'ఉప్పెన' మూవీ రివ్యూ

First Published | Feb 12, 2021, 1:10 PM IST

ప్రతీ సంవత్సరం ఎంతో మంది కొత్త హీరోలు లాంచ్ అవుతూంటారు. అయితే వాళ్లంతా సదరు లాంచింగ్ సినిమా రిలీజ్ అయ్యి..హిట్ కొట్టేదాకా వెలుగులోకి రారు.కానీ ఈ సినిమా ప్రత్యేకం. ఈ హీరో అంతకన్నా ప్రత్యేకం. మెగా ఫ్యామిలీ అండతో వస్తున్న మెగా మేనల్లుడు ఈ సినిమా హీరో. టాలీవుడ్ లో పెద్ద బ్యానర్, స్టార్ డైరక్టర్ సుకుమార్ రైటింగ్స్, దేవిశ్రీప్రసాద్ సంగీతం,సూపర్ హిట్టైన సాంగ్.. కలిసి ట్రైలర్, టీజర్ రిలీజ్ నాటి నుంచే ఈ సినిమా జనాల్లో నానేలా చేసాయి.  ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ గురించి అయితే ఓ రేంజిలో జరుగుతోంది. ఈ స్దాయి హైప్ తెచ్చుకున్న ఈ సినిమా ఎలా ఉంది, క్లైమాక్స్ జనాలకు నచ్చిందా,అసలు కథేంటి, మెగా మేనల్లుడు ఎలా చేసాడు,విజయ్ సేతుపతి పాత్ర ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

ఆశ్వీర్వాదం అలియాస్ ఆశీ(పంజా వైష్ణవ్ తేజ్) జాలరి కుటుంబానికి చెందిన ఉషారైన కుర్రాడు. అతనికి చిన్నప్పటి నుంచి సంగీత అలియాస్ బేబమ్మ(కృతి శెట్టి) అంటే పిచ్చి లవ్వు. కాలేజీకు వచ్చాక చేరాక బేబమ్మ కూడా ఆశీతో ప్రేమలో పడుతుంది. అక్కడనుంచి వీళ్లిద్దరూ రహస్యంగా తమ ప్రేమాయణం కొనసాగిస్తూంటారు. ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేని స్దితికి చేరుకుంటారు. అలా ఓ రాత్రి బేబమ్మ, ఆశీ కలిసి సముద్రంకు వెళ్లారు. ఎంత సీక్రెట్ గా వెళ్లినా బేబమ్మ తండ్రి రాయనం(విజయ్ సేతుపతి)కి ఈ మేటర్ లీక్ అవుతుంది.
రాయనం ఎలాంటోడు అంటే కులం,పరువు ప్రాణంగా బ్రతికే రకం. పెద్ద భూస్వామి. దాంతో ఊహించనట్లుగానే వీరి ప్రేమకు ఇమ్మీడియట్ గా విలన్ గా మారిపోతాడు.దాంతో వీళ్లిద్దరని విడగొట్టడానికి,ప్రేమను అడ్డుకోవటానికి ప్రయత్నాలు మొదలెడతారు. అదే సమయంలో ఈ జంట కూడా తమ ప్రేమను ఎలాగైనా బ్రతికించుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తారు. ఆశీ, బేబమ్మ లేచిపోతారు. వీళ్లిద్దరూ కలిసి పూరి, కోల్‌కత్తా, గ్యాంగ్ టక్ ప్రాంతాల్లో తిరుగుతారు. ఈ క్రమంలో రాయనం ఓర్పు నశించి ఓ దారుణమైన నిర్ణయం తీసుకుంటాడు..అదేంటి..చివరకు ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్.. : హీరో ప్లాష్ బ్యాక్ తో సినిమా ప్రారంభమయ్యే ఈ పై కథను చదివిన మీకు ఇలాంటి పరువు హత్య కథలు బోలెడు విన్నాం. అలాగే డబ్బు ఉన్న అమ్మాయి..డబ్బు లేని అబ్బాయి కథలు చూసాం. ఇందులో కొత్తేముంది అనిపించవచ్చు. అయితే సాధారణంలోనే అసాధారణ చూపాలనుకున్నాడు డైరక్టర్. ఓ కొత్త పాయింట్ ని క్లైమాక్స్ గా పెట్టుకుని ,మిగతాదంతా సాదాసీదా లవ్ స్టోరీగా నడపాలనుకున్నాడు. ఆ క్రమంలో అల్లుకున్న ఫస్టాఫ్ సీన్స్ బాగున్నాయి. అయితే ఇంటర్వెల్ అయ్యిననాటి నుంచీ సినిమా మరీ మనం అనుకున్నట్లే జరుగుతూ విసిగిస్తుంది.అయితే క్లైమాక్స్ కు వచ్చేసరికి సీన్ మారిపోతుంది. కొత్తదనం ఆవిష్కారం అవుతుంది.
అయితే స్క్రీన్ ప్లే ని ఇంకాస్త ఇంట్రస్టింగ్ గా రాసుకుని ఉంటే సెకండాఫ్ లో ఈ సమస్య వచ్చేసి కాదు. మిగతా డిపార్టమెంట్స్ అన్ని ...అన్ని వైపుల నుంచి పడిపోకుండా కాపు కాచాయి కాబట్టి సరిపోయిందికానీ లేకపోతే పూర్తి స్దాయిలో డ్రాప్ అయ్యిపోయేది. అలాగే విజయ్ సేతుపతి పాత్రను చాలా స్ట్రాంగ్ గా డిజైన్ చేసి, ఒక టైమ్ కు వచ్చేసరికి చాలా డల్ గా, నిస్సహాయుడుగా మారిపోవటం చిత్రంగా అనిపిస్తుంది. అంతేకాదు క్లైమాక్స్ లో హీరోయిన్ పాత్ర చేత చెప్పించే బోల్డ్ డైలాగులు డైరక్టర్ కు కథా పరంగా జస్టిఫికేషన్ గా అనిపించవచ్చేమో...ఎంతవరకూ సమంజసం అనే ఆలోచన పీకుతూంటుంది.
నచ్చినవి: కొత్త వాళ్లైనా దుమ్ము రేపిన లీడ్ పెయిర్ ఫెరఫార్మెన్స్, ఎప్పటిలాగే విజయ్ సేతుపతి నటన, ఫన్ తో నడిచిన ఫస్టాఫ్ , తెర నిండా పరుచుకున్న విజువల్స్ , దేవిశ్రీప్రసాద్ సాంగ్,బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆర్ట్ వర్క్
నచ్చనవి: డల్ అయ్యిన సెకండాఫ్ నేరేషన్, హైప్ కు తగ్గ స్దాయిలో క్లైమాక్స్ అనిపించకపోవటం, స్క్రీన్ ప్లే విసుగెత్తిచేలా సాగుతూ, రొటీన్ గా ప్రెడిక్టబుల్ గా అనిపించటం, ఎమోషనల్ కనెక్టవిటీ తక్కువగా ఉండటం
దర్శకత్వం,మిగతా విభాగాలు: ఈ చిత్రంతో బుచ్చిబాబు అనే సుకుమార్ అసోసియోట్ డైరక్టర్ గా పరిచయం అయ్యారు. తమిళ సినిమాల ప్రభావం ఆయనపై బాగా ఉందని షాట్ మేకింగ్,క్యారక్టరైజేషన్స్ ని బట్టి అర్దమవుతుంది. అలాగే సుకుమార్ విజువల్ స్టైల్ కూడా అక్కడక్కడా కనపడుతుంది. నిజానికి ఈ స్క్రిప్టు మరింత బెటర్ గా రాసుకుని ఉంటే ప్రెడిక్టుబల్ గా ఈ లవ్ స్టోరీ అనిపించకపోను. టీజర్,ట్రైలర్ లో ఏదైతే ఉందే సినిమాలో అంతకు మించి స్టోరీ లైన్ ఏమీలేదు. విస్తరణ లేదు. అయితే రాసుకున్న సీన్స్ ని చక్కగా ఎగ్జిక్యూట్ చేసి తెరకెక్కించాడు.
లవ్ స్టోరీకు ఏమేమి కావాలో రీసెర్చ్ చేసినట్లుగా విజువల్స్,పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తీసుకున్నాడు. అలాగే కొత్త జోడి అయితేనే ఈ లవ్ స్టోరీకు ఇంపాక్ట్ ఉంటుందని అర్దం చేసుకుని ప్రెషనెస్ తెచ్చాడు. అన్నిటికన్నా ముఖ్యంగా విజయ్ సేతుపతిని తండ్రి పాత్రకు తీసుకోవటం మరీ మరీ ప్లస్ అయ్యింది.
ఇక దేవిశ్రీప్రసాద్ సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసేసింది. మరీ ముఖ్యంగావిజయ్ సేతపతి పాత్రని ఎలివేట్ చేయటానికి వాడిని సౌండ్ ట్రాక్ అయితే మామూలుగా లేదు. ప్రత్యేక శ్రద్ద పెట్టి చేసారు. సినిమాటోగ్రఫీ టెర్రఫిక్ గా ఉంది. ఆర్ట్ వర్క్ అయితే అద్బుతం. అయితే సుకుమార్ రైటింగ్స్ అన్న బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలో రైటింగ్ డిపార్టమెంటే వీక్ గా ఉండటం మాత్రం ఆశ్చర్యం. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా చేసి ఉంటే చాలా లాగ్ సీన్స్ లేచిపోయేవి. ముఖ్యంగా సెకండాఫ్ అంత భారం అనిపించేది కాదు. క్లైమాక్స్ బాగుందా అనేది జనం రిసీవ్ చేసుకునేదాన్ని బట్టి ఉంటుంది. దాన్ని ఇండిడ్యువల్ గా జడ్జి చేయలేం.
నటీనటుల్లో...: లీడ్ యాక్టర్స్ వైష్ణ‌వ్ తేజ్‌, విజ‌య్ సేతుప‌తి, కృతి శెట్టి పోటీ పడి చేసారు. ముఖ్యంగా వైష్ణవ్ తేజ లవ్ సీన్స్ కు అతని కళ్లు పెద్ద ఎస్సెట్ గా మారాయి. ఈ పాత్రకు తగ్గ డిక్షన్, బాడీ లాంగ్వేజ్ ఫెరఫెక్ట్ గా సెట్ అయ్యింది. కృతి శెట్టి మరో కీర్తి సురేష్ అవుతుందనటంలో సందేహం లేదు.విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది. ఆయన యాటిట్యూడ్, స్క్రీన్ ప్రెజన్స్ ఓ రేంజిలో ఉన్నాయి. తాలింపు పాత్ర వేసిన హీరో ప్రెండ్ కొంత కామెడీ బాగానే చేసాడు. సాయిచంద్, రాజీవ్ కనకాల వంటివారు మామూలే.
ఫైనల్ థాట్ : కథ ఒకెత్తు..క్లైమాక్స్ ఒకెత్తు,పడితే భాక్సాఫీస్ చిత్తు ...., -----సూర్య ప్రకాష్ జోశ్యుల.., Rating:2.75
ఎవరెవరు.. బ్యాన‌ర్స్‌: మైత్రి మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌ నటీనటులు: పంజా వైష్ణ‌వ్ తేజ్‌, విజ‌య్ సేతుప‌తి, కృతి శెట్టి, సాయిచంద్‌, బ్ర‌హ్మాజీ తదితరులు. సంగీతం: దేవి శ్రీ‌ప్ర‌సాద్‌ సినిమాటోగ్ర‌ఫీ: షామ్‌ద‌త్ సైనుద్దీన్‌ ఎడిటింగ్‌: న‌వీన్ నూలి ఆర్ట్‌: మౌనికా రామ‌కృష్ణ‌ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌: అనిల్ వై, అశోక్ బి. సీఈవో: చెర్రీ క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: బుచ్చిబాబు సానా నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, వై. ర‌విశంక‌ర్‌ రన్ టైమ్ : 2గంటల, 27 నిముషాలు విడుదల తేదీ: పిభ్రవరి 12,2021.

Latest Videos

click me!