నిమ్మకాయలు ఎప్పుడు కాస్తాయి అనేది మొక్క వయసు, రకం, వెలుతురు, పోషకాలు, మనం తీసుకునే జాగ్రత్తలపై ఆధారపడి ఉంటుంది. చిన్న పొట్టి రకం మొక్కలు కొన్ని ఏళ్లు పెరిగాకే కాయలు కాయడం మొదలుపెడతాయి. కొన్ని నిమ్మ రకాల్లో పూత వచ్చాక, కాయ పూర్తిగా పండటానికి ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం కూడా పట్టొచ్చు. కుండీ సైజు చెట్టు ఎదుగుదలను, కాయల ఉత్పత్తిని నియంత్రిస్తుంది. సరైన రకం, కనీసం 6 గంటల పాటు నేరుగా ఎండ, మంచి డ్రైనేజీ, సరైన నీరు, పోషకాలు ఉంటేనే ఇంట్లో నిమ్మకాయల దిగుబడిని ఆశించగలం.
నీళ్లు పోసే విషయంలో చాలామంది చేసే పెద్ద తప్పు.. "ఎక్కువ నీళ్లు పోస్తే ఎక్కువ పెరుగుతుంది" అని అనుకోవడం. ఇది పూర్తిగా తప్పు. నిమ్మ చెట్టుకు రోజూ నీళ్లు పోయాలనే రూల్ ఏమీ లేదు. ఎండ, గాలి, కుండీ సైజు, మట్టి మిశ్రమాన్ని బట్టి అవసరమైన నీటి పరిమాణం మారుతుంది. మట్టి ఎప్పుడూ బురదగా లేదా మరీ తడిగా ఉండకూడదు. నీళ్లు పోసినప్పుడు, అడుగున ఉన్న రంధ్రాల ద్వారా అదనపు నీరు బయటకు వెళ్లిపోవాలి. కుండీ కింద పెట్టే ప్లేట్‌లో నీళ్లు నిలిచిపోకుండా చూసుకోవడం చాలా అవసరం.