`కల్కి2898ఏడీ` మరో `ఆదిపురుష్`‌, `పొన్నియిన్‌ సెల్వన్‌` అవుతుందా?.. నాగ్‌ అశ్విన్‌ చేస్తున్న మిస్టేక్‌ ఏంటి?

First Published Jun 11, 2024, 3:35 PM IST

ప్రభాస్‌ నటిస్తున్న `కల్కి2898ఏడీ` ట్రైలర్‌ వచ్చింది. కానీ సినిమాపై బజ్‌ క్రియేట్‌ కావడం లేదు. దీంతో మరో `ఆదిపురుష్‌`, మరో `పొన్నియిన్‌ సెల్వన్‌` అవుతుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. 
 

 ప్రభాస్‌ ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న మూవీ `కల్కి2898ఏడీ`. టాలెంటెడ్‌ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ రూపొందిస్తున్న సినిమా కావడంతో దీని కోసం అంతా ఎదురుచూస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ `ఎవడే సుబ్రమణ్యం`, `మహానటి`తో తానేంటో నిరూపించుకున్నాడు. ముఖ్యంగా `మహానటి` సినిమా టేకింగ్‌ ఆయనలోని దర్శకత్వ ప్రతిభని చాటి చెప్పింది. దీంతో అదే నమ్మకం ఇప్పుడు `కల్కి2898ఏడీ`పై ఉంది. 

`కల్కి` సినిమాని సైన్స్ ఫిక్షన్‌గా తెరకెక్కిస్తున్నాడు నాగ్‌ అశ్విన్‌. మైథలాజికల్‌ అంశాలను మేళవిస్తూ దీన్ని రూపొందిస్తుండటం విశేషం. విష్ణువు చివరి అవతారమైన కల్కి కథని ఈ మూవీలో చెప్పబోతున్నాడు. ఇప్పుడు మన కాలం కళియుగం. ఈ కథ 2898లో సాగుతుందంటే భవిష్యత్ లో కల్కి జన్మిస్తాడు. ఆ కాలంలో ఈ ప్రపంచం ఎలా ఉంటుంది, దాన్ని కల్కి ఎలా శాషిస్తాడు, ఎలా ప్రత్యర్థులను ఎదుర్కోబోతున్నాడనేది సైన్స్ ఫిక్షన్‌ అంశాలతో జోడించి ఈ`కల్కి2898ఏడీ` సినిమాని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. 
 

ఆరువేల సంవత్సరాల వెనక్కి వెళితే విష్ణువు అవతారంలో అప్పుడు జరిగిన పరిస్థితులను కూడా ఇందులో ఊహాత్మకంగా చూపించబోతున్నాడట దర్శకుడు. అయితే ఈ సినిమాని రెండు మూడు భాగాలుగా తీసుకొచ్చే అవకాశం ఉంది. మొదటి భాగంలో భవిష్యత్‌ని చెబుతూ, ఆ తర్వాత గతాన్ని చెబుతారని, అందులో భాగంగా ఫస్ట్ పార్ట్ లో గతం తాలూకూ ఫ్లాష్‌ బ్యాక్‌ని పరిచయంచేస్తారని తాజాగా విడుదలైన ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. అయితే ఈ మొత్తంలో అశ్వత్థామ పాత్ర కామన్‌గా ఉంటుంది. `కల్కి`ని కాపాడటం కోసం అశ్వత్థామ పాత్ర పనిచేస్తుందని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది  సినిమా చూస్తేగానీ తెలియదు. 
 

ఇదిలా ఉంటే `కల్కి` సినిమాని భారీ బడ్జెట్‌తో నిర్మించారు నిర్మాత అశ్వినీదత్‌. మొదట 500 కోట్ల బడ్జెట్‌తో సినిమాని ప్రారంభించారు. డీలే కారణంగా, చాలా మంది ఆర్టిస్టులు యాడ్‌ కావడం వల్ల బడ్జెట్‌ పెరిగిందని, సుమారు 700కోట్ల వరకు అయ్యిందని సమాచారం. సినిమాలో భారీ కాస్టింగ్‌ ఉంది. ప్రభాస్‌తోపాటు కమల్‌ హాసన్‌ ఉన్నారు. అమితాబ్‌ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటానీ, అలాగే గెస్ట్ లుగా విజయ్‌ దేవరకొండ, నాని, దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌, శోభన, రాజమౌళి, వర్మ, అనుదీప్‌ వంటి వారు కనిపించబోతున్నారు.భారీ విజువల్‌ ఎఫెక్ట్స్ తో సినిమాని రూపొందిస్తున్నారు. 
 

ఇందులో ఓ కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నారు. అంటే ఓ కొత్త ప్రపంచాన్ని వీఎఫ్‌ఎక్స్ తో సృష్టించబోతున్నారు. ట్రైలర్‌ని చూస్తే ఆ విషయం స్పష్టమవుతుంది. విజువల్‌ పరంగా సినిమా బాగుంది. హాలీవుడ్‌ స్థాయిలో ఉంది. క్వాలిటీ విషయంలో రాజీపడటం లేదని అర్థమవుతుంది. కానీ కథ విషయంలోనే క్లారిటీ లేదు. ట్రైలర్‌లో సీన్లని చూపించారు తప్పితే, కథ అర్థమయ్యేలా లేదు. ఇదే ఇప్పుడు అందరిని టెన్షన్‌ పెడుతుంది. సినిమాకి ఏమాత్రం బజ్‌ రావడం లేదు. ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ నుంచి ఇదే సమస్య ఈ మూవీని వెంటాడుతుంది. ప్రభాస్‌ లుక్‌ ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. గ్రాఫిక్స్ తో చేశారని బాగా ట్రోల్‌ చేశారు. 

ఆ తర్వాత వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్‌ కూడా సేమ్‌ ఫీలింగ్‌. ఏది ఎగ్జైటింగ్‌గా అనిపించలేదు. ఇప్పుడు ట్రైలర్‌ అయినా అంచనాలను పెంచుతుందని భావించారు. కానీ విజువల్స్ తప్ప, ఏదీ ఎగ్జైటింగ్‌గా అనిపించలేదు. ఒకటి రెండు చోట్ల యాక్షన్‌ వాహ్‌ అనిపించింది. కానీ అందులో ప్రభాస్‌ పాత్ర ఆకట్టుకునేలా లేదు. ట్రైలర్‌లో ఆయన పాత్రని కామెడీలా చూపించారు. వీరోచితంగా ఏ సన్నివేశంలోనూ కనిపించలేదు. ఇదే ఇప్పుడు అభిమానులను, సినీ లవర్స్ ని ఆందోళనకు గురి చేస్తుంది. ఈ సినిమా మరో `ఆదిపురుష్‌` అవుతుందా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. 
 

`ఆదిపురుష్‌` విషయంలోనూ ఇలానే జరిగింది. ప్రారంభం నుంచి దానిపై ట్రోల్‌ నడిచింది. పోస్టర్స్ , లుక్స్, టీజర్‌, ట్రైలర్‌ కూడా ఆకట్టుకోలేకపోయాయి. రెండో ట్రైలర్‌ తో కొంత మ్యానేజ్‌ చేశారు. కానీ సినిమాలో మాత్రం అది తేలిపోయింది. నాసిరకమైన విజువల్స్, కథలో దమ్ములేకపోవడం, డ్రామా, సంఘర్షణ వర్కౌట్‌ కాలేదు. యాక్షన్‌ కూడా తేలిపోయాయి. దీంతో సినిమా తేడా కొట్టింది. ఇప్పుడు చూడబోతుంటే `కల్కి2898ఏడీ` కూడా మరో `ఆదిపురుష్‌` అవుతుందా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.  

దీంతోపాటు మణిరత్నం రూపొందించిన `పొన్నియిన్‌ సెల్వన్‌`ని కూడా తలపిస్తుంది. ఆ మూవీ విజువల్‌గా బాగుంది. చాలా పెద్ద కథ. కానీ అర్థమయ్యేలా చెప్పడంలో, కథని సింపుల్‌గా మార్చడంలో మణిరత్నం విఫలమయ్యాడు. దీంతో ఆ మూవీ ఆడియెన్స్ కి అర్థం కాలేదు. ఆ పాత్రలేంటో? ఆ కథేంటో? ఏం జరుగుతుందో అర్థంకాక తలపట్టుకున్నారు. దీంతో ఫలితం తేడా కొట్టింది. భారీ బడ్జెట్‌తో విజువల్‌ వండర్‌గా చేసిన ఆ మూవీ ఘోర పరాజయం చెందింది.

 మరి `కల్కి2898ఏడీ` కథ కూడా అర్థమయ్యేలా కనిపించడం లేదు. ట్రైలర్‌లో ఏం చెప్పాడనేది క్లారిటీ లేదు. సీన్లు బాగున్నా, కథ పరంగా కన్‌ఫ్యూజన్‌ ఏర్పడింది. ఆ పాత్రలేంటి? సైన్స్ కి, మైథాలజీ అంశాలను ఎలా ముడిపెడతారనేది అర్థం కావడం లేదు. ఇది అందరిలోనూ ఓ టెన్షన్‌ క్రియేట్‌ చేస్తుంది. దీంతో `కల్కి` మరో `పొన్నియిన్‌ సెల్వన్‌` అవుతుందా అనే అనుమానాలు నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్నాయి. 
 

అందుకే సినిమాకి మల్టీఫ్లెక్స్ ల్లో కాస్త బజ్‌ క్రియేట్‌ అయినా, బీ, సీ  సెంటర్లలో మాత్రం బజ్‌ క్రియేట్‌ కావడం లేదు. సాధారణ ఆడియెన్స్ ఎగ్జైట్‌ కావడం లేదు. ప్రభాస్‌ ఫ్యాన్స్ కూడా పెదవి విరుస్తున్నారు. దీనికి కారణం ప్రభాస్‌.. రెగ్యూలర్‌ ప్రభాస్‌లా కనిపించడం లేదు. `సలార్‌` లాంటి ప్రభాస్ కనిపించడం లేదు. `ఆదిపురుష్‌`లో ప్రభాస్ లుక్‌ వేరు, అలానే `కల్కి`లోనూ ఆయన లుక్‌ వేరు. అది ఆడియెన్స్ కి కనెక్ట్ కావడం లేదు. ఆయన పాత్రలో ఎలివేషన్లు లేవు, గూస్‌బంమ్స్ తెప్పించే సీన్లు కనిపించడం లేదు. 

 ఈ చిత్రానికి బజ్‌ క్రియేట్‌ కావడం లేదు. మరి నాగ్‌ అశ్విన్‌ ఏం మ్యాజిక్‌ చేయబోతున్నాడు? ఆయన ఆలోచన ఏంటి? అనేది సినిమా చూస్తేగానీ తెలియదు. అయితే ఈ మూవీకి సంబంధించి మరో ట్రైలర్ ఉందట. అందులోనైనా అభిమానులు, మాస్‌ ఆడియెన్స్ ఎక్స్ పెక్ట్ చేసే అంశాలుంటాయో చూడాలి. 

Latest Videos

click me!