
టాలీవుడ్‌లో స్నేహితులుగా కనిపించినా, పోటీ విషయానికి వస్తే.. వివాదాల్లో నిలుస్తుంటారు మెగాస్టార్ చిరంజీవి - కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఇండస్ట్రీలో వీరిద్దరి మధ్య స్నేహం ఉన్నప్పటికీ, అనేక సందర్భాల్లో కోల్డ్ వార్ కూడా నడిచిన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా బాక్సాఫీస్ పోటీల్లో అయితే వీరి సినిమాలు తారాస్థాయిలో తలపడేవి. అంతే కాదు భహిరంగంగా కూడా వీరి మధ్య ఎన్నో వివాదాలు నడిచిన సందర్భాలు ఉన్నాయి. ఇద్దరు స్టార్ హీరోలు అవ్వడం.. టాలీవుడ్ లో ప్రముఖులగా ఉండటంతో.. అప్పట్లో వీరి మధ్య జరిగిన వార్ ఇండస్ట్రీని కుదిపేసింది. సినీ వజ్రోత్సవాల సమయంలో మోహన్ బాబు కామెంట్స్ ఎన్ని మంటలు రేపాయో అందరికి తెలిసిందే. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య స్నేహం ఉన్నా... కోల్డ్ వార్ మాత్రం కంటీన్యూ అవుతూనే ఉంది. అది ఏదో ఒక సందర్భంలో బయటపడుతూనే ఉంది.
90వ దశకంలో మెగాస్టార్ దూకుడు మామూలుగా ఉండేది కాదు. ఆయన వరుస విజయాలతో దూసుకుపోయాడు. ఖైదీ సినిమా నుంచి చిరంజీవిని ఆపడం ఎవరి వల్ల కాలేదు. కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో చిరంజీవి సినిమాలు ఇండస్ట్రీని దున్నేశాయి. అవే కాకుండా గ్యాంగ్ లీడర్, ముఠామేస్త్రీ లాంటి సినిమాలు చూసి ప్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. మెగాసినిమాలతో టాలీవుడ్ అల్లాడిపోయింది. ఆ టైమ్ లోనే మెహన్ బాబు కూడా స్టార్ హీరోగా ఉన్నారు. ఆయన కూడా హిట్ సినిమాలు చేశారు.. కానీ మెగా రేంజ్ ను మాత్రం అందుకోలేకపోయారు. సరిగ్గా అదే టైమ్ లో ఒక్క సినిమాతో చిరంజీవికి చెక్ పెట్టారు మెహన్ బాబు. మెగా దూకుడుకు కాస్త బ్రేక్ వేయగలిగారు.
1995లో చిరంజీవి దూకుడును కాస్త స్లో చేయగలిగాడు మంచు మోహన్ బాబు. ఈ సమయంలో విడుదలైన మోహన్ బాబు ‘పెదరాయుడు’ సినిమాతో చిరంజీవికి చెక్ పెట్టేశాడు. అప్పట్లో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన చిరంజీవి ‘బిగ్ బాస్’ సినిమా పెదరాయుడు ధాటికి నిలబడలేకపోయింది. ఒకే రోజు ఈ రెండు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. అంటే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నేరుగా తలపడాయి. అయితే సాధారణంగా ఇలాంటి బాక్సాఫీస్ వార్‌లో చిరంజీవిదే ఎప్పుడు పైచేయిగా ఉండేది. కానీ అప్పుడు మాత్రం పరిస్థితి తలకిందులు అయ్యింది.
‘పెదరాయుడు’ సినిమాను దర్శకుడు రవి రాజా పినిశెట్టి రూపొందించారు. ఈ చిత్రం తమిళంలో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన హిట్ మూవీ ఆధారంగా తెలుగు రీమేక్‌గా తెరకెక్కింది. తమిళ వెర్షన్‌లో శరత్ కుమార్ ద్విపాత్రాభినయం చేశాడు. తెలుగు వెర్షన్‌లో మోహన్ బాబు అదే విధంగా డ్యూయల్ రోల్ పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన గెస్ట్ రోల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిపోయింది. ఆయన సుమారు 20 నిమిషాల పాటు కనిపించిన ఆ పాత్ర ప్రేక్షకులపై తీవ్ర ప్రభావం చూపింది. ‘పెదరాయుడు’గా మోహన్ బాబు చూపించిన యాక్టింగ్ అదే సమయంలో యంగ్ మోహన్ బాబు యాక్షన్, రొమాన్స్, సౌందర్య అభినయం సినిమాకు బలంగా నిలిచాయి. దాంతో పెదరాయు సినిమా ప్రభంజనం సృష్టించింది. పల్లె జనాలు ఈసినిమాను బాగా ఆదరించారు. అద్భుత విజయం అందించారు.
ఇక అదే రోజు.. అంటే 1995 జూన్ 15న ‘పెదరాయుడు’ , చిరంజీవి ‘బిగ్ బాస్’ సినిమా రిలీజ్ అయ్యింది. ప్రారంభంలో ప్రేక్షకులు చిరంజీవి సినిమాపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. భారీ అంచనాలతో విడుదలైన ‘బిగ్ బాస్’ మొదట కొన్ని రోజులు బాగానే నడిచినా.. ఆతరువాత కొద్ది రోజుల్లోనే కలెక్షన్లు పడిపోయాయి. దాంతో బిగ్ బాస్ డిజాస్టర్ గా నిలిచింది. ఇక మొదట పెద్దగా అంచనాలు లేని ‘పెదరాయుడు’ మాత్రం రాను రాను పుంజుకుంది. గ్రామీణ నేపథ్యంతో, బలమైన కథతో, ఫ్యామిలీ ఎమోషన్స్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సౌందర్య హీరోయిన్‌గా చేసిన పాత్రకు మంచి గుర్తింపు కూడా వచ్చింది.
పెద్దరాయుడు సినిమా అన్ని అంచనాలను మించి భారీ విజయాన్ని సాధించింది. అప్పటివరకు రికార్డులు సృష్టించిన ‘ఘరానా మొగుడు’ సినిమా రికార్డులను ‘పెదరాయుడు’ బ్రేక్ చేసింది. ఈ సినిమా 39 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకొని శతదినోత్సవం జరుపుకుంది.ఇక అదే సమయంలో విడుదలైన చిరంజీవి ‘బిగ్ బాస్’ మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. 1995లో జరిగిన ఈ బాక్సాఫీస్ వార్‌లో మోహన్ బాబు ‘పెదరాయుడు’ విజేతగా నిలిచింది. ఇక అదే ఏడాది చిరంజీవి రిక్షావోడు సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. మెగాస్టార్.. ఫామ్ కోల్పోకుండా కంటీన్యూ అయ్యారు.