
కార్తీక దీపం 2 శనివారం ఎపిసోడ్ లో ఈయనకు నిన్న రాత్రి చెప్పింది అర్థం కాలేదేమో.. మళ్లీ ఉదయాన్నే గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేశారని అంటుంది కాంచన. కోపంగా శ్రీధర్ కి కాల్ చేస్తుంది. ఏంటి మెసేజ్ చేశారు అని అడుగుతుంది. నీతో ఒకటి చెప్పాలి అంటాడు శ్రీధర్. జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ సీఈఓగా మొదటి రోజు ఆఫీసుకి వెళ్తున్నాను అని చెప్తాడు. అది మీ ఇంట్లో మీ భార్యకు చెప్పి వెళ్లండి అంటుంది కాంచన.
ఇంతలో అక్కడికి వచ్చిన కార్తీక్.. ఫోన్ లో ఎవరమ్మా మాస్టారా? అని అడుగుతాడు. కాదు రాంగ్ నెంబర్ అని చెప్పి.. కట్ చేయకుండానే ఫోన్ పక్కన పెడుతుంది కాంచన. ఇలా చెప్తోంది ఏంటి అని లైన్ లో ఉంటాడు శ్రీధర్. ఇదిగో ఈ పూలు దీపకు ఇవ్వు అని కార్తీక్ కి ఇచ్చి అక్కడినుంచి వెళ్లిపోతుంది కాంచన.
అత్తయ్య ఏది అనుకుంటూ అక్కడికి వస్తుంది దీప. ఇదిగో ఈ పూలు పెట్టుకో అని దీప తలలో పెట్టి పొగుడుతుంటాడు కార్తీక్. వాళ్ల మాటలు వింటూ ఉంటాడు శ్రీధర్. ఇంతలో దీపకు ఓ ఆలోచన వస్తుంది. బావ నీకు ఒక ఆలోచన చెప్తాను తక్కువ చేసి చూడొద్దు అంటుంది. ఏంటో చెప్పమంటాడు కార్తీక్.
గతంలో నేను సైకిల్ పై టిఫిన్స్ పెట్టుకొని అమ్మినట్లు.. జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ నుంచి కూడా చిన్న చిన్న ఫుడ్ కోర్ట్స్ పెట్టి అపార్ట్ మెంట్స్, జనాలు ఎక్కువగా ఉన్న చోట అమ్మితే ఎలా ఉంటుంది అని అడుగుతుంది. ఐడియా బాగుంది కానీ.. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది మా నాన్న అంటాడు కార్తీక్. ఈ ఆలోచన మామయ్య గారికి కచ్చితంగా నచ్చుతుంది అంటుంది దీప.
మరోవైపు కాశీ ఫోన్ మోగుతూ ఉంటుంది. లిఫ్ట్ చేయాలా వద్దా అనుకుంటూనే లిఫ్ట్ చేస్తుంది స్వప్న. ఫోన్ లిఫ్ట్ చేయగానే అవతలి వ్యక్తి ఫోన్ తీయడానికి ఎందుకురా ఇంతసేపు.. ఇంకా పడుకునే ఉన్నావా? అయినా ఇప్పటివరకు పడుకునే అంత లగ్జరీ నీకు నాకు లేదులే మామ. ఎందుకంటే మన ఇద్దరికీ జాబ్ లేదు. జాబ్ వెతుక్కోవాలి అంటాడు. ఆ మాటలు విన్న స్వప్న షాకై ఫోన్ కట్ చేస్తుంది. అంటే కాశీ జాబ్ వచ్చిందని అబద్ధం చెప్పాడా అని ఆలోచిస్తూ ఉంటుంది.
ఇంతలో అక్కడికి వస్తాడు కాశీ. ఈ రోజు ఆఫీసుకి ఎందుకు వెళ్లలేదు అని అడుగుతుంది స్వప్న. ఏదో ఒకటి చెప్పి మ్యానేజ్ చేస్తాడు కాశీ. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అంటుంది స్వప్న. ఫ్రెండ్ ని కలవడానికి అని చెప్తాడు. ఇంతలో కాశీకి మళ్లీ ఫోన్ వస్తుంది. వాడే ఫోన్ చేస్తున్నాడు వెళ్లాలి అంటూ వెళ్లిపోతాడు.
ఒక గంట లేటైనా పర్లేదు గురువుగారు. మీకోసం నేను వెయిట్ చేస్తాను అని ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు శివన్నారాయణ. మళ్లీ ఎందుకు పిలుస్తున్నారండి ఆయన్ని అంటుంది పారు. నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇంట్లో వాళ్ల అందరి జాతకాలు చూపించాలి అంటాడు శివన్నారాయణ. ఇంతలో కార్తీక్, దీప వస్తారు. వారి వెనుకే శ్రీధర్ వస్తాడు. ఇంతకు ముందు ఇద్దరు వచ్చేవాళ్లు ఇప్పుడు ముగ్గురు వస్తున్నారు అంటుంది పారు. నిన్ను పెట్రోల్ డబ్బులేమి అడగంలే అంటాడు కార్తీక్. అడగకపోయినా అన్నీ రాసుకుంటారు కదా అంటుంది పారు.
రెస్టారెంట్స్ డెవలప్ చేయడానికి డే వన్ నుంచే ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయాలి అంటుంది జ్యోత్స్న. ఆ మాట ఎవరో చెప్తున్నారో విన్నారో అని వెటకారం చేస్తాడు కార్తీక్. నా మనుమరాలిని తీసిపారేయడం కాదు.. మీ నాన్నను ఒక్క మంచి ఐడియా చెప్పమను అంటుంది పారు. జ్యోత్స్న రెస్టారెంట్స్ తరపున ఫుడ్ కోర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నాను అని చెప్తాడు శ్రీధర్.
ఇది మన ఐడియా కదా ఈయనకు ఎలా తెలిసింది అని దీప, కార్తీక్ అనుకుంటారు. ఐడియా బాగుందని అందరూ అన్నాక... ఇది నా ఐడియా కాదు దీప ఐడియా.. మిగతా విషయాలు దీప చెప్తుంది అంటాడు శ్రీధర్. ఇది నాకెలా తెలుసని అనుకుంటున్నారా.. ఉదయం ఫోన్ లో మీ మాటలు విన్నాను అంటాడు శ్రీధర్. వీళ్లు ఇంట్లో కూడా కంపెనీ డెవలప్ మెంట్ గురించే మాట్లాడుకుంటున్నారు అందుకు సంతోషించాలి అంటాడు శ్రీధర్.
అవును మామయ్య వీళ్ల ఆలోచనలు ఎప్పుడూ మా ఇంటి చుట్టూ, ఆస్తి చుట్టే తిరుగుతూ ఉంటాయి అంటుంది జ్యోత్స్న. అవును మాకు కాస్త విశ్వాసం ఎక్కువ. అన్నం పెట్టిన బాగుండాలని కోరుకుంటాం అంటాడు కార్తీక్.
ఫుడ్ కోర్టు ఐడియా గురించి వివరిస్తాడు కార్తీక్. మంచి క్వాలిటీ ఫుడ్ ని, తక్కువ ధరకు జనాల దగ్గరికి తీసుకెళ్లడమే మన పని. దానివల్ల మన రెస్టారెంట్ గ్రాఫ్ అలా పెరిగిపోతుంది అంటాడు కార్తీక్. ఐడియా చాలా బాగుందని మరోసారి అందరూ మెచ్చుకుంటారు. ఈ ఐడియా దీపది. క్రెడిట్ కూడా దీపకే దక్కాలి అంటాడు కార్తీక్. అందరూ దీపను మెచ్చుకుంటారు. నీ ఆలోచనల గురించి తెలుసు కాబట్టే నీ భర్త నిన్ను సీఈఓ గా నిలబెట్టాడని మరోసారి గుర్తు చేస్తాడు శివన్నారాయణ. పారు, జ్యోత్స్న లోలోపల కుళ్లుకుంటూ ఉంటారు.
కార్తీక్ ని పక్కన కూర్చోబెట్టుకుంటాడు శివన్నారాయణ. నా కూతురు ఎలా ఉందని అడుగుతాడు. బాగానే ఉందంటాడు కార్తీక్. బాగానే కాదురా.. శ్రీధర్ సీఈఓ అయినందుకు తను ఎలా ఫీల్ అయింది? తనతో మాట్లాడిందా? క్షమించిందా? కలిసిపోయారా? అని అడుగుతాడు. నువ్వు మరీ అంత ఊహించుకోకు.. జస్ట్ విష్ చేసింది అంతే.. మా అమ్మ నీ కూతురు. మీరు ఒక్కసారి చెప్తే ఏదైనా వింటారా? అంటాడు కార్తీక్. కోపంగా చూస్తాడు శివన్నారాయణ. ఇంకా ఎన్ని రోజులు. అందరూ కలిసిపోతే చూడాలని ఉందిరా.. నా కోరికను ఏ దేవుడు తీరుస్తాడో అని అంటాడు శివన్నారాయణ. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.