విశ్వక్‌సేన్.. సొంతంగా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ఓ ఫ్లాట్‌ఫామ్‌ని క్రియేట్ చేసుకున్న హీరో. `వెళ్లిపోమాకే`, `ఈ నగరానికి ఏమైంది` చిత్రాలతో మెరిసినా, సొంతంగా హీరోగా నటిస్తూ, దర్శకత్వంలో నిర్మించిన `ఫలక్‌నూమా దాస్` తో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. తనదైన స్టయిల్ ప్రమోషన్స్ తో హాట్ టాపిక్‌గా మారాడు. ఆ తర్వాత నాని నిర్మించిన `హిట్` చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు `పాగల్` సినిమాతో వస్తున్నాడు. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నివేతా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తుంది. దిల్‌రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ నిర్మించారు. నేడు(ఆగస్ట్ 14)న శుక్రవారం ఈ సినిమా విడుదలైంది. మరి దీని రిజల్ట్ ఎలా ఉందో చూద్దాం.
సినిమా కథ ః ప్రేమ్(విశ్వక్ సేన్) తన ఏడేళ్లప్పుడే అమ్మ(భూమిక)ని కోల్పోతాడు. చిన్నప్పుడే అమ్మ ప్రేమకి దూరమైన ప్రేమ్‌కి ఆ ప్రేమని పొందాలంటే అమ్మాయి వల్లే సాధ్యమని తన స్నేహితుడు సలహా ఇస్తాడు. అమ్మలా చూసుకునే అమ్మాయిని ప్రేమించమని చెబుతాడు. దీంతో అమ్మాయిలను ప్రేమలో పడేయడమే తన పనిగా పెట్టుకుంటాడు ప్రేమ్. ఇలా దాదాపు 1600 మంది అమ్మాయిలకు తన లవ్ ప్రపోజ్ చేస్తాడు. కానీ అందరు ఆయన్ని తిరస్కరిస్తారు. చివరికి తీర(నివేతా పేతురాజ్)ని చూసి ప్రేమలో పడతాడు. కానీ ఆమెకి అప్పటికే ఎంగేజ్‌మెంట్ అవుతుంది. పైగా ప్రేమ్ లవ్‌ని తిరస్కరిస్తుంది. దీంతో ఫ్రస్టేట్ అయిన ప్రేమ చివరికి ఆత్మహత్య కూడా ప్రయత్నిస్తాడు. మరి దాన్నుంచి ఎలా బయటపడ్డాడు, తన ప్రేమని తీరా ఒప్పుకుందా? ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ.
విశ్లేషణః విశ్వక్ సేన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్ చేయడంలో తడబడిందనే చెప్పాలి. నూతన దర్శకుడు నరేష్ సినిమా మొత్తం ఒక చమత్కారమైన కామెడీపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. అయితే అందులోనూ చాలా విషయాల్లో లాజిక్‌లు మిస్ అయ్యాయి. తొలుత మదర్ సెంటిమెంట్‌లోనూ కామెడీకి ప్రయత్నించాడు. ఈ క్రమంలో మదర్-సన్ సెంటిమెంట్‌లో ఎమోషన్స్ మిస్ అయ్యింది. అవి బోరింగ్ మారిపోయాయి.
సెంటిమెంట్ సీన్లలోనూ అతిగా కామెడీకి పండించే ప్రయత్నం చేయగా అది బెడిసికొట్టినట్టుగా అనిపిస్తుంది. కామెడీ నుంచి, ఎమోషన్‌కి కథ టర్న్ తీసుకునే సమయంలో పర్‌ఫెక్ట్ గా దాన్ని మౌల్డ్ చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడని చెప్పాలి. అమ్మాయిలకు తన లవ్ ప్రపోజ్ చేయడానికి ప్రేమ్ వైజాగ్ వెళ్లడం, తిరిగి హైదరాబాద్ రావడం వంటి సన్నివేశాలు, సీనియర్ రాజకీయ నాయకులతో గే లవ్ వంటి సన్నివేశాలు ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించేలా ఉన్నాయి.
మొదటి భాగంలో `గూగుల్ గూగుల్..`, `ఈ సింపుల్ చిన్నోడు ` పాటలు పర్వాలేదనిపిస్తాయి. ఇంటర్వెల్ తర్వాత కథ మరింత బోరింగా మారుతుంది. హీరోయిన్ నివేతా పేతురాజ్ పాత్ర సన్నివేశాలు చాలా తక్కువ. హీరోహీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ కూడా కొద్ది సేపే ఉంటుంది. ఆ లవ్ ట్రాక్ ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత సెకండాఫ్ మొత్తం గందరగోళంగా తయారయ్యింది. దీంతో సినిమా ట్రాక్ తప్పినట్టయ్యింది.
నటన పరంగా చూస్తూ, ప్రేమ్ పాత్రలో విశ్వక్ సేన్ పర్‌ఫెక్ట్ గా సూట్ అయ్యారు. ఆయనకిది టైలర్ మేడ్ రోల్ అని చెప్పొచ్చు. నివేతా ఉన్న కొద్ది సేపే అయినా తనవంతుగా ఆకట్టుకుంది. హీరోహీరోయిన్ల మధ్య సన్నివేశాలు ఇంకాస్త పెంచితే బాగుండేది. కీలక పాత్రధారులు మురళీశర్మ హీరోయిన్ డాడీగా మెప్పించారు. రాహుల్ రామకృష్ణ, నరేష్ ఓకే అనిపించారు. ఇంకా మరే పాత్రలు ఇంపాక్ట్ ని చూపించలేకపోయాయి.
హైలైట్స్ ః ఫస్ట్ ఆఫ్ ఎంటర్టైన్‌మెంట్స్, మేకింగ్, మ్యూజిక్, బీజీఎం.
డ్రా బ్యాక్స్ ః సెకండాఫ్, గందరగోళం సృష్టించే సన్నివేశాలు, ట్విస్ట్ లు.
ఫైనల్‌గాః `పాగల్` రిజల్ట్ పై హీరో విశ్వక్ సేన్‌కి ముందే ఓ క్లారిటీ ఉందని అర్థమవుతుంది. ఎందుకంటే రిలీజ్‌కి ముందే శుక్రవారం రాత్రి ఆయనో నోట్‌ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. `సినిమా బాగుంటే ఆదరించండి, బాగా లేకపోతే తప్పులు చెప్పండి, అంతేకానీ ఎదురుదాడి చేయకండి` అని పేర్కొన్నాడు. ఇదే సినిమా ఎలా ఉండబోతుందో తెలిపారు. విశ్వక్ సేన్ నటన, రెండు పాటలు, అక్కడక్కడ కామెడీ సన్నివేశాలు మినహాయిస్తే.. `పాగల్` ఓ పేలవమైన మూవీగా నిలిచిందని చెప్పొచ్చు.
రేటింగ్- 2/5.