటి మార్కెట్లను జిల్లా ఎగుమతి ప్రణాళికలు ప్రస్తావించాయి.విదేశాలకు మొక్కలను పంపేటప్పుడు మొక్కల ఆరోగ్యం, పురుగులు, వ్యాధులు, ప్యాకింగ్, ఫైటోశానిటరీ సర్టిఫికేషన్ వంటి నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా కడియం నర్సరీలు తమ ఉత్పత్తి, ప్యాకింగ్ విధానాలను మెరుగుపరుచుకుంటున్నాయి.
కోట్లలో వ్యాపారం
కడియం నర్సరీల వ్యాపారం ఏటా వందల కోట్ల రూపాయలలో జరుగుతుంది. అధికారిక , ఉద్యానవన శాఖ అంచనాల ప్రకారం, కడియం ప్రాంతం నుంచి ఏటా సుమారు ₹300 కోట్ల నుండి ₹500 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుందని సమాచారం. ఇక్కడి నుంచి ప్రతిరోజూ వందలాది లారీలు, కంటైనర్ల ద్వారా లక్షలాది మొక్కలు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ వంటి రాష్ట్రాలకు తరలివెళ్తాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు, హైవేల పక్కన నాటే మొక్కలు, మున్సిపల్ పార్కులు , ఫామ్ హౌస్‌ల కోసం కడియం మొక్కలనే ఎంచుకుంటారు.
ఈ నర్సరీ పరిశ్రమ ప్రత్యక్షంగా , పరోక్షంగా సుమారు 30,000 నుండి 50,000 మంది కూలీలు, నిపుణులకు జీవనోపాధి కల్పిస్తోంది. మొక్కల అంటుకట్టడంలో కడియం కార్మికులకు ఉన్న నైపుణ్యం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ఇక్కడి రైతులు సంప్రదాయ పద్ధతులతో పాటు గ్రీన్ హౌస్‌లు, షేడ్ నెట్లు, డ్రిప్ ఇరిగేషన్, ఆధునిక టిష్యూ కల్చర్ ల్యాబ్‌లను కూడా ఉపయోగిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఉద్యానవన శాఖ కడియం నర్సరీల అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జరిగే హరితహారం వంటి ప్రభుత్వ కార్యక్రమాలకు కడియం నర్సరీలే ప్రధాన వనరుగా నిలుస్తున్నాయి. ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు కడియం ఒక అద్భుతమైన హరిత పర్యాటక కేంద్రంగానూ (Green Tourism Hub) విరాజిల్లుతోంది.