`బ్రహ్మాస్త్ర`, `ఒకే ఒక జీవితం`లపై వినాయకుడి దెబ్బ.. కొంపముంచుతున్న ఊహించని పరిణామం..

First Published Sep 5, 2022, 10:22 PM IST

అసలే బజ్‌ లేదు, రిజల్ట్ ఎలా ఉంటుందో అనే టెన్షన్‌ వెంటాడుతుంది. ఇంతలో వినాయకుడు షాకిస్తున్నాడు. దీంతో `బ్రహ్మాస్త్ర`, `ఒకే ఒక జీవితం` చిత్రాల ఓపెనింగ్స్ పై తీవ్ర ప్రభావం పడబోతుంది. 
 

`బ్రహ్మాస్త్ర`.. ఇండియాలోనే ప్రతిష్టాత్మకంగా రాబోతున్న సినిమా. రణ్‌ బీర్‌ కపూర్‌, అలియాభట్‌ జంటగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 9న విడుదల కాబోతుంది. రాజమౌళి ఈ చిత్రానికి తెలుగులో ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. దీనికి చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ అందిస్తున్నారు. ఇటీవల ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి ఎన్టీఆర్‌ గెస్ట్ గా వచ్చిన విషయం తెలిసిందే. 
 

దీంతో ఈ చిత్రం గురించి తెలుగులో అందరికి తెలిసింది. పాన్‌ ఇండియా చిత్రంగా విడుదల కాబోతున్న ఈ సినిమా తెలుగు మార్కెట్‌పై బలమైన నమ్మకం పెట్టుకున్నారు. కానీ రావాల్సినంత బజ్‌ రావడం లేదని చిత్ర యూనిట్‌ కంగారు పడుతుంది. ఎంత ప్రమోషన్‌ చేసినా ఏమాత్రం హైప్‌ రావడం లేదు. ఎన్టీఆర్‌ లాంటి స్టార్‌ వచ్చినా, అది ఒక్క రోజుకే పరిమితమయ్యింది. దీంతో సినిమాకి ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో, ఆశించిన స్థాయిలో ఓపెనింగ్‌ దక్కుతాయా? లేదా అనే ఆందోళనలో ఉంది యూనిట్‌. 
 

మరోవైపు తెలుగు, తమిళంలో బైలింగ్వల్‌ చిత్రంగా తెరకెక్కిన `ఒకే ఒక జీవితం` సైతం శుక్రవారమే విడుదలకానుంది. శర్వానంద్‌ హీరోగా నటించిన చిత్రమిది. ఈ సినిమా సడెన్‌గా సెప్టెంబర్‌ 9 రిలీజ్‌ డేట్‌ ప్రకటించుకుని వస్తుంది. హడావుడిగా రిలీజ్‌ చేస్తున్నారు. సినిమా ట్రైలర్‌ విడుదలైన విషయమే చాలా మందికి తెలియదు. 

సడెన్‌గా ప్రెస్‌మీట్‌లు పెట్టి హడావుడి చేసే ప్రయత్నం చేసినా ఏమాత్రం బజ్‌ రావడం లేదు. శర్వానంద్‌ నటించిన గత చిత్రం `ఆడవాళ్లు మీకు జోహార్లు` ఘోర పరాజయం చెందింది. పైగా వరుస ఫ్లాప్‌ల్లో ఉన్నాడు శర్వా. ఇదే`ఒకే ఒక జీవితం` సినిమాకి బజ్‌ రాకపోవడానికి కారణమంటున్నారు క్రిటిక్స్. పైగా ట్రైలర్ కూడా ఏమాత్రం హైప్‌ తీసుకురాలేకపోయింది. దీంతో యూనిట్‌ టెన్షన్‌లో ఉంది. 
 

అసలే ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో అనే టెన్షన్‌లో ఉన్న ఈ రెండు చిత్రాలకు ఇప్పుడు వినాయకుడు పెద్ద షాక్‌ ఇవ్వబోతున్నారు. శుక్రవారం విడుదల కాబోతున్న ఈ చిత్రాలకు వినాయకుడి రూపంలో తెలుగులో గట్టి దెబ్బ పడబోతుంది. సరిగ్గా శుక్రవారమే తెలంగాణలో వినాయక నిమజ్ఞనం చేపట్టబోతుంది ప్రభుత్వం. హైదరాబాద్‌లో సెప్టెంబర్‌9న అధికారికంగా వినాయక నిమజ్ఞన కార్యక్రమం చేపట్టబోతున్నట్టు ప్రభుత్వం ఈ రోజు ప్రకటించింది. 

ఇది `బ్రహ్మాస్త్ర`, `ఒకే ఒక జీవితం` చిత్రాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించబోతుందని చెప్పొచ్చు. నిమజ్ఞనం అంటే ఆల్మోస్ట్ హాలిడే ఉంటుంది. అన్ని బంద్‌ పాటిస్తుంటారు. హైదరాబాద్‌లోని నలు మూలల నుంచి విగ్రహాలు నిమజ్ఞనానికి బయలు దేరుతుంటాయి. ట్రాఫిక్‌ ఆంక్షల నేపథ్యంలో థియేటర్లు, షాపింగ్ మాల్స్,స్కూల్స్ లాంటివన్నీ మూసేయాల్సి ఉంటుంది. ఒకవేళ తెరిచినా జనం రాలేని పరిస్ఙితి. అదే జరిగితే ఈ రెండు చిత్రాల ఓపెనింగ్స్ పై తీవ్ర ప్రభావం పడబోతుందని చెప్పొచ్చు. ఇది ఓ రకంగా మూలిగే నక్కపై తాడిపండు పడ్డ చందంగా మారే పరిస్థితి నెలకొంది.
 

సినిమాలకు పాజిటివ్‌ టాక్‌ వస్తే రెండు రోజు నుంచి పుంజుకునే అవకాశం ఉంది. కానీ రిజల్ట్ ఏమాత్రం తేడా వచ్చినా, కనీసం ఓపెనింగ్స్ కూడా రాబట్టలేక చతికిలపడిపోవడం ఖాయమంటున్నారు క్రిటిక్స్. దీంతో అసలే బజ్‌ లేక ఆందోళన చెందుతున్న రెండు సినిమాలపై వినాయకుడి దెబ్బ గట్టిగానే ఉండబోతుందని చెప్పొచ్చు. మరి ఏం జరగబోతుందనేది చూడాలి. 

click me!