రాజస్థాన్‌లోని జైపూర్ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్ రియా సింఘా సొంతం చేసుకుంది. పోటీలో 51 మంది ఫైనలిస్టులను వెనక్కి నెట్టి, గుజరాత్‌కు చెందిన 19 ఏళ్ల రియా సింఘా మిస్ యూనివర్స్ ఇండియా 2024గా నిలిచింది.
36వ కంటెస్టెంట్‌గా పాల్గొన్న రియా గ్రాండ్ ఫినాలేలో తన అందం, ప్రతిభతో న్యాయనిర్ణేతలు, ప్రేక్షకులను అలరించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ విజయంతో ఆమెకు ప్రతిష్టాత్మకమైన బిరుదుతో పాటు ఈ ఏడాది చివర్లో మెక్సికోలో జరగనున్న మిస్ యూనివర్స్ 2024 పోటీలో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించింది.
తాను మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరీటాన్ని గెలుచుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని, తన కష్టానికి, అంకితభావానికి ఇది నిదర్శనమని రియా మీడియాతో తెలియజేసింది.
ఇక ప్రాంజల్ ప్రియా నుండి రియా సింఘాకి గట్టి పోటీ ఎదురైంది. ప్రాంజల్ పియా మొదటి రన్నరప్‌గా నిలిచింది. చావి వెర్గ్ రెండవ రన్నరప్‌గా నిలిచారు. సుష్మితా రాయ్, రూప్‌ఫుజానో విసో వరుసగా మూడవ, నాల్గవ స్థానాల్లో నిలిచారు. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న ప్రతి కంటెస్టెంట్ ప్రత్యేకతను చాటుకున్నారు.
రియా విజయం సాధించిన నేపథ్యంలో అభిమానుల, ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. మిస్ యూనివర్స్ ఇండియా 2015 విజేత, బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా న్యాయనిర్ణేతల్లో ఒకరిగా వ్యవహరించారు. మిస్ యూనివర్స్ పోటీలో భారత్ విజయం సాధిస్తుందని ఆమె ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
జైపూర్‌లో ఆదివారం ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఇండియన్ మీడియా ప్రముఖంగా కవర్ చేసింది. అంతర్జాతీయ స్థాయి అందాల పోటీకి రియా సిద్ధమవుతుండగా, ఆమె ప్రయాణం చాలా మందికి స్ఫూర్తినిస్తుంది. తన దేశం మద్దతుతో, మిస్ యూనివర్స్ కిరీటాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో రియా సింఘా ముందుకు వెళుతుంది.
రియా సింఘా ఫాదర్ బ్రిజేష్ సింఘా వ్యాపారవేత్త. ఆయన ఈస్టోర్ ఫ్యాక్టరీ పేరుతో ఆన్లైన్ బిజినెస్ నడుపుతున్నారు. రియా సింఘా తల్లి పేరు రీటా సింఘా. మోడలింగ్, యాక్టింగ్ అనే రియా సింఘాకు మొదటి నుండి ఇష్టం. రియా సింఘా అభిరుచిని తల్లి రీటా సింఘా ప్రోత్సహించింది. రియా సింఘా సక్సెస్ లో తల్లి పాత్ర ఎంతగానో ఉంది.