రాజకీయ కాన్సెప్ట్ తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ అందులో చాలా వరకు గత వాస్తవాలను అద్దం పట్టేలా, రాజకీయాల్లోని అవినీతిని ఎండగట్టేలా మూవీస్ వచ్చాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చాయి. ప్రభుత్వం నిర్ణయాలు ప్రజలకు ఎలా నష్టాలను తెస్తున్నాయనే కాన్సెప్ట్ లతో సినిమాలు వచ్చాయి. చాలా వరకు మంచి ఆదరణ పొందాయి. అదే సమయంలో దొరలు, భూస్వాములు, సంపన్నుల అరాచకాలను ఎదుర్కొన్న సంఘటనలపై సినిమాలు వచ్చాయి. పేదవారికి అండగా నిలిచి, దొరల ఆట కట్టించిన నక్సలిజం నేపథ్యంలో సినిమాలు వచ్చాయి. ఆదరణ పొందాయి.
కానీ ఇప్పుడు వెండితెరపై రాజకీయం అనే కాన్సెప్ట్ కి అర్థం మారిపోయింది. రాజకీయ ఎజెండాతో వచ్చే సినిమాలు పెరిగిపోయాయి. ఆడియెన్స్(ప్రజల) దృష్టి మరల్చేలా, తమ రాజకీయ స్వలాభం పొందే చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. రాజకీయంగా తమకు ఉపయోగపడే కాన్సెప్ట్ తో ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు మేకర్స్. చరిత్ర అంటే ఇదే అని చెప్పే ప్రయత్నం, జనంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. తమ ప్రత్యర్థులను విలన్లుగా చూపించి, తమకు అనుకూలమైన వారిని హీరోలుగా చూపించే ప్రయత్నం జరుగుతుంది.
ఇటీవల పొలిటికల్ ఫిల్మ్ గా `యాత్ర 2` వచ్చింది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్ర, పాద యత్ర నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది. జగన్ పై కాంగ్రెస్ హైకమాండ్ చేసిన కుట్రలను ఈ సినిమాలో చూపించారు. వారి దాడులను తట్టుకుని నిలబడి, స్థానిక ప్రత్యర్థి టీడీపీని ఎదుర్కొని గత ఎన్నికల్లో జగన్ సీఎం ఎలా అయ్యాడనే కాన్సెప్ట్ తో ఈ మూవీని రూపొందించారు దర్శకుడు మహి వీ రాఘవ్. స్వతహాగా వైఎస్ అభిమాని అయిన దర్శకుడు ఆయన గొప్పతనాన్ని `యాత్ర`లో చూపించారు. ఇప్పుడు జగన్ గొప్ప నాయకుడు అని `యాత్ర2`లో చెప్పే ప్రయత్నం చేశాడు. జగన్‌ని హీరోగా చూపించాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా వైసీపీ వర్గానికి నచ్చింది. కానీ ప్రత్యర్థ పార్టీల వారికి, సాధారణ ఆడియెన్స్ సినిమా నచ్చలేదు.
`యాత్2` సినిమా తీసిన ప్రధాన ఉద్దేశ్యం వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వానికి ఉపయోగపడేలా, ఆడియెన్స్ మైండ్ సెట్ మార్చే ప్రయత్నంలో భాగంగా రూపొందించారు. ప్రస్తుతం సీఎం జగన్‌ని నెగటివ్‌గా చూస్తున్న నేపథ్యంలో ఆ ఇమేజ్‌ని పాజిటివ్‌గా మార్చే ప్రయత్నంగా తెరకెక్కించారని అంటున్నారు వ్యతిరేక వర్గం. ఈ మూవీ జనాన్ని ప్రభావితం చేసి ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీకి ఓటు బ్యాంక్‌గా మారుతుందని భావిస్తున్నారు. మరి ఆ లక్ష్యం ఎంత వరకు నెరవేరుతుందో చూడాలి. కానీ ఈ మూవీకి ప్రజల నుంచి రెస్పాన్స్ పూర్తిగా భిన్నంగా ఉండటం గమనార్హం.
మరోవైపు సేమ్ ఇదే కాన్సెప్ట్ తో రాబోతుంది రామ్‌గోపాల్ వర్మ `వ్యూహం`. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన అనంతర పరిణామాలు, ఉమ్మడి రాష్ట్రంలో జగన్‌కి ఎదురైన సంఘటనలు, ప్రత్యర్థి పార్టీల కుట్రలను ప్రధానంగా చేసి ఈ మూవీలో చూపించబోతున్నారు వర్మ. జగన్‌ని హీరోగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీలను విలన్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. పరోక్షంగా వర్మ ఉద్దేశ్యం కూడా వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వానికి ఉపయోగపడేలానే ఈ మూవీని తెరకెక్కించారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.
అదే సమయంలో జగన్‌కి పాజిటివ్‌గా ఈ మూవీ తెరకెక్కిందని టీజర్, ట్రైలర్లు చూస్తే అర్థమవుతుంది. ఈ నెల 23న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇది రెండు పార్ట్ గా రిలీజ్ కానుంది. వారం గ్యాప్‌తో రెండో పార్ట్ రానుంది. త్వరలోనే ఏపీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో జనాన్ని ఈ సినిమా ప్రభావితం చేయాలని, అది ఎన్నికల్లో ఉపయోగపడాలని భావించి ఈ మూవీని విడుదల చేస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
మరోవైపు వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఓ సినిమా రూపొందింది. `రాజధాని ఫైల్స్` పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు భాను. మీడియా మాధ్యమం తెలుగు వన్ ఈ మూవీని నిర్మించింది. ఇందులో అఖిలన్, వీనా మెయిన్ లీడ్‌గా చేశారు. వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్, పవన్, విశాల్ పట్ని, షణ్ముఖ్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ గురువారమే ఈ సినిమా విడుదల కానుండటం విశేషం.
వైఎస్ జగన్ రాజధాని లేకుండా చేశారని, అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమం ప్రధానంగా ఈ సినిమాని రూపొందించారు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, టీడీపీ కి పాజిటివ్‌గా ఈ మూవీని రూపొందించినట్టుగా తెలుస్తుంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రూపొందిన ఈ చిత్రం కూడా ఎంత వరకు ఏపీ ప్రజలను ప్రభావితం చేస్తుందో చూడాలి.
తెలంగాణ ఉద్యమాల నేపథ్యంలో ఇప్పుడు మరో సినిమా వస్తుంది. `రజాకార్` పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. యాట సత్యనారాయణ దర్శకత్వం. ఇందులో అనసూయ, సింహా, ఇంద్రజ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. నిజాంకి వ్యరేతికంగా జరిగిన పోరాటం నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ సంస్థానం భారత్‌లో కలవలేదు. నిజాం నవాబ్ ఈ రాజ్యాన్ని భారత్‌లో కలిపేందుకు నిరాకరించారు. ఇక్కడ ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేశాడు. రజాకార్ అనే వ్యవస్థని ఏర్పాటు చేసి అమాయక ప్రజలను చిత్ర హింసలు పెట్టించారు.
దాన్ని తెలంగాణలోని కమ్యూనిస్టులు, నక్సల్స్ ఎదుర్కొన్నారు. చివరగా భారత ప్రభుత్వం రంగంలోకి దిగి నిజాం అంతు చూసింది. హైదరాబాద్‌ని భారత్‌లో కలిపేసింది. ఈ ఇతివృత్తంతో `రజాకార్` సినిమాని తెరకెక్కించారు. అయితే తాజాగా విడుదలైన ట్రైలర్‌లో మాత్రం హిందూ, ముస్లిం అనే కోణంలో ఈ మూవీని తెరకెక్కించారని అనిపిస్తుంది. రజాకార్లని ముస్లింలుగా, ప్రజలను హిందూవులుగా చూపించి, హిందూవులపై ముస్లింల దాడిగా ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేస్తున్నారని, దీన్ని పూర్తి మతం అనే కోణంలో తెరకెక్కిస్తున్నారని ప్రత్యర్థ పార్టీలు ఆరోపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమా వెనకాల బీజేపీ నాయకులు ఉన్నారని ఆరోపిస్తున్నారు. సినిమా నిర్మాత బీజేపీనాయకుడని అంటున్నారు.
`రజాకార్` సినిమాలో.. ప్రస్తుతం దేశంలో మతం, హిందుత్వం అనే చర్చ నడుస్తున్న నేపథ్యంలో చరిత్రలో నిజాం(ముస్లీంల)ను విలన్‌గా చూపించే ప్రయత్నం చేశారు. అంతిమంగా ఇది బీజేపీకి ఉపయోగపడాలనే రాజకీయ ఎజెండాతో తీశారని అపోజిట్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. కోణం విషయంలో చరిత్ర వక్రీకరిస్తున్నాయని చెబుతున్నారు కమ్యూనిస్టులు ఆరోపిస్తున్నారు. మరి మార్చి 1న విడుదల కానున్న ఈ మూవీ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూడాలి. వీటితోపాటు `ఆర్‌ఎస్‌ఎస్`పై సినిమా చేసేందుకు రైటర్ విజయేంద్రప్రసాద్ ప్లాన్ చేస్తున్నారు. మరికొన్ని పొలిటికల్ ఎజెండాతో మూవీతో తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఇలా వెండితెరపై ఇప్పుడు రాజకీయం యమ రంజుగా మారుతుంది.