విజయ్ దేవరకొండతో దర్శకుడు విక్రమ్ కె కుమార్ కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారనే వార్తలు టాలీవుడ్‌లో వైరల్ అవుతున్నాయి. నితిన్ చేయాల్సిన సినిమా విజయ్ దేవరకొండ చేతుల్లోకి వెళ్లిందట.
యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన కెరీర్‌లో మరో కీలక దశలో ఉన్నారు. ఆయన ఇటీవల చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయాయి. అయితే, "కింగ్‌డమ్" సినిమాతో కొంత మేరకు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించినా, ఆ సినిమాకు కూడా మిశ్రమ స్పందననే లభించింది.
25
విజయ్ దేవరకొండ తదుపరి చిత్రాలు
ఈ నేపథ్యంలో విజయ్ ఇప్పటికే రెండు కొత్త ప్రాజెక్ట్‌లను ప్రకటించారు. వాటిలో ఒకటి "టాక్సీవాలా" ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో, మరొకటి "రాజా వారు రాణి గారు" ఫేమ్ రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలు.
35
వైవిధ్యమైన కథలతో ఆకట్టుకునే విక్రమ్ కె కుమార్
ఇదిలా ఉండగా, టాలీవుడ్ వర్గాల్లో మరో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ తదుపరి చిత్రాన్ని విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చేయనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. విక్రమ్ కె కుమార్ ఇప్పటికే "మనం", "హలో", "24", "గ్యాంగ్ లీడర్" వంటి విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు. ఆయన రూపొందించే సినిమాలు ఎల్లప్పుడూ భావోద్వేగాలతో, వినూత్న కథలతో ప్రత్యేకంగా నిలుస్తాయి.
తాజా సమాచారం ప్రకారం, విక్రమ్ కె కుమార్ ఇటీవల విజయ్ దేవరకొండకు ఒక కథ వినిపించగా, ఆ స్క్రిప్ట్ ఆయనకు బాగా నచ్చిందట. కథ వినగానే విజయ్ తన అంగీకారాన్ని తెలిపారని టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటే, ఇది ప్రేక్షకులకు కొత్త కాంబినేషన్‌గా నిలుస్తుందని అంచనా.
55
నితిన్ చేజారిన మరో మూవీ
ఇక విక్రమ్ కె కుమార్ ఇటీవల నటుడు నితిన్తో భారీ స్థాయి స్పోర్ట్స్ డ్రామా చేయాలని ప్లాన్ చేశారు. అయితే, ఆ ప్రాజెక్ట్ వివిధ కారణాల వల్ల రద్దయిందనే వార్తలు వచ్చాయి. దీంతో ఇప్పుడు సినీ వర్గాలు, అదే కథను విజయ్ దేవరకొండతో విక్రమ్ కుమార్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో మరో సినిమా నీతి చేజారినట్లు తెలుస్తోంది. తమ్ముడు మూవీ తర్వాత నితిన్ కెరీర్ తలక్రిందులు అయింది. నితిన్ తో చేయాల్సిన ఎల్లమ్మ చిత్రాన్ని దిల్ రాజు పక్కన పెట్టేశారు. ఇప్పుడు విక్రమ్ కుమార్ సినిమా కూడా చేజారింది. విక్రమ్ కుమార్, విజయ్ దేవరకొండ చిత్రాన్ని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.