
కార్తీక దీపం 2 సీరియల్ మంగళవారం ఎపిసోడ్ లో దీప ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పగానే అంతా సంతోషిస్తారు. ప్రెగ్నెంట్ అంటే ఏంటి అమ్మమ్మ అని అడుగుతుంది శౌర్య. నువ్వు ఆడుకోవడానికి త్వరలో బుజ్జి చెల్లో.. తమ్ముడో వస్తాడు అని చెప్తుంది సుమిత్ర. థాంక్స్ అమ్మ అంటుంది శౌర్య. అందరూ దీపకు కంగ్రాట్స్ చెప్తారు. జ్యోత్స్న మాత్రం కోపంతో పక్కకు వెళ్తుంది. వెనకాలే పారు వెళ్తుంది.
దీప ప్రెగ్నెంట్ అయిందనే షాక్ లోనే ఉండిపోతుంది జ్యోత్స్న. పారు వచ్చి గట్టిగా పిలుస్తుంది. ఏమైందే నీకు.. అలా ఉన్నావు అంటుంది. దీప ప్రెగ్నెంట్ అయింది నిజమేనా అని మళ్లీ అడుగుతుంది జ్యోత్స్న. నిజమే అని చెప్తుంది పారు. వారసురాలికి మంచి జరుగుతుంది అని గురువు గారు చెప్పారు కదా అని నోరు జారుతుంది జ్యోత్స్న. కానీ దీప వారసురాలు కాదు కదా.. నీ టెన్షన్ చూస్తుంటే అదే వారసురాలేమో అనిపిస్తుంది అంటుంది పారు.
గ్రానీకి అనుమానం వచ్చినట్లు ఉందని మాట మారుస్తుంది జ్యోత్స్న. ఇన్ని రోజులు బావ, దీపల మధ్య అలాంటివి ఏమి లేవనకున్నాను. కానీ దీప ప్రెగ్నెంట్ అయితే బావ నాకు దక్కడు అని కంగారు పడుతుంది జ్యోత్స్న. వాడు నీకు ఎప్పుడూ దక్కడు కానీ.. నీకు తగిన వాడ్ని చూసి పెళ్లి చేసుకో అంటుంది పారు. అవన్నీ తర్వాత.. ఫస్ట్ దీప సంగతి చూడాలి అంటుంది జ్యోత్స్న. అంతలో స్వీట్స్ పట్టుకొని అక్కడకు వస్తాడు దాసు. మంచి వాళ్లకు మంచే జరుగుతుంది. ఇప్పటికైనా మారితే మంచిదని హితబోధ చేస్తాడు.
మన అమ్మ మళ్లీ మన ఇంట్లో పుట్టడానికి కారణం నాన్నే చెల్లెమ్మ అంటాడు దశరథ. అమ్మ గుర్తుగా నాన్న దాచుకున్న తాళి దీప మెడలో పడిందని చెప్తాడు. మీ అమ్మ ఏమైనా దీప కడుపులో పుడతానని చెప్పిందా? జ్యోత్స్న ఈ ఇంటి వారసురాలు కాబట్టి తన పెళ్లి అయ్యాక పుడుతుందేమో అంటుంది పారిజాతం. అమ్మమ్మ జ్యోత్స్న కడుపులో పుడతానని నీతో చెప్పిందా పారు అని కౌంటర్ ఇస్తాడు కార్తీక్.
దీప, కార్తీక్ లను ఆశీర్వదించమని గురువు గారితో చెప్తాడు శివన్నారాయణ. నీ సమస్యలకు పరిష్కారం దొరికే రోజు దగ్గర్లోనే ఉందమ్మా అని దీపతో చెప్తాడు గురువు. దశరథ, సుమిత్రలతో మీ దంపతులిద్దరు కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పి బయటకు వెళ్లిపోతాడు.
ఏంటి గురువు గారు అలా చెప్పారు అని అడుగుతాడు శివన్నారాయణ. హోమం జరిపించింది జరగబోయే విపత్తును శాంత పరచడానికే తప్పా.. పూర్తిగా నివారించడానికి కాదు. మీ కుటుంబానికి ప్రమాదం ఇంకా ఉంది. అది ఏ రూపంలో వస్తుందో.. ఎప్పుడో వస్తుందో చెప్పలేను. జాగ్రత్తగా ఉండమని మాత్రం చెప్పగలను అని శివన్నారాయణకు చెప్పి వెళ్లిపోతాడు గురువు.
తమ్ముడి ఫోటో దగ్గర దీప ప్రెగ్నెంట్ అని చెప్పి ఎమోషనల్ అవుతుంది అనసూయ. ఈ టైంలో అమ్మానాన్న పక్కన ఉంటే ఆ సంతోషమే వేరు అంటుంది. ఉన్నారు కదా అంటాడు కార్తీక్. ఎవరూ అంటారు అనసూయ, కాంచన. ఇంకెవరు సుమిత్ర అత్త, దశరథ మామయ్య అంటాడు కార్తీక్. మాట వరసకు కూతురు అన్నంత మాత్రాన నిజమైన తల్లిదండ్రులు కాలేరు అంటుంది అనసూయ. పెళ్లైన ఆడదానికి భర్తే అన్నీ.. దీపకు బొట్టు పెట్టి ఆశీర్వదించమని కార్తీక్ తో చెప్తుంది.
మరోవైపు నాకు వీలు కాదు అంటుంటే కూడా మాట్లాడాలి అని పిలుస్తున్నావు. ఎవరైనా చూస్తే నేను దొరికిపోతాను నాన్న అని దాసుతో అంటుంది జ్యోత్స్న. నీకు దండం పెడతాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో... నీ కూతురు బాగుండాలంటే, దీప గురించి నిజం చెప్పకపోతే చాలని అంటుంది జ్యోత్స్న. నా తల్లి పాపం చేసింది. నేను తప్పు చేశాను. ఆ రెండిటిని నేను సరిదిద్దుతాను. శివన్నారాయణతో నువ్వు నా కూతురే అని చెప్తాను పదా అంటాడు దాసు.
వద్దు నాన్న నువ్వు నిజం చెప్తే నా పరిస్థితి కూడా కాశీలా అవుతుంది. వాడికి తలదాచుకోవడానికి కనీసం అత్తగారి ఇళ్లు అయినా ఉంది అంటుంది జ్యోత్స్న. వారసురాలినే పనిమనిషిని చేశావు. నువ్వు పనిమనిషిగా ఉంటే తప్పేంటి అంటాడు దాసు. నా నోరును నువ్వు మూయించొచ్చు కానీ నిజం నోరును ఎవరూ మూయించలేరు అంటాడు దాసు.
ఇప్పటి వరకు వారసురాలు ఒక్కరే. కానీ ఇప్పుడు వారసురాలి కడుపులో మరో ప్రాణం పెరుగుతోంది అంటాడు దాసు. దీప సుమిత్ర కడపులో కోటీశ్వరురాలిగా పెరిగింది. కానీ భూమి మీద పడ్డాక పేదింట్లో పెరగాల్సి వచ్చింది. దీప కడుపులో పెరుగుతున్న బిడ్డ మాత్రం పేదింట్లో పుట్టి పెద్దింటి బిడ్డగా పెరుగుతుంది అంటాడు దాసు. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.