చక్కని రూపం, చిరునవ్వు... చూడగానే పక్కింటి అబ్బాయిలా అనిపిస్తాడు ఉదయ్ కిరణ్. సున్నిత మనసున్న వారు సినిమా రంగంలో రాణించలేరు. ఎదిగేవాడిని భుజాలపై మోసే సినిమా జనాలు, కిందపడిపోతే తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. అది తెలియని ఉదయ్ కిరణ్ పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మలేక ఉసురు తీసుకున్నాడు.
కెమెరా మెన్ నుండి దర్శకుడిగా మారిన దర్శకుడు తేజా తన మొదటి చిత్రానికి హీరో కోసం వెతుకుతున్నాడు. ఇరవై ఏళ్ళు కూడా నిండని కాలేజ్ బాయ్ పాత్రకి ఉదయ్ కిరణ్ చక్కగా సరిపోతాడని తేజా డిసైడ్ అయ్యాడు. అలా ఉదయ్ కిరణ్ చిత్రం మూవీతో టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు.
2000లో విడుదలైన చిత్రం ఓ సంచలన విజయం సాధించింది. దర్శకుడు తేజా, ఉదయ్ కిరణ్ లతో పాటు సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ ల పేరు మారుమ్రోగింది. అదే ఊపుతో, ఈ ముగ్గురు కాంబినేషన్ లో నువ్వు నేను తెరకెక్కింది. నువ్వు నేను మరొక బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఇక మూడవ చిత్రంగా ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే చేశారు. చిత్రం మూవీలో నటించిన రీమా సేన్ నే హీరోయిన్ గా తీసుకున్నారు. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మనసంతా నువ్వే థియేటర్స్ లో నిరవధికంగా రోజుల తరబడి ఆడింది.
వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్... ఆరంగేట్రంతోనే వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్ అందుకున్న హీరోగా ఉదయ్ కిరణ్ చరిత్ర సృష్టించారు. తెలుగు పరిశ్రమ చరిత్రలో ఈ రికార్డు అందుకున్న మొదటి హీరోగా ఉదయ్ కిరణ్ నిలిచారు.
కమల్ హాసన్ తరువాత అత్యంత తక్కువ వయసులో ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న ఉదయ్ కిరణ్ ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. వెంటపడే దర్శక నిర్మాతలు, ఉక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్... ఆయన స్టార్ హీరోలకు సమానమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు.
మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్స్ తో సినిమా వేదికలపై ఉదయ్ కిరణ్ కనిపించారు. ఈ క్రమంలోనే ఉదయ్ కిరణ్ జీవితంలో కొన్ని వివాదాలు చోటుచేసుకున్నాయి. అలాగే ఆయన నటించిన చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద అనుకున్న విజయాలు అందుకోలేకపోయాయి.
ప్లాప్స్ తో ఉదయ్ కిరణ్ కెరీర్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. పరిశ్రమలో గౌరవం, పరిచయాలు తగ్గిపోతూ వచ్చాయి. దానికి తోడు వైవాహిక జీవితంలో ఒడిడుకులు. తండ్రి దూరం కావడం వంటి అనేక సమస్యలు చుట్టుముట్టాయి.
తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఉదయ్ కిరణ్ జనవరి 5, 2014న హైదరాబాద్ లోని తన నివాసంలో ఉరివేసుకొని ప్రాణాలు వదిలారు. పరిశ్రమకు దొరికిన ఒక స్టార్.. అర్థాంతరంగా తన అభిమానులను శోక సంద్రంలో ముంచి వెళ్లిపోయారు.
జూన్ 26 ఉదయ్ కిరణ్ జయంతి కాగా ఆ యువ హీరోని ఇలా గుర్తు చేసుకోవడం జరిగింది. థియేటర్ లో ఓ మూవీ చూస్తూ నేను కూడా హీరోనే, త్వరలో నా మూవీ విడుదల కాబోతుందని, పక్క సీట్లో కూర్చున్న వ్యక్తికి ఉదయ్ కిరణ్ చెప్పగా.. అతను పెద్దగా నవ్వాడట. అలా నమ్మకం లేని నవ్వుతో మొదలైన ఉదయ్ కిరణ్ వెండితెర జీవితం తీరని శోకంతో ముగిసింది.