ఎస్.వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'యమలీల' చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోగా కమెడియన్ అలీని ఎంపిక చేసిన సమయంలో, హీరోయిన్ పాత్ర కోసం ముందుగా సౌందర్యను సంప్రదించారు. అప్పటికే హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న సౌందర్య, కమెడియన్ పక్కన నటించేందుకు కొంత సందేహించి, ఆ అవకాశాన్ని సున్నితంగా నిరాకరించారు. దాంతో ఆ పాత్రలో ఇంద్రజ నటించడం, సినిమా పరిశ్రమ రికార్డులను తిరగరాయడం జరిగింది.
ఫోన్ చేసి క్షమాపణ కోరిన నటి
సినిమా విడుదలైన తర్వాత ఆ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ చూసి.. సౌందర్య తన నిర్ణయం పట్ల పునరాలోచనలో పడ్డారు. తాను పొరపాటు నిర్ణయం తీసుకున్నానని గ్రహించి, ఏమాత్రం అహంకారానికి పోకుండా స్వయంగా ఎస్.వి. కృష్ణారెడ్డికి ఫోన్ చేశారు. "సార్, నేను చాలా పెద్ద తప్పు చేశాను. మీ విజన్ అర్థం చేసుకోలేకపోయాను" అని నిష్కపటంగా ఒప్పుకుని క్షమాపణలు కోరారు. స్టార్ హీరోయిన్ హోదాలో ఉన్న ఒక నటి, స్వయంగా దర్శకుడికి ఫోన్ చేసి తన పొరపాటును అంగీకరించడం చిత్ర పరిశ్రమలోనే ఒక అరుదైన విషయమని కృష్ణారెడ్డి గుర్తుచేసుకున్నారు.