'కొరియన్ కనకరాజు' సినిమాలో సీనియర్ ఎన్టీఆర్‌ను అవమానించారంటూ వచ్చిన విమర్శలపై వరుణ్ తేజ్, దర్శకుడు మెర్లపాక గాంధీ స్పందించారు. తమ ఉద్దేశం ఎప్పుడూ అవమానించడం కాదని స్పష్టం చేశారు.
వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'కొరియన్ కనకరాజు' ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి మంచి ఆరంభం లభించినప్పటికీ, మరోవైపు ఓ వివాదం కూడా చర్చనీయాంశంగా మారింది. సినిమాలో నటుడు సత్య, దివంగత మహానటుడు సీనియర్ ఎన్టీఆర్ను అనుకరిస్తూ కనిపించిన సన్నివేశంపై కొందరు నందమూరి అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సన్నివేశాన్ని ఉద్దేశపూర్వకంగానే సీనియర్ ఎన్టీఆర్‌ను అవమానించేలా చిత్రీకరించారని ఆరోపిస్తూ, దానికి సంబంధించిన వీడియోను కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
25
కృష్ణ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లని కూడా ఇమిటేట్ చేశారు
ఈ వివాదంపై తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో వరుణ్ తేజ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ, "ఆ సన్నివేశాన్ని గత ఏడాది నవంబర్‌లోనే ఇదే డైలాగ్‌తో చిత్రీకరించాం. ట్రోలింగ్‌కు, అనుకరణకు చాలా తేడా ఉంటుంది. ఎవరైనా సరే గొప్ప నటుల్ని మాత్రమే ఇమిటేట్ చేస్తారు కదా అని వరుణ్ తేజ్ అన్నారు. సీనియర్ ఎన్టీఆర్‌ను అవమానించాలనే ఉద్దేశం మాకు ఎప్పుడూ లేదు. ఉదాహరణకు నేను 'ఎఫ్3' సినిమాలో పవన్ కళ్యాణ్ గారి 'వకీల్ సాబ్' పాత్రను అనుకరించాను. అది సరదాగా చేసిన ప్రయత్నమే. అలాగే సినిమా ప్రచారంలో కూడా సత్య కృష్ణ గారిని, చిరంజీవి గారిని అనుకరించారు" అని చెప్పారు.
35
వినోదం కోసమే
వరుణ్ తేజ్ ఇంకా మాట్లాడుతూ, "ఇది పూర్తిగా వినోదం కోసమే చేశాం. వారు గొప్ప నటులు కాబట్టే వారిని అనుకరిస్తాం. ఎవ్వరినీ కించపరచాలనే ఉద్దేశం మాకు లేదు. సోషల్ మీడియాలో వచ్చే స్పందనలు మా నియంత్రణలో ఉండవు. థియేటర్లలో ప్రేక్షకులు ఆ సన్నివేశాలను ఆస్వాదిస్తున్నారు. సత్య తన గత సినిమాల్లో కూడా చాలా మంది నటులను అనుకరించారు. ఇందులో ఎలాంటి అగౌరవ భావం లేదు" అని స్పష్టం చేశారు.
దర్శకుడు మెర్లపాక గాంధీ కూడా ఈ వివాదంపై స్పందించారు. "మేము ఆ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న మీమ్స్‌ను సినిమాల్లో ఉపయోగించడం సాధారణ విషయమే. అలాంటి అంశాలు థియేటర్లలో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయని భావించాం. ఆ వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రేక్షకులు కూడా వెంటనే దానితో అనుసంధానం చేసుకున్నారు" అని వివరించారు.
55
సోషల్ మీడియాలో చర్చ
'కొరియన్ కనకరాజు' బృందం మాత్రం సీనియర్ ఎన్టీఆర్‌ను అవమానించాలనే ఉద్దేశం తమకు ఎప్పుడూ లేదని మరోసారి స్పష్టం చేసింది. ఈ సన్నివేశం పూర్తిగా వినోదం కోసమే రూపొందించబడిందని, గొప్ప నటులపై తమకు ఎప్పుడూ గౌరవమే ఉంటుందని వరుణ్ తేజ్, దర్శకుడు మెర్లపాక గాంధీ ఇద్దరూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.