ఆవులు, గేదెల కనుపాప (Pupil) నిర్మాణం మనిషి కళ్ల కంటే పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. మనుషుల కనుపాప గుండ్రంగా ఉంటే, పశువుల కనుపాప అడ్డంగా (Horizontal Slit) ఉంటుంది. ఇలాంటి కనుపాప అమరిక వల్ల నేలమట్టానికి సమాంతరంగా ఉండే విశాల ప్రాంతాన్ని కూడా ఒకేసారి స్పష్టంగా చూడటానికి పశువులకు వీలవుతుంది. ముఖ్యంగా పశువులు మేత మేసేటప్పుడు తల కిందకు దించినప్పటికీ ఇరువైపులా, వెనుక భాగంలో ఏం జరుగుతుందో ఈ ప్రత్యేకమైన కనుపాప సహాయంతో గమనించగలవు. అందుకే అవి వెనకాల చిన్న కదలిక ఉన్న అలర్ట్ అవుతాయి… పరుగుతీస్తాయి.
పశువుల దేన్నయినా చూసేటప్పుడు రెండు రకాల దృష్టి వ్యవస్థలు ఒకే సమయంలో పనిచేస్తాయి.
ఏక నేత్ర దృష్టి (Monocular Vision) : కళ్లు తలకు ఇరువైపులా ఉండటం వల్ల, కుడి కన్ను కుడివైపు, వెనుక దృశ్యాన్ని, ఎడమ కన్ను ఎడమవైపు, వెనుక దృశ్యాన్ని వేర్వేరుగా చూడగలవు. ఈ ఏక నేత్ర దృష్టి ద్వారానే అవి తల తిప్పకుండా వెనుక భాగాన్ని గమనిస్తాయి.
ద్వి నేత్ర దృష్టి (Binocular Vision) : నేరుగా ముందుకు చూసేటప్పుడు రెండు కళ్లను కలిపి దాదాపు 25 నుండి 50 డిగ్రీల చిన్న పరిధిలో చూస్తాయి. ఇది వస్తువుల దూరాన్ని కచ్చితంగా అంచనా వేయడానికి తోడ్పడుతుంది.