
కార్తీక దీపం 2 సీరియల్ సోమవారం ఎపిసోడ్ లో ఏవండీ అనుకుంటూ లోపలికి వస్తుంది కావేరి. మీరూ ఇక్కడే ఉన్నారా అంటుంది శ్రీధర్ ని. కార్తీక్ కోసం వచ్చారట కావేరి అని చెప్తుంది కాంచన. నేను మాత్రం నా కోడలి కోసం వచ్చాను అంటుంది కావేరి. వాళ్లు ఇంకా రాలేదు అంటుంది కాంచన. దీప కోసం పిండివంటలు తెచ్చాను అని చెప్తుంది. ఇంతలో హాయ్ చిన్న నానమ్మ అంటూ శౌర్య వస్తుంది. మీ తాతకు హాయ్ చెప్పవా అని అడుతుంది కావేరి.
నువ్వంటే ఎప్పుడో ఒకసారి వస్తావు కానీ.. తాత ఎప్పుడూ వస్తూనే ఉంటాడు కదా అంటుంది శౌర్య. ఈ ఒక్క మాటతో కావేరి మనసులో లేని అనుమానం మొదలవుతుంది అని మనసులో అనుకుంటాడు శ్రీధర్. కార్తీక్ కోసం ఆయన అప్పుడప్పుడు వస్తాడు కదా.. దాని గురించే శౌర్య చెప్తోంది అంటుంది కాంచన. ఇది కూడా తన ఇల్లే కదా.. ఎవ్వరి కోసమైనా రావచ్చు అంటుంది కావేరి. స్వీటు పెట్టమని అడుగుతుంది శౌర్య. ఇది నీ కోసం కాదు అమ్మ కోసం అంటుంది కావేరి. పెట్టాల్సిందేనని మారాం చేస్తుంది శౌర్య. గట్టిగా అరిచి లోపలికి వెళ్లమంటుంది కాంచన. ఏడుస్తూ వెళ్లిపోతుంది శౌర్య.
ఇంతలో కార్తీక్, దీప వస్తారు. ఎప్పుడు వచ్చారు చిన్నమ్మ అంటాడు కార్తీక్. ఇందాకే వచ్చాను. దీప కోసం పిండివంటలు తీసుకొచ్చాను అని చెప్తుంది కావేరి. మీ నాన్న మీతో ఏదో మాట్లాడాలంటా.. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు త్వరగా మాట్లాడితే వెళ్లిపోతారు. ఆలస్యమవుతోంది కదా అంటుంది కాంచన. మీరు మాట్లాడుతూ ఉండండి. నేను కాఫీ తెస్తాను అంటూ లోపలికి వెళ్లబోతుంది దీప.
మాట్లాడాల్సిందే నీతో అయితే నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటాడు శ్రీధర్. దీపతో ఏం మాట్లాడాలి అంటాడు కార్తీక్. మీ అమ్మకు దీప అంటే ఇష్టం లేదు. తను తల్లి కావడం అస్సలు ఇష్టం లేదు అంటాడు శ్రీధర్. అంతా షాక్ అవుతారు. నా కోడలి మీద నాకు ప్రేమ లేదు అనడానికి ఎంత ధైర్యం మీకు అంటుంది కాంచన. తనంటే ఇష్టం లేదు కాబట్టే మీ నాన్న ఇంటికి తనని పనిమనిషిగా పంపిస్తున్నావు. కడుపుతో ఉండి పనిచేయాల్సిన అవసరం ఏంటి తనకి?
ఈ రోజు దీప మీ నాన్న ఇంట్లో కింద పడబోయింది. ఒకవేళ పడితే ఏమయ్యేదో తెలుసా? మీ అమ్మ మళ్లీ చచ్చిపోయేది అంటాడు శ్రీధర్. ఏం కాలేదు కదా మామయ్య గారు అంటుంది దీప. నువ్వు కాలి జారి కిందపడినప్పుడు నా గుండె జారినంత పనైంది. నువ్వు కడుపులో మోసేది నా కొడుకు వారసత్వాన్ని.. అంటే నా వారసత్వాన్ని జాగ్రత్తగా ఉండాలి కదా అంటాడు శ్రీధర్. నీకు నిజంగా నీ కొడుకు, కోడలిపై ప్రేమ ఉంటే వాళ్లను ఆ ఇంటికి వెళ్లకుండా ఆపు అని చెప్పి వెళ్లిపోతాడు శ్రీధర్. ఆయన కోపంగా చెప్పినా ఇది ఆలోచించాల్సి న విషయమే అక్కా.. అని చెప్పి వెళ్లిపోతుంది కావేరి.
మరోవైపు జాయినింగ్ లెటర్ తో కాశీ దగ్గరికి వెళ్తుంది స్వప్న. కాశీ నాన్న వచ్చారు. ఈ లెటర్ ఇచ్చారు అంటూ సంతోషంగా కాశీకి ఇస్తుంది స్వప్న. తీసుకొని ఓపెన్ చేసి చూసి షాక్ అవుతాడు కాశీ. మామయ్య గారు ఏంటి ఇది? నేను ఎలా కనిపిస్తున్నాను మీకు? నేను జ్యోత్న్స గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ సీఈఓకి పీఏగా పనిచేయాలా? అంటాడు కాశీ. చేస్తే తప్పేంటి అంటాడు శ్రీధర్. నేను చేయను అంటూ కోపంగా లోపలికి వెళ్తాడు కాశీ.
మీరు అల్లుడి గారిని అవమానించడానికి కాకపోతే.. ఏంటండి ఇది అంటుంది కావేరి. ఇందులో తప్పేం ఉంది. మంచి శాలరీ వస్తుంది. వర్క్ నేర్చుకుంటాడు. తర్వాత ఒక రెస్టారెంట్ పెట్టిస్తే చక్కగా బిజినెస్ చేసుకుంటాడు అంటాడు శ్రీధర్. ఈ జాబ్ కి నేను తనని ఒప్పిస్తాను అని చెప్పి లోపలికి వెళ్తుంది స్వప్న. భార్యా భర్తల మధ్య గొడవ పెట్టారు కదా అంటుంది కావేరి. అల్లుడి కోపం మనముందే కానీ భార్య ముందు కాదు అంటాడు శ్రీధర్.
నువ్వు ఈ జాబ్ చేస్తావా లేక నన్ను మా అన్నయ్య దగ్గరికి వెళ్లిపోమంటావా అని కాశీని నిలదీస్తుంది స్వప్న. అదేంటి మీ అన్నయ్య దగ్గరికి ఎందుకు? అంటాడు కాశీ. అక్కడే ఉండడానికి అంటుంది స్వప్న. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ఉంటానంటే.. నేను నీతో ఉండను.. మనం కలిసి ఉండాలంటే నువ్వు ఈ జాబ్ చేయాలి అంటుంది స్వప్న. చేస్తాను అంటాడు కాశీ.
ఆ ఇంటికి వెళ్లొద్దు అని అత్త అంటే ఏం చేస్తావు బావ అంటుంది దీప. అదే ఆలోచిస్తున్నాను అంటాడు కార్తీక్. నిజం తెలిస్తే అత్త ఇలా మాట్లాడదు కానీ.. వాళ్లకు నిజం తెలియదు కదా అంటుంది దీప. పోనీ అమ్మతో నిజం చెప్తామా అంటాడు కార్తీక్. ఏ రోజైనా తెలియాల్సిందే కదా అంటుంది దీప. అయితే చెప్తామా అంటాడు కార్తీక్. ఏ నిజం చెప్పాలి అంటూ వాళ్ల దగ్గరికి వస్తుంది కాంచన. ఏం లేదు అని కవర్ చేస్తారు ఇద్దరూ.
నాతో ఏం చెప్పొద్దు అన్నీ మీ దగ్గరే దాచుకోండి. కానీ రేపటి నుంచి ఆ ఇంటికి వెళ్లడానికి వీల్లేదు అంటుంది కాంచన. ఎందుకమ్మా దీపకు ఏం కాలేదు కదా అంటాడు కార్తీక్. ఎవరో వచ్చి నన్ను నిలదీసేవరకు మీరు ఎందుకు తీసుకొస్తున్నారు. మీరు వెళ్లడానికి నేను ఒప్పుకోను అంటుంది కాంచన. ఇంతలో శౌర్య అక్కడికి వస్తుంది. ఎందుకు నానమ్మ అంత పెద్దగా మాట్లాడుతున్నావు అంటుంది. కోపంగా తనని అక్కడినుంచి వెళ్లిపో అంటుంది కాంచన.
ఏమైందమ్మ నీకు శౌర్యతో అలా మాట్లాడావు అని కార్తీక్ ఏదో అనబోతుండగా కంట్రోల్ చేస్తుంది దీప. నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్లు అని కోపంగా అరుస్తాడు కార్తీక్. నీ భార్య వెళ్లి ఏడుస్తూ ఉంటుంది. నువ్వు కూడా వెళ్లు అని చెప్పి గదిలోకి వెళ్తుంది కాంచన. అందరూ నాపై అరిచేవాళ్లే. మరి నా కోపం ఎవరిపై చూపించాలి. ఇప్పుడు దీప ఎలా ఫీల్ అవుతోందోనని అనుకుంటాడు కార్తీక్. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.