
కార్తీక దీపం 2 మంగళవారం ఎపిసోడ్ లో సుమిత్ర, దశరథల మధ్య మరింత దూరం పెంచుతుంది జ్యోత్స్న. దీప అనే అనాథకి మీరు తల్లిదండ్రుల స్థానంలో నిలబడి దగ్గరుండి పెళ్లి చేశారు. ఆ పెళ్లిలో అమ్మ కోపంతో ఒక పనిచేస్తే.. దానికి అత్తకి కూడా క్షమాపణ చెప్పింది.. మీకు ఇంకా ఎందుకు కోపం? ఎన్ని రోజులు దూరంగా ఉంటారు? అని దశరథను నిలదీస్తుంది జ్యోత్స్న. మా మమ్మీతో మాట్లాడమని డాడీతో చెప్పొచ్చు కదా తాత అని శివన్నారాయణపై ఎగిరిపడుతుంది.
జ్యోత్న్న మాటలు విన్న కార్తీక్.. అత్తయ్య, మామయ్యల మధ్య దూరం ఇంకా పెరిగేలా ఉందని టెన్షన్ పడతాడు. మమ్మీకి నువ్వు అంటేనే ఎక్కువ ప్రేమని.. అలాంటి మమ్మీ ప్రేమ.. నీకు దీపపై ఉన్న నమ్మకం ముందు ఓడిపోయిందని దశరథకు కోపం తెప్పించేలా మాట్లాడుతుంది జ్యోత్స్న. కార్తీక్ కలగజేసుకొని.. నువ్వు మీ అమ్మానాన్నలను కలుపుతున్నట్లు లేదని అంటాడు. మీ అమ్మానాన్నల విషయంలో నేనెప్పుడైనా జోక్యం చేసుకున్నానా బావ ? అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. సంతోషంగా నవ్వుతూ ఉండాల్సిన కుటుంబం కలిసి భోజనం కూడా చేయలేని పరిస్థితిలో ఉందని అంటుంది.
నువ్వు నాతో ఏదైనా చెప్పాలనుకుంటే నేరుగా చెప్పు... అంతేకానీ ఇంకొకరి తరపున నిలబడి నన్ను ప్రశ్నించకు అంటాడు దశరథ. జ్యోత్స్న చెప్పిన విధానం కరెక్ట్ కాకపోవచ్చు. కానీ తన ఉద్దేశం కరెక్ట్‌గానే ఉంది అంటాడు శివన్నారాయణ. మీరిద్దరూ మునుపటిలా కలిసిపోతే చూడాలని నాకు ఉంది అంటాడు. ఎవరికైనా ప్రమాదం జరిగి హాస్పిటల్ కి తీసుకెళ్తే.. ట్రీట్‌మెంట్ అయ్యేదాకా అక్కడే ఉండాలి కానీ.. బలవంతంగా బయటకు తీసుకెళ్లిపోతామంటే ఎలా నాన్న అంటాడు దశరథ. బంధాల మధ్య జరిగే ప్రమాదాలు కూడా అలాంటివే నాన్న.. కోలుకోవడానికి కాస్త టైం పడుతుందని చెబుతాడు దశరథ.
ఇక్కడ ప్రమాదం చేసింది దీప అయితే బాధ పడేది మాత్రం మా మమ్మీ. మీరు ఎవరిని శిక్షించాలి? ఎవరిని దూరం పెట్టాలి? అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. జ్యోను ఆపే ప్రయత్నం చేస్తాడు కార్తీక్. మా ఫ్యామిలీ విషయాల్లో నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావని కార్తీక్ పై మండిపడుతుంది జ్యోత్స్న. కార్తీక్ ది కూడా ఈ ఫ్యామిలీనే అంటాడు దశరథ. మా మమ్మీ తప్ప నీకు అందరూ కావాలి. నీ ప్రవర్తన చూస్తుంటే మా మమ్మీ ఇంట్లో ఉండటం కూడా నీకు ఇష్టం లేదేమో అనిపిస్తోంది అంటుంది జ్యోత్స్న.
ఒకసారి నీతో మాట్లాడాలి.. బయటికి రా అంటాడు కార్తీక్. నేను నీతో మాట్లాడను.. మా మమ్మీ డాడీ కలవడం మీకు ఇష్టం లేదు అంటుంది జ్యోత్స్న. ఎవరికి ఇష్టంలేదో కనిపిస్తోంది అంటాడు కార్తీక్. డ్యూటీ అయ్యాక ఇక్కడ నీకేం పని? వెళ్లిపో అంటుంది పారు. వాడు నా మనువడు. నా కూతురి కొడుకు. అని పారుకు గట్టిగా చెబుతాడు శివన్నారాయణ. నువ్వు వెళ్లు కార్తీక్ అంటాడు. ఇక్కడ జరిగినదంతా దీపకి చెప్పాలి కదా? చూడనివ్వండి అంటుంది జ్యోత్స్న.
చూశావా డాడీ.. బావను చిన్న మాట అంటే తాత తీసుకోలేకపోయాడు. ఇలాంటి వాళ్లకోసం నువ్వు మా మమ్మీని దూరం పెడుతున్నావా అంటుంది జ్యోత్స్న. నా మనసులో ఎంత బాధ ఉందో నీకెం తెలుసు. ఇలాంటి వ్యక్తికి భర్తగా ఉండడం కంటే బుల్లెట్ తగిలిన రోజే నేను చనిపోతే బాగుండేది అని అంటాడు దశరథ. ఆ మాటకు సుమిత్ర గుండె పగిలిపోతుంది. శివన్నారాయణ అక్కడే కుప్పకూలిపోతాడు.
మరోవైపు ఇంటికి వచ్చిన కార్తీక్ ని ఏం జరిగింది బావ అని అడుగుతుంది దీప. జరిగిన విషయాన్ని చెబుతాడు కార్తీక్. నాన్న చిన్న మాట అంటేనే అమ్మ తట్టుకోలేదని, అలాంటిది అన్ని మాటలు అంటే ఎంత బాధపడుతుందో అని దీప ఫీల్ అవుతుంది. భర్త అన్న మాటలను గుర్తు చేసుకొని ఏడుస్తుంది సుమిత్ర. నేను ఇంట్లో ఉండటం తనకు ఇష్టం లేదు కాబట్టి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది.
జ్యోను.. మీ అమ్మతో మాట్లాడాల్సింది అంటుంది పారు. నువ్వు చాలా తప్పు చేస్తున్నావని చెబుతుంది. ఏం పర్లేదు అంతా మన మంచికే అంటుంది జ్యో. ఈ గొడవతో మమ్మీ మీదున్న సింపతీని అడ్డు పెట్టుకొని సీఈవో పోస్ట్ కాపాడుకోవాలని చెబుతుంది. మమ్మీ ఎంత బాధపడితే మనకి అంత మంచిదని అంటుంది. ఇంతలో సుమిత్ర బయటకు వెళ్తుంటుంది. ఆ విషయాన్ని గమనించినా సరే.. చూడనట్లు ఉండిపోతుంది జ్యోత్స్న.
ఊరికెళ్లి తిరిగి వస్తుంది అనసూయ. ఇంటి దగ్గరి నుంచి విలువైన వస్తువులు తెచ్చానని.. దీపకు ఒక ఫోటో ఇస్తుంది. ఇది ఎవరి ఫోటో అమ్మ అని అడుగుతుంది శౌర్య. మా అమ్మ ఫోటో అని చెబుతుంది దీప. నీకు అమ్మ అయితే నాకు అమ్మమ్మ అవుతుంది కదా అని అడుగుతుంది. అవును అని చెబుతుంది దీప. అయితే ఈ ఫోటో ఇవ్వు అమ్మ. నేను తాత ఫోటో పక్కన పెడతాను అంటుంది. నీకు అందదు అని ఆ ఫోటోను కుబేర ఫోటో పక్కన పెడుతుంది దీప. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.