ఆకాశం నుంచి నీళ్లు వర్షంగా కురువడం మనందరికీ తెలిసిందే. మరికొన్నిచోట్ల చేపలు, కప్పలు కూడా వర్షంలా కురుస్తాయి. కానీ ఒకచోట చిన్న చిన్న వజ్రాలు వానలా కురుస్తాయి. ఎక్కడో తెలుసా? అంతరిక్షంలోని ఒక గ్రహంపై. శాస్త్రవేత్తలు అంతరిక్షంలో ఇలాంటి ఒక గ్రహాన్ని కనుగొన్నారు. ఇక్కడి కార్బన్ మేఘాలు వజ్రాలు ఏర్పడటానికి అనువైన పరిస్థితులను కలిగిఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
Spacedaily.com ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ గ్రహం పేరు PSR J2322-2650b. శాస్త్రవేత్తలు 2017లోనే పల్సర్ టైమింగ్ టెక్నిక్‌తో ఈ గ్రహాన్ని కనుగొన్నారు. అయితే, ఇటీవల జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ దీని వాతావరణంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసింది.
ఈ గ్రహం పరిమాణంలో బృహస్పతి పరిమాణంలో ఉంటుంది. కానీ దీని వాతావరణం, అందులోని పదార్థాలు చాలా ప్రత్యేకంగా మార్చాయి. ఇది 'చనిపోయిన నక్షత్రం' చుట్టూ తిరుగుతుండటంతో చాలా వేడిగా, ప్రమాదకరంగా ఉంటుంది. దీని వాతావరణంలో పూర్తిగా కార్బన్, హీలియం మాత్రమే ఉన్నాయి. భూమిపై ఉండే ఆక్సిజన్, నైట్రోజన్ లాంటివి ఇక్కడ లేవు. పొగ, మసి లాంటి కణాలతో నిండిన దీని వాతావరణం చాలా వింతగా ఉంటుంది.