
భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం, ఆక్వా రంగాలతో పాటు పౌల్ట్రీ పరిశ్రమ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా కోడిగుడ్ల ఉత్పత్తిలో మన దేశం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఔత్సాహిక రైతులు వేలాది పౌల్ట్రీ ఫారాలు నిర్వహిస్తున్నారు.. దీంతో ప్రపంచంలోనే కోడిగుడ్ల ఉత్పత్తిలో ఇండియా టాప్ 2 లో ఉంది.
అయితే ఇండియాలోనే కొన్ని రాష్ట్రాలు మాంసం ఉత్పత్తిలో, మరికొన్ని గుడ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఈ పౌల్ట్రీ రంగంలో తెలుగు రాష్ట్రాల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది… ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యధికంగా కోడిగుడ్లను ఉత్పత్తి చేస్తూ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. అంతేకాదు తెలంగాణ కూడా గుడ్ల ఉత్పత్తిలో గణనీయమైన వాటాను కలిగివుంది. అసలు దేశంలో ఏ రాష్ట్రం ఎన్ని గుడ్లను ఉత్పత్తి చేస్తోంది? తెలుగు రాష్ట్రాల వాటా ఎంత? తెలుసుకుందాం.
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్ కోడిగుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఒక్క ఏడాదిలోనే రాష్ట్రంలో ఏకంగా 2,739 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తయ్యాయి. దేశవ్యాప్తంగా ఇదే కాలంలో మొత్తం 14,911 కోట్ల గుడ్లు ఉత్పత్తి కాగా.. అందులో ఆంధ్రప్రదేశ్ వాటా సుమారు 18.4 శాతంగా ఉంది. అంటే దేశంలో ఉత్పత్తయ్యే ప్రతి 100 గుడ్లలో దాదాపు 18 గుడ్లు ఏపీ నుంచే వచ్చాయన్నమాట.
ఏపీలో పౌల్ట్రీ పరిశ్రమ విస్తరణకు అనుకూలమైన పరిస్థితులు ఉండటంతో గుడ్ల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలు పౌల్ట్రీ రంగానికి కీలక కేంద్రాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కోళ్ల ఫారాలు నిర్వహిస్తున్నారు. వ్యాపారులు ఆధునిక పద్ధతులను అనుసరిస్తూ, కోళ్ల పెంపకం నుంచి గుడ్ల సేకరణ, నిల్వ, సరఫరా వరకు వివిధ దశల్లో మెరుగైన సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. దీంతో ఉత్పత్తి సామర్థ్యం పెరగడంతో పాటు మార్కెట్‌కు నిరంతరం గుడ్ల సరఫరా జరుగుతోంది.
రెండో స్థానంలో తమిళనాడు
ఆంధ్రప్రదేశ్ తర్వాత కోడిగుడ్ల ఉత్పత్తిలో తమిళనాడు రెండో స్థానంలో కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఉత్పత్తయ్యే మొత్తం గుడ్లలో ఈ రాష్ట్రం వాటా సుమారు 15 శాతంగా ఉంది.
తమిళనాడులో పౌల్ట్రీ పరిశ్రమకు మంచి ఆదరణ ఉంది... పెద్ద ఎత్తున కోళ్ల ఫారాలు నిర్వహిస్తుండటంతో పాటు గుడ్ల ఉత్పత్తి, మార్కెటింగ్ వ్యవస్థలు అభివృద్ధి చెందాయి. ముఖ్యంగా వాణిజ్య స్థాయిలో కోళ్ల పెంపకం ఈ రాష్ట్రంలో గుడ్ల ఉత్పత్తి పెరగడానికి దోహదపడుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు తెలంగాణ కూడా కోడిగుడ్ల ఉత్పత్తిలో ముందంజలో ఉంది. దేశవ్యాప్తంగా ఉత్పత్తయ్యే గుడ్లలో తెలంగాణ వాటా సుమారు 13 శాతంగా ఉంది. ఈ గణాంకాలతో దేశంలోనే మూడో అతిపెద్ద గుడ్ల ఉత్పత్తి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోంది.
తెలంగాణలో పౌల్ట్రీ పరిశ్రమకు హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు ముఖ్యమైన మార్కెట్లుగా ఉన్నాయి. కోళ్ల పెంపకం, గుడ్ల ఉత్పత్తి, రవాణా, విక్రయాల ద్వారా ఈ రంగం అనేక మందికి ఉపాధి కల్పిస్తోంది. రాష్ట్రంలో ఉత్పత్తయ్యే గుడ్లు స్థానిక అవసరాలను తీర్చడంతో పాటు ఇతర ప్రాంతాలకు కూడా సరఫరా అవుతున్నాయి.
దేశ గుడ్ల ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాల వాటా ఎంత?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గణాంకాలను కలిపి చూస్తే తెలుగు రాష్ట్రాల ప్రాధాన్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఏపీలో 2,739 కోట్లు, తెలంగాణలో సుమారు 1,734 కోట్లు గుడ్లు ఉత్పత్తవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంటే రెండు రాష్ట్రాల్లో కలిపి సుమారు 4,473 కోట్ల గుడ్లు ఉత్పత్తవుతున్నాయి.
దేశవ్యాప్తంగా ఉత్పత్తయ్యే మొత్తం గుడ్లలో ఈ రెండు రాష్ట్రాల వాటానే దాదాపు 30 శాతం. అంటే భారతదేశంలో ఉత్పత్తయ్యే ప్రతి మూడు గుడ్లలో దాదాపు ఒకటి తెలుగు రాష్ట్రాల నుంచే వస్తోందన్నమాట. ఇది దక్షిణ భారతదేశంలో పౌల్ట్రీ పరిశ్రమ ఎంత బలంగా ఉందో తెలియజేస్తోంది.
కోడి గుడ్ల ఉత్పత్తిలో దక్షిణాది రాష్ట్రాలే కాకుండా తూర్పు, దక్షిణ భారతదేశంలోని మరికొన్ని రాష్ట్రాలు కూడా కీలకంగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ దేశంలోని ప్రధాన గుడ్ల ఉత్పత్తి రాష్ట్రాల్లో నాలుగో స్థానంలో ఉంది. జాతీయ ఉత్పత్తిలో ఈ రాష్ట్రం వాటా సుమారు 10.72 శాతంగా ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాలకు పొరుగునే ఉన్న కర్ణాటక కూడా ఈ రంగంలో గణనీయమైన వాటాను కలిగి ఉంది. దేశవ్యాప్తంగా ఉత్పత్తయ్యే కోడిగుడ్లలో కర్ణాటక వాటా సుమారు 6.67 శాతంగా ఉంది. మొత్తంగా చూస్తే దక్షిణాది రాష్ట్రాలు భారతదేశ గుడ్ల ఉత్పత్తిలో కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి.
కోడిగుడ్లు ప్రజలకు అందుబాటులో ఉండే పోషకాహార వనరుల్లో ఒకటి. ప్రోటీన్‌తో పాటు శరీరానికి అవసరమైన పలు పోషకాలు అందించే గుడ్లకు ఏడాది పొడవునా మంచి డిమాండ్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెరుగుతున్న వినియోగానికి అనుగుణంగా ఉత్పత్తిని కొనసాగించడం పౌల్ట్రీ పరిశ్రమకు కీలకం.
ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటి స్థానంలో, తెలంగాణ మూడో స్థానంలో ఉండటం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం. తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలు కూడా గుడ్ల ఉత్పత్తిలో ముందుండటంతో దక్షిణ భారతదేశం ఈ రంగానికి ప్రధాన కేంద్రంగా మారింది. ఆధునిక పౌల్ట్రీ ఫారాలు, మెరుగైన నిర్వహణ పద్ధతులు, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి కొనసాగితే రానున్న రోజుల్లో ఈ రంగం మరింత విస్తరించే అవకాశం ఉంది.