
కార్తీక దీపం 2 సీరియల్ గురువారం ఎపిసోడ్ లో సుమిత్ర, కాంచన, శ్రీధర్ మాట్లాడుకుంటూ ఉంటారు. మన ఇద్దరి జీవితాల్లో తుపాను దగ్గరి దాకా వచ్చి వెళ్లిపోయింది వదిన అంటుంది కాంచన. నువ్వు కార్తీక్ బిడ్డను చూడాలి అనుకున్నావు. నేను నా కూతురి పెళ్లి చూడాలని అనుకున్నాను. ఇద్దరి కోరికలు బలమైనవే. అందుకే ఇద్దరు తల్లుల కోరికలు తీరాయి అంటుంది సుమిత్ర.
మరోవైపు అమ్మ బాధ జ్యోత్స్న పెళ్లి గురించే అయితే జ్యోత్స్నకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయి నాన్న అని దశరథతో చెప్తుంది దీప. తను పెళ్లి చేసుకోనని చెప్పింది అంటాడు దశరథ. అంతలో కార్తీక్ వచ్చి జ్యోత్స్నకు పెళ్లి చేసేవరకు నీ కూతురు ప్రశాంతంగా ఉండేలా లేదు. తను నిద్రపోదు, నన్ను నిద్రపోనివ్వదు. రాత్రుళ్లు ఉలిక్కిపడి లేచి ఏడుస్తోంది. జ్యోత్స్న మిమ్మల్ని ఏదో చేస్తుందని భయపడుతోంది అంటాడు కార్తీక్.
నిన్ను ఒక మాట అడుగుతాను చెప్పు కార్తీక్ అంటాడు దశరథ. కన్న ప్రేమ గొప్పదా? పెంచిన ప్రేమ గొప్పదా? అని కార్తీక్ ని అడుగుతాడు. పెంచిన ప్రేమే గొప్పది నా సొంత బిడ్డను వదులుకోవడానికి నేను ఒప్పుకున్నాను కానీ శౌర్య ప్రాణాల మీదకు వచ్చినప్పుడు నా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్నాను అని చెప్తాడు కార్తీక్. నేను కూడా నీలాంటి తండ్రినే. జ్యోత్స్న మంచి కూతురు కాకపోవచ్చు. కానీ నేను మంచి తండ్రినే. ఒక కూతురిని ఎంత ప్రేమగా చూసుకోవాలో, అంత ప్రేమగా చూసుకున్నాను. తను నా కన్నకూతురు కాదని ఇప్పుడు తెలిసింది అని ఫీల్ అవుతాడు దశరథ. తను ఈ ఇంటి వారసురాలు కాదని తెలిస్తే ఎక్కడ తన స్థానం పోతుందేమోనని జ్యోత్స్న ఇలా మారిపోయిందని చెప్తాడు కార్తీక్.
డాక్టర్ సుమిత్రతో షాకింగ్ విషయాలు చెప్పొద్దు అంది కదా.. కానీ జ్యోత్స్న కూతురు కాదన్న విషయం ఎప్పటికైనా సుమిత్రకు తెలియాల్సిందే. కాబట్టి తనని ముందు నుంచే మానసికంగా రెడీ చేద్దామంటాడు దశరథ.
దీప, కార్తీక్, దశరథ కలిసి సుమిత్ర గదికి వెళ్తారు. డాక్టర్ ని ఎందుకు పిలిచావు అంటే మీ అత్తకు కాస్త బాగోలేదు అని మామయ్య చెప్పాడా... కానీ నువ్వు పూర్తి ఆరోగ్యంతో ఉన్నావని డాక్టర్ చెప్పింది అత్త అంటాడు కార్తీక్. బిడ్డ క్షేమంగా ఉందని వదిన చెప్పింది. మీరు పిల్లాపాపలతో సంతోషంగా ఉండటమే మాకు కావాలి అంటుంది సుమిత్ర.
జ్యోత్స్న కూడా మీలాగే ఉంటే బాగుండేది అంటుంది సుమిత్ర. జ్యోత్స్న కోసం నేను ఒక నిర్ణయం తీసుకున్నా. నువ్వు సపోర్ట్ గా నిలబడాలని సుమిత్రతో చెప్తాడు దశరథ. సరే అంటుంది సుమిత్ర. ఏం నిర్ణయం తీసుకున్నావు మామయ్య అని అడుగుతాడు కార్తీక్. మంచి జరగాలంటే కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. కాసేపు ఆగు మీకే తెలుస్తుంది అంటాడు దశరథ.
కాసేపటికి శివన్నారాయణ ఇంటికి లాయర్ వస్తాడు. తాత మీకోసం లాయర్ వచ్చాడు అని చెప్తుంది జ్యోత్స్న. నేను పిలవలేదే అంటాడు శివన్నారాయణ. నేనే పిలిచాను అంటాడు దశరథ. ఎందుకు అని అడుగుతాడు శివన్నారాయణ. వీలునామా మార్చి రాయించానని అందరికీ షాక్ ఇస్తాడు దశరథ.
వీలునామా ప్రకారం దశరథకు తండ్రి నుంచి వచ్చిన ఆస్తి తన రక్తం పంచుకొని పుట్టిన కూతురి పిల్లలకు చెందుతుందని లాయర్ వీలునామా చదువుతాడు. 15 నెలల షరతు కూడా ఉంటుంది. 15 నెలల లోపు కూతురికి పెళ్లి కాకపోయినా, పెళ్లి అయి పిల్లలు పుట్టకపోయినా ఈ ఆస్తి మొత్తం తన మేనల్లుడి కుటుంబానికి చెందుతుందని లాయర్ చెప్తాడు. జ్యోత్స్న, పారులకు మైండ్ బ్లాంక్ అవుతుంది
ఏంటి దశరథ ఇది. ఆస్తి మీ నాన్న గారిది. ఆయన కూతురి మీద కోపంతో ఆస్తి మొత్తం నీ పేరు మీద రాశారు. నువ్వు ప్రేమతో కూతురికి రాయాలి. కానీ కూతురి పిల్లల పేరు మీద రాయడం ఏంటీ? అని గట్టిగా ప్రశ్నిస్తుంది పారు. అందులో తప్పేముంది అంటాడు దశరథ. ఇదంతా మోసం అంటుంది జ్యోత్స్న. మనుమరాలికే సపోర్ట్ చేస్తాడు శివన్నారాయణ. నేను నా కూతురి పిల్లలకు రాయడంలో తప్పేముంది. నువ్వు నా కూతురివి కాదా జ్యోత్స్న అని అడుగుతాడు దశరథ.
ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా బావ. మీరు అనుకున్నదే జరిగింది కదా.. మీరంతా కట్టకట్టుకొని వచ్చినప్పుడే నాకు అర్థమైంది. ఇలాంటిది ఏదో ఉంటుందని అని అంటుంది జ్యోత్స్న. దీని గురించి నాకు ఏం తెలియదు. ఇది పూర్తిగా మామయ్య నిర్ణయం అంటాడు కార్తీక్. కాంచన కూడా జ్యోత్స్న, పారులపై సీరియస్ అవుతుంది.
లాయర్ గారు మీరు వెళ్లండి. ఏదైనా అవసరం అయితే కాల్ చేస్తాను అంటాడు శివన్నారాయణ. ఆగండి లాయర్ గారు, వీలునామాను ఇప్పుడే మార్చి రాయాలి అంటుంది జ్యోత్స్న. వీలునామాలో ఎలాంటి తప్పులు లేవు. నువ్వు నా కూతురివి కాదని చెప్పు ఇప్పుడే వీలునామా మార్చేస్తాను అంటాడు దశరథ. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.