House Construction Tips : స్విమ్మింగ్ పూల్‌తో ఇల్లు కట్టాలంటే ఎంత ఖర్చవుతుంది? బడ్జెట్‌లో ఎలా ప్లాన్ చేసుకోవాలి?

Published : Nov 11, 2026, 11:41 AM IST

స్విమ్మింగ్ పూల్ కూడిన లగ్జరీ ఇల్లు ఉండాలని చాలామంది కలలు కంటుంటారు. అందుకే 1,000 లేదా 1,500 చదరపు అడుగుల్లో ఇల్లు కట్టడానికి, స్విమ్మింగ్ పూల్ ఏర్పాటుకు అయ్యే ఖర్చు, తక్కువ బడ్జెట్‌లో ఎలా పూర్తి చేయవచ్చో ఇక్కడ తెలుసుకుందాం!

PREV
16
స్విమ్మింగ్ పూల్‌తో ఇల్లు కట్టాలంటే ఎంత బడ్జెట్ కావాలి?

సొంతిల్లు కట్టుకోవాలని చాలా మందికి ఉంటుంది. ఆ ఇంటి ముందు ఓ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటే ఇంకెంత బాగుంటుంది? వీకెండ్స్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి, ఇంట్లోనే స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కానీ స్విమ్మింగ్ పూల్‌తో ఇల్లు కట్టాలంటే అసలు ఎంత ఖర్చవుతుంది అనే సందేహం చాలా మందికి ఉంటుంది.

2026 నాటి నిర్మాణ అంచనాల ప్రకారం… అన్ని మౌలిక సదుపాయాలతో నాణ్యమైన ఇల్లు నిర్మించడానికి చదరపు అడుగుకు రూ.2,200 నుంచి రూ.2,800 వరకు ఖర్చు అవుతుంది. స్విమ్మింగ్ పూల్ ఖర్చును దీనికి అదనంగా లెక్కించుకోవాలి.

ఉదాహరణకు 1,000 చదరపు అడుగుల్లో ఇల్లు కట్టాలంటే రూ.22 లక్షల నుంచి రూ.28 లక్షల వరకు అవుతుంది. దానికి తోడు ఒక చిన్న లేదా మీడియం సైజ్ స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడానికి రూ.7 లక్షల నుంచి రూ.13 లక్షల వరకు ఖర్చవుతుంది. అంటే స్థలం ధర కాకుండా కేవలం నిర్మాణానికి రూ.29 లక్షల నుంచి రూ.41 లక్షల వరకు ప్రాథమిక బడ్జెట్ అవసరమవుతుంది.

26
1,000 లేదా 1,500 చదరపు అడుగుల్లో ఇల్లు కట్టాలంటే ఎంత ఖర్చవుతుంది?

ఇంటి నిర్మాణ వ్యయం అనేది ఆ ఇంటి విస్తీర్ణం, వాడే మెటీరియల్స్ నాణ్యత, గదుల సంఖ్య, అంతస్తుల సంఖ్య, ఇంటీరియర్ డిజైన్ లాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

నాణ్యమైన నిర్మాణానికి చదరపు అడుగుకు సగటున రూ.2,200 నుంచి రూ.2,800 వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తే…

  • 1,000 చదరపు అడుగుల ఇల్లు : రూ.22 లక్షల నుంచి రూ.28 లక్షల వరకు.
  • 1,500 చదరపు అడుగుల ఇల్లు : రూ.33 లక్షల నుంచి రూ.42 లక్షల వరకు.
  • 2,000 చదరపు అడుగుల ఇల్లు: రూ.44 లక్షల నుంచి రూ.56 లక్షల వరకు ఖర్చవుతుంది.

ఇవన్నీ కేవలం ఇంటి నిర్మాణ వ్యయానికి సంబంధించిన అంచనాలు మాత్రమే. స్థలం ధర, మున్సిపల్ పర్మిషన్, కాంపౌండ్ వాల్, బోర్‌వెల్, వాటర్ ట్యాంక్, ఔట్‌డోర్ వర్క్స్, ఇంటీరియర్ డిజైనింగ్ లాంటి వాటన్నింటికీ అదనపు బడ్జెట్ కావాల్సిందే.

36
ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చవుతుంది?

స్విమ్మింగ్ పూల్ సైజు, లోతు, నిర్మాణ పద్ధతి, ఉపయోగించే ఎక్విప్‌మెంట్స్ ఆధారంగా ఖర్చు మారుతూ ఉంటుంది. సాధారణంగా ఇళ్లలో నిర్మించే స్విమ్మింగ్ పూల్స్ కోసం మూడు రకాల పద్ధతులను ఎంచుకోవచ్చు.

1. ఆర్‌సీసీ కాంక్రీట్ స్విమ్మింగ్ పూల్

మనకు కావాల్సిన సైజు, ఆకారం, లోతులో నిర్మించుకోవచ్చు. బలమైన నిర్మాణం, పక్కాగా వాటర్ ప్రూఫింగ్ చేయడం చాలా ముఖ్యం. చదరపు అడుగుకు రూ.2,500 నుంచి రూ.4,500 వరకు ఖర్చవుతుంది.

2. ఫైబర్‌గ్లాస్ (FRP) స్విమ్మింగ్ పూల్

ముందుగానే తయారు చేసిన పూల్‌ను తీసుకొచ్చి అమర్చే పద్ధతి ఇది. టైమ్ కూడా చాలా సేవ్ అవుతుంది. దీనికి చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.3,500 వరకు ఖర్చవుతుంది.

3. వినైల్ లైనర్ స్విమ్మింగ్ పూల్

తక్కువ బడ్జెట్‌లో ఏర్పాటు చేసుకునేందుకు ఇది బెస్ట్ ఆప్షన్. చదరపు అడుగుకు రూ.1,200 నుంచి రూ.2,000 వరకు అవుతుంది. కానీ ఆ లైనర్‌ను కొంతకాలం తర్వాత కచ్చితంగా మార్చాల్సి ఉంటుంది.

ఉదాహరణకు 12×24 అడుగుల ఆర్‌సీసీ కాంక్రీట్ ఫ్యామిలీ పూల్ నిర్మించడానికి సుమారు రూ.7 లక్షల నుంచి రూ.13 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమే. తవ్వకం పనులు, పూల్ చుట్టూ వాక్‌వే, లైటింగ్, మోటార్ రూమ్ వంటి వాటికి అదనంగా ఖర్చు అవుతుంది.

46
తక్కువ ఖర్చులో స్విమ్మింగ్ పూల్‌తో ఇల్లు కట్టాలంటే ఏం చేయాలి?

స్విమ్మింగ్ పూల్‌తో ఇల్లు కట్టాలన్నంత మాత్రాన లక్షలు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ముందుగానే పక్కాగా ప్లాన్ చేసుకుంటే అనవసర ఖర్చులను తగ్గించుకోవచ్చు.

ఇంటి సైజును ప్లాన్ చేసుకోండి

అవసరానికి మించి పెద్ద సైజు ఇల్లు కట్టడం మానుకోండి. మీకు కావాల్సిన గదులు, వాటి ఉపయోగాన్ని బట్టి డిజైన్ చేసుకోండి.

చిన్న స్విమ్మింగ్ పూల్ ఎంచుకోండి

కేవలం స్విమ్మింగ్ ప్రాక్టీస్ కోసమే అయితే భారీ సైజు పూల్ అవసరం లేదు. మీ స్థలం, బడ్జెట్‌కు సరిపోయే సైజును ఎంచుకోండి.

సింపుల్ డిజైన్‌ను వాడండి

పూల్‌లో కర్వ్స్, వాటర్‌ఫాల్ సెటప్స్, డెకరేటివ్ లైటింగ్స్ లాంటి హంగులను తగ్గిస్తే ఖర్చు బాగా కంట్రోల్ అవుతుంది.

మెటీరియల్స్ ధరలను సరిపోల్చండి

ఒకే క్వాలిటీ ఉన్న మెటీరియల్స్‌ను వేర్వేరు కంపెనీలు ఎంతకు ఇస్తున్నాయో ఆరా తీసి బేరీజు వేసుకోండి.

ఇల్లు కట్టేప్పుడే పూల్ ప్లాన్ చేయండి

ఇంటి ప్లాన్ ఫైనల్ చేసేప్పుడే స్విమ్మింగ్ పూల్ ప్లేస్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ కనెక్షన్స్ లాంటివన్నీ ప్లాన్ చేస్తే తర్వాత మార్పులు చేయడానికి అయ్యే ఖర్చు మిగులుతుంది.

56
ఇల్లు, స్విమ్మింగ్ పూల్ కట్టేటప్పుడు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడనివి ఇవే!

ఖర్చు తగ్గించుకోవడం ముఖ్యం కావొచ్చు.. కానీ భద్రత, నాణ్యత విషయంలో రాజీపడితే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇంటి పునాది, కాంక్రీట్, స్టీల్, ఎలక్ట్రికల్ వైరింగ్, ప్లంబింగ్ పనులకు నాణ్యమైన వస్తువులనే వాడాలి. అలాగే స్విమ్మింగ్ పూల్ కట్టేటప్పుడు వాటర్ ప్రూఫింగ్, ఫిల్టరేషన్ సిస్టమ్, పంపు మోటార్ల క్వాలిటీపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

స్విమ్మింగ్ పూల్ కట్టే చోట మట్టి స్వభావం ఎలా ఉంది, గ్రౌండ్ వాటర్ లెవెల్ ఎంత, వర్షపు నీరు వెళ్లే మార్గం ఉందా లేదా అన్నది ముందుగానే చెక్ చేయించుకోవాలి. ఒకవేళ టెర్రస్ మీద పూల్ కట్టాలనుకుంటే, నీటి బరువును ఆ బిల్డింగ్ మోయగలదా లేదా అనేది స్ట్రక్చరల్ ఇంజనీర్‌తో కచ్చితంగా సర్టిఫై చేయించుకోవాలి.

స్విమ్మింగ్ పూల్ మెయింటెనెన్స్‌కు ఎంత ఖర్చవుతుంది?

స్విమ్మింగ్ పూల్ కట్టేస్తే సరిపోదు. అందులోని నీటిని శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంచుకోవడానికి రెగ్యులర్‌గా మెయింటైన్ చేయాలి. నీటి నాణ్యతను చెక్ చేయడం, కెమికల్స్ కలపడం, ఫిల్టర్లను క్లీన్ చేయడం, మోటార్లు, ఇతర పార్ట్స్‌ను సరిగ్గా పనిచేసేలా చూసుకోవడం తప్పనిసరి.

భారత్‌లో ఇంట్లో ఉండే స్విమ్మింగ్ పూల్స్ వార్షిక నిర్వహణ కోసం సుమారు రూ.30 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు ఖర్చవుతుంది. పూల్ సైజు, వాడే విధానం, మెయింటైన్ చేసే పద్ధతిని బట్టి ఈ ఖర్చు మారుతుంది. కరెంట్, వాటర్ బిల్లులు, రిపేర్లకు అయ్యే ఖర్చులను కూడా విడిగా లెక్కేసుకోవాలి.

66
ఇల్లు కట్టే ముందు ఈ విషయాలు తప్పక గమనించండి!

స్విమ్మింగ్ పూల్‌తో ఇల్లు కట్టుకోవాలనేది అందమైన కలే అయినా, దానికి పక్కా ప్లానింగ్ చాలా ముఖ్యం. ముందుగా మీ టోటల్ బడ్జెట్ ఎంతో ఫిక్స్ చేసుకోండి. అందులో ఇల్లు, పూల్, పర్మిషన్లు, ఔట్‌డోర్ వర్క్స్, మెయింటెనెన్స్ కోసం దేనికది విడిగా ఫండ్స్ కేటాయించండి.

ఇంటి ప్లాన్, స్విమ్మింగ్ పూల్ డిజైన్‌ను అనుభవజ్ఞులైన ఆర్కిటెక్ట్, ఇంజనీర్‌తో మాత్రమే గీయించుకోండి. కనీసం ముగ్గురు బిల్డర్ల దగ్గర కొటేషన్స్ తీసుకుని పోల్చి చూడండి. అగ్రిమెంట్‌లో వాడే మెటీరియల్స్ క్వాలిటీ, వర్క్ డీటెయిల్స్, కంప్లీషన్ టైమ్, ఎక్స్‌ట్రా ఛార్జీల గురించి క్లియర్‌గా రాయించుకోండి.

అన్నింటికంటే ముఖ్యంగా అనుకోని ఖర్చుల కోసం మొత్తం ప్రాజెక్ట్ బడ్జెట్‌లో 10 నుంచి 15 శాతం అమౌంట్‌ను ఎమర్జెన్సీ ఫండ్‌గా పక్కన పెట్టుకోవడం మంచిది. సరైన ప్లానింగ్ ఉంటే, అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా నాణ్యమైన ఇల్లు, అందమైన స్విమ్మింగ్ పూల్‌ను మీ బడ్జెట్లోనే కట్టుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories