`ఆదర్శ కుటుంబం` మూవీని గాంధీ జయంతికి విడుదల చేయబోతున్నారు. అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ పోస్టర్ సినిమాలోని హృద్యమైన, ఉత్సాహభరితమైన ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది. ఇందులో వెంకటేష్, శ్రీనిధి శెట్టి ఎంతో హుందాగా, ఆకర్షణీయంగా కనిపిస్తూ, ఆత్మీయ కుటుంబ కథకు అద్దం పట్టేలా ఉన్నారు. సినిమాలో ఎమోషన్స్, ఎంటర్టైన్‌మెంట్, హార్ట్ టచింగ్ ఎలిమెంట్లు పుష్కలంగా ఉంటాయని టీమ్ చెబుతోంది.
టీమ్ చెబుతూ, వెంకటేష్, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ప్రకటన వచ్చినప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రివిక్రమ్ శైలిలో మనసును హత్తుకునే భావోద్వేగాలు, గుర్తుండిపోయే పాత్రలు, కట్టిపడేసే హాస్యం, అర్థవంతమైన కథనం కలగలిపి, ప్రేక్షకులకు సంపూర్ణమైన సినిమా అనుభూతిని అందించడానికి `ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47` సిద్ధమవుతోంది. తన సహజమైన ఆకర్షణ, అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించే వెంకటేష్.. ఈసారి కూడా కుటుంబ విలువలతో కూడిన పాత్రలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించనున్నారు.
ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, రవి కె. చంద్రన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, కెవిన్ కుమార్ యాక్షన్ సన్నివేశాల కొరియోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన కలయికలో ఒకటైన వెంకటేష్–త్రివిక్రమ్ కాంబో మరోసారి కలిసి వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అక్టోబర్ 2, 2026న పండుగ సీజన్‌లో విడుదల కానున్న `ఆదర్శ కుటుంబం హౌస్ నం: 47` చిత్రం, ఒక పరిపూర్ణ కుటుంబ వినోదభరిత చిత్రంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది` అని వెల్లడించింది.