Published : Jul 10, 2025, 10:40 AM ISTUpdated : Jul 10, 2025, 10:42 AM IST
మారుతోన్న కాలంతో పాటు టెక్నాలజీ కూడా మారుతోంది. అయితే ఇదే టెక్నాలజీని కొందరు నేరగాళ్లు తమకు అస్త్రంగా మార్చుకుంటున్నారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది.
కేంద్ర ప్రభుత్వం రకరకాల పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాకుండా పలు పొదుపు పథకాలను సైతం తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫేక్ పథకం వైరల్ అవుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరుతో ఓ నకిలీ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
అచ్చంగా నిర్మలా సీతారామన్ చెబుతున్నట్లు ఉన్న ఈ వీడియో ఆమె ఓ పెట్టుబడి పథకం గురించి మాట్లాడుతున్నట్లు చూపించారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి సహకారంతో రూపొందించిన పెట్టుబడి పథకాన్ని ప్రమోట్ చేస్తున్నట్లు వీడియోలో పేర్కొన్నారు.
25
నెలకు రూ.15 లక్షల లాభం అంటూ
వైరల్ అవుతున్న వీడియోలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, "ఈ స్కీమ్‌లో ఒక్కసారి రూ.21,000 పెట్టుబడి పెడితే నెలకు రూ.15 లక్షల వరకు ఆదాయం వస్తుంది" అని చెబుతున్నట్లు ఉంది. దీంతో చాలా మంది ఈ వీడియోను షేర్ చేయడం, వాట్సాప్ స్టేటస్‌లుగా పెట్టడం మొదలు పెట్టారు. అయితే ఈ వీడియో పచ్చ అబద్ధమని అధికారులు చెబుతున్నారు.
35
పీఐబీ ఫ్యాక్ట్ చెక్
ఈ వీడియోపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ, ఇది పూర్తిగా ఫేక్ వీడియో అని స్పష్టం చేసింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం తన అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని ఖండించింది. నిర్మలా సీతారామన్ గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ ఇలాంటి పెట్టుబడి వేదికను ప్రారంభించలేదని తేల్చిచెప్పింది.
ఇలాంటి వీడియోలు, పెట్టుబడి పథకాలను గుడ్డిగా నమ్మకూడదని అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి సమాచారాన్ని అధికారిక సోర్సుల ద్వారా ధృవీకరించుకోవాలని చెబుతున్నారు. ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మి అనవసరంగా డబ్బులు పోగొట్టుకోకూడదని సూచిస్తున్నారు.
55
నిజమైన సమాచారం కోసం
ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవాలంటే అధికారిక వెబ్‌సైట్లు, పీఐబీ వంటి వాటిని తనిఖీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతీ సమాచారాన్ని గుడ్డిగా నమ్మకూడదు. ఇటీవలి కాలంలో డీప్‌ఫేక్ టెక్నాలజీతో ఇలాంటి మోసాలు ఎక్కువవుతున్నాయి. కాబట్టి ఇలాంటి తరుణంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని హెచ్చరిస్తున్నారు.