Karthika Deepam 2 Today Episode:కాంచన, కార్తీక్ ఏడుపు-జ్యోతో దీపను పోల్చొద్దన్న సుమిత్ర-జ్యో ఛాలెంజ్

Published : Mar 09, 2026, 08:06 AM IST

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (మార్చి 9వ తేదీ)లో శౌర్యను హత్తుకున్న కాంచన. తల్లి ప్రశ్నలకు కన్నీళ్లు పెట్టుకున్న కార్తీక్. దీపను, జ్యోతో పోల్చడం నాకు ఇష్టం లేదన్న సుమిత్ర. నేనే ఏకైక వారసురాలిని అన్న జ్యో. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..  

PREV
16
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ సోమవారం ఎపిసోడ్ లో శౌర్యకు అన్నం తినిపిస్తూ ఉంటుంది కాంచన. అమ్మ, నాన్న, చిన్న నానమ్మ ఎక్కడికి వెళ్లారు అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది శౌర్య. నువ్వు అన్నం తింటావా.. ప్రశ్నలు తింటావా అని చిరాకు పడుతుంది కాంచన. నువ్వు మారిపోయావు నానమ్మ. నా మీద కోపం చూపిస్తున్నావు. అప్పుడెప్పుడో జ్యో గ్రానీ చెప్పింది, నాకు చెల్లి పుడితే నా మీద ప్రేమ తగ్గిపోతుందని, నన్ను హాస్టల్లో వేస్తారని, నిజమేనా నానమ్మ అని అడుగుతుంది శౌర్య. ఆ మాటలకు శౌర్యను దగ్గరకు తీసుకొని నాకు నువ్వంటేనే ఎక్కువ ప్రేమ. నీ తర్వాతే ఎవ్వరైనా అని శౌర్యను ముద్దు పెట్టుకుంటుంది కాంచన.

26
డాక్టర్ ఏం చెప్పారు?

ఇదంతా గుమ్మం దగ్గర నిలబడి చూస్తుంటాడు కార్తీక్. తండ్రిని చూసిన శౌర్య.. నాన్న అమ్మ రాలేదా అని అడుగుతుంది. అమ్మమ్మ ఆరోగ్యం బాగోలేదు కదా అందుకే అమ్మ, తాత వాళ్ల ఇంట్లోనే ఉండిపోయింది. అమ్మమ్మ బాగు అయ్యాక వస్తుందని చెప్తాడు కార్తీక్. సరే నన్ను అక్కడికి తీసుకెళ్తావా అని అడుగుతుంది శౌర్య. రెండు రోజుల తర్వాత తీసుకెళ్తాను అని చెప్తాడు కార్తీక్. సరే నువ్వు వెళ్లి హోంవర్క్ చేసుకో అని శౌర్యను పంపిస్తుంది కాంచన. దీప, బిడ్డ గురించి డాక్టర్ ఏం చెప్పారు కార్తీక్ అని అడుగుతుంది కాంచన.

36
దీపను జ్యోతో పోల్చవద్దు

మరోవైపు సుమిత్ర, దశరథ మాట్లాడుకుంటూ ఉంటారు. దీపను హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా.. ఎలా ఉందని అడుగుతుంది సుమిత్ర. కార్తీక్ ఉన్నాడు కదా చూసుకుంటాడు అని చెప్తాడు దశరథ. ఈ టైంలో భర్త కంటే కూడా దీప పక్కన కన్నతల్లి ఉంటే బాగుండేది అంటుంది సుమిత్ర. బిడ్డ చెప్పకపోయినా తనకు ఏం కావాలో తల్లి తెలుసుకుంటుంది అంటుంది సుమిత్ర. కొందరు బిడ్డలు కూడా తల్లిదండ్రులు ఏం చెప్పకపోయినా వాళ్లకు ఏం కావాలో తెలుసుకుంటారు. వారికోసం ఏ త్యాగమైనా చేస్తారు అని దీపను ఉద్దేశించి అంటాడు దశరథ.

అవునండీ.. జ్యోత్స్నను చూస్తే నాకు అదే అనిపిస్తోంది. నాకోసం తను ఆపరేషన్ కి కూడా ఒప్పుకుంది అంటుంది సుమిత్ర. మన కూతురు జ్యోత్స్న కాదు దీప అని మనసులో అనుకుంటాడు దశరథ. మీరు జ్యోత్స్నతో అంత కోపంగా మాట్లాడకండి అంటుంది సుమిత్ర. నువ్వే చూశావు కదా.. దీప గురించి తను ఎంత నీచంగా మాట్లాడిందో అంటాడు దశరథ. దీప కూడా మన కూతురు అయితే ఇలాగే వదిలేస్తామా అని అడుగుతాడు దశరథ. దీప అంటే నాకు ప్రేమ, అభిమానం ఉండొచ్చు కానీ.. నా కన్నకూతురితో సమానంగా చూడలేను, ప్రేమించలేను కదా అంటుంది సుమిత్ర. మీరు ఇంకెప్పుడు దీపను, జ్యోత్స్నతో పోల్చకండీ నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్తుంది సుమిత్ర.

46
కన్నీళ్లు పెట్టుకున్న కార్తీక్

చెప్పు కార్తీక్.. బిడ్డ గురించి డాక్టర్ ఏం చెప్పారు. కడుపులో బిడ్డకు ఏం కానియ్యను అత్తయ్య అని దీప మాటిచ్చింది. నిలబెట్టుకోలేని వాగ్ధానాలు ఎందుకు చేయాలి? ఇలా నన్ను ఎందుకు పిచ్చిదాన్ని చేయాలి. నీకు బిడ్డ పుట్టిన శౌర్య నాకు మనుమరాలే. దానిపై నా ప్రేమ ఎప్పటికీ తగ్గదు. కానీ నేను చనిపోయేలోపు నీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డను చూడాలి అనుకుంటున్నాను. అది జరుగుతుందా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది కాంచన.

తనకు మళ్లీ పిల్లలు పుట్టే అవకాశం లేదని విషయాన్ని గుర్తుచేసుకొని, తల్లి ఒడిలో పడుకొని ఏడుస్తాడు కార్తీక్. చెప్పు కార్తీక్ బిడ్డపై ఆశలు వదులుకోమంటావా అని అడుగుతుంది కాంచన. ఎవరికోసం ఎవరి ఆశలు వదులుకోవద్దు కాంచన అనుకుంటూ లోపలికి వస్తాడు శ్రీధర్. కార్తీక్ నువ్వు హాస్పిటల్ కి వెళ్లాలి కదా.. వెళ్లు నేను ఉంటాను అని చెప్తాడు శ్రీధర్.

56
ఎప్పటికీ జరగనివ్వను

మరోవైపు దాసును కలుస్తుంది జ్యోత్స్న. దీపను హాస్పిటల్లో జాయిన్ చేశారు తెలుసా అని అడుగుతుంది జ్యోత్స్న. తను ప్రెగ్నెంట్ కదా ఏవో టెస్టులకోసం చేసి ఉంటారు అంటాడు దాసు. నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా.. మా మమ్మీకి ఆపరేషన్ జరిగే హాస్పిటల్లోనే దీపను అడ్మిట్ చేశారంటే అర్థమేంటి? బోన్ మ్యారో తన నుంచి కూడా తీసుకునే ఛాన్స్ ఉంది కదా.. అంటుంది జ్యోత్స్న. ఉండొచ్చు అంటాడు దాసు.

నేను అమాయకంగా నటిస్తాను కానీ అమాయకురాలిని కాదు.. అందరూ కలిసి దీపను ఆ ఇంటికి వారసురాలిని చేయాలి అనుకుంటున్నారేమో.. అది నేను ఎప్పటికీ జరగనివ్వను. నేనే శివన్నారాయణ ఆస్తికి ఏకైక వారసురాలిని అంటుంది జ్యోత్స్న. నువ్వు ఇక ఏం చేయలేవు. నిజాలు ఎప్పుడో బయటపడ్డాయి అంటాడు దాసు. అంటే మా డాడీతో నువ్వు నిజం చెప్పావా అని అడుగుతుంది జ్యోత్స్న. అలా అని నేను చెప్పానా అంటాడు దాసు. నా వెనకాల ఏదో జరుగుతోంది. అది నేనే కనిపెడతాను. దీపకు ఏది దక్కనివ్వను చూడు అని ఛాలెంజ్ చేసి వెళ్లిపోతుంది జ్యోత్స్న.

66
నాకు ఇష్టం లేదు..

మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతుంది కాంచన. ఇక్కడ నా అవసరం ఉంది కాబట్టి వచ్చాను అంటాడు శ్రీధర్. మీరు ఇక్కడ ఉండటం నాకు ఇష్టంలేదు అంటుంది కాంచన. దీప, హాస్పిటల్లో ఉంది కార్తీక్ అక్కడే ఉండాలి. అందుకే నేను కాపలాగా వచ్చాను అని చెప్తాడు శ్రీధర్. అవసరం లేదు అంటుంది కాంచన. నేను ఇంటి బయట పడుకుంటే, మీకు ఇబ్బంది ఏం లేదు కదా అంటాడు శ్రీధర్. 

మరి అక్కడ ఎవరిని పెట్టారు అని అడుగుతుంది కాంచన. అక్కడ కాశీ ఉన్నాడు. నేను ఇక్కడే బయట కార్లో పడుకుంటాను. ఏదైనా అవసరం అయితే ఫోన్ చెయ్ అని బయటకు వెళ్తాడు శ్రీధర్. ఈయన నాకంటే మొండిగా తయారయ్యారు అంటుంది కాంచన. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories