
Illu Illalu Pillalu Today: ప్రేమ నగల వ్యవహారం బయట పడింది. ఆ నగలు రాత్రికల్లా తెచ్చి ఇవ్వాలని భద్రావతి వార్నింగ్ ఇస్తుంది. దీంతో.. రామ రాజు కూడా ఆ నగల వ్యవహారం బయటపెట్టాలి అని ప్రేమ, ధీరజ్ లకు వార్నింగ్ ఇస్తాడు. అయితే... ఆ నగలు మార్చింది వల్లి అని ప్రేమకు అనుమానం వస్తుంది. ఇదే విషయాన్ని నర్మదదో పంచుకుంటుంది. మరోవైపు ఇదే విషయంలో శ్రీ వల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది.
‘ నీవి నకిలీ బంగారం అని, ఆ విషయం ఎక్కడ బయటపడుతుందో అని ప్రేమ నగలు మార్చేశావు.. కానీ అవి నకిలీ బంగారం అని తెలిసినప్పుడు నీ బండారం బయటపడుతుందని ఎందుకు ఆలోచించలేదు? ఇంత భారీ పర్సనాలిటీ పెట్టుకొని కోడి బుర్రంతా కూడా లేదు. బుద్ధి లేకుండా, వెనకా ముందు ఆలోచించకుండా అమ్మ చెప్పింది చేయడమేనా, బుర్ర లేని తింగరదానా’ అంటూ శ్రీ వల్లి తనను తానే అద్దంలో చూసుకుంటూ తిట్టుకుంటూ ఉంటుంది. దీనంతటికీ వాళ్ల అమ్మే కారణం అని... వాళ్ల అమ్మని తిట్టడానికి ఫోన్ చేస్తుంది.
ఆ సమయంలో భాగ్యం... సంతోషంగా పాటలు పాడుతూ ఉంటుంది. తన భర్త పది లక్షలను ఇరవై లక్షలు చేసి తెస్తాను అన్నాడని.. అవి ఎప్పుడు తెస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇడ్లీ బాబాయ్ మాత్రం డబ్బులు పోయిన బాధతో వస్తాడు. ఆ విషయం తెలియని భాగ్యం... డబ్బుల గురించి అడుగుతుంది. అత్యాశకు పోయి.. తాను డబ్బులు పోగొట్టుకున్నాను అనే విషయం చాలా సేపు దోశ పిండి, ఇడ్లీ పిండితో పోల్చి మరీ చెబుతాడు. ‘ బిర్యానీ కోసం ఆశపడితే.. ఇంట్లో ఉన్న ఇడ్లీ కూడా పోయింది అన్నట్లు.. ఆ మాయా కుమార్ నన్ను మాయం చేసి పోయాడు భాగ్యం’ అని ఇడ్లీ బాబాయ్ చెబుతాడు. ఆ విషయం అర్థమైన భాగ్యం.... సీరియస్ అవుతుంది. అంతే... డబ్బులు మొత్తం నాశనం చేశాడు అని భర్తను చితక బాదుతుంది.
ఈ లోగా శ్రీవల్లి తల్లికి ఫోన్ చేస్తుంది. వెంటనే తల్లికి తాను మార్చిన ప్రేమ నగల విషయం వివరిస్తుంది. ఆ మాటలకు భాగ్యం కూడా షాక్ అవుతుంది. ‘ ప్రేమ నగలు నా దగ్గర ఉన్నాయనే విషయం బయటపడితే.. నన్ను ఈ ఇంట్లో నుంచి గెంటేస్తారు. నా చేత నగలు మార్పించినందుకు నిన్ను కూడా పోలీసులకు పట్టిస్తారు’ అని చెబుతుంది. ‘ ఆ నగలను ఇంటి వెనక గొయ్యి తవ్వి దాచి పెట్టు.. అప్పుడు నీ గదిలో ఎవరికీ దొరకవు.. అందరూ మర్చిపోయాక ఆ నగలు మళ్లీ తెచచుకుందాం’ అని ఐడియా ఇస్తుంది. శ్రీ వల్లి కూడా సరే అని చెబుతుంది. ఈ లోగా.. ఇడ్లీ బాబాయ్ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. భాగ్యం మాత్రం వెంట పట్టుకొని మరీ చిపురు కట్టతో చితకబాదుతుంది.
మరోవైపు నర్మద, ప్రేమ మాట్లాడుకుంటూ ఉంటారు. ‘ బల్లీ నగలు మార్చిందని నాకు కూడా డౌట్ వస్తోంది’ అని నర్మద అంటే.. డౌట్ కాదు కన్ఫామ్ అని ప్రేమ చెబుతుంది.‘ ఆ బల్లి అసలు నగలు మార్చి రోల్డ్ గోల్డ్ నగలు పెట్టి ఉంటుంది. పైగా నువ్వు గమనించావో లేదో అక్క.. నగలు గురించి అందరూ బాధపడుతుంటే.. ఆమెకు బాధ లేదు. అంతకాదు.. నగల విషయం ఎప్పుడు తెచ్చినా టెన్షన్ పడిపోయేది. దీని వెనక ఏదో గూడుపుటానీ ఉంది’ అని ప్రేమ చెబుతుంది. బల్లి రూమ్ లో నగలు వెతుకుదాం అని నర్మద చెబుతుంది,
ఈ లోగానే.. వల్లి.. ఆ నగలన్నీ మూట కట్టేస్తూ ఉంటుంది. ఈ నగలు ప్రేమ, నర్మదలకు దొరకకూడదు అని అనుకుంటూ ఉంటుంది. వాటిని మూటగట్టి తీసుకొని వెళ్లిపోతుంది. వల్లి... ఇలా వెళ్లగానే.. ప్రేమ, నర్మద ఆమె రూమ్ కి వచ్చి వెతకడం మొదలుపెడతారు. కానీ, వాళ్లకు ఏమీ దొరకవు. వల్లి ఇంకెక్కడైనా దాచి పెట్టిందేమో అని అనుమాన పడతారు. అసలు.. ఇప్పుడు ఎక్కడ ఉంది? ఏం చేస్తుంది? ఆమె కదలికలు కనిపెట్టి ఉంచాలి అని నర్మద చెబుతుంది.
అప్పటికే.. శ్రీవల్లి.. పెరట్లోకి వచ్చి.. నగలు పాతిపెట్టడానికి తవ్వుతూ ఉంటుంది. వీళ్లు వెతుకుతూ ఉంటారు. సరిగ్గా ప్రేమ, నర్మద వచ్చే సమయానికి వల్లి... ఆ నగలను మట్టిలో కప్పేస్తుంది. తర్వాత.. దేవుడి దగ్గర పూజలు చేయడం మొదలుపెడుతుంది. ఏమీ తెలియని దానిలా వాళ్ల ముందు నటించడం మొదలుపెడుతుంది. ప్రేమకు చిరాకు పెట్టి.. వెళ్లి డైరెక్ట్ గా అడుగుతుంది. ‘ నీ డ్రామాలు ఆపు.. నువ్వే నా నగలు తీసావ్ అని నాకు తెలుసు’ అని ప్రేమ అడుగుతుంది. కానీ.. వల్లి మాత్రం తాను అమాయకురాలు అని.. తనకు తెలీదు అని నాటకాలు ఆడుతుంది. ప్రేమ ఎంత బెదిరించినా.. వల్లి మాత్రం కొంచెం కూడా బయటపడదు. పైగా అంతకు మించి నటించడం మొదలుపెడుతుంది. ఆ మాటలకు నర్మద, ప్రేమలకు మరింత చిరాకు పుడుతుంది.
‘ ఈ వల్లి ఇంత సడెన్ గా ఓవర్ యాక్షన్ మొదలుపెట్టింది అంటే నా నగలు కచ్చితంగా ఈవిడ దగ్గరే ఉన్నాయి’ అని ప్రేమ అంటే... ఆ బల్లి ఓవరాక్షన్ కి చెక్ పెట్టి.. ఆ నగలు తనంతట తానే బయటకు తెచ్చే ప్లాన్ ఒకటి ఉందని నర్మద చెబుతుంది. ఇద్దరూ కలిసి బయటకు వెళతారు.
ఈ లోగా ప్రేమ, నర్మదలకు దొరకనందుకు వల్లి సంతోష పడుతుంది. వెంటనే ఈ విషయాన్ని సంతోషంగా తల్లికి ఫోన్ చేసి చెబుతుంది. ‘ నువ్వు చెప్పినట్లు మా ఇంట్లో ఎవరికీ తెలియకుండా నగలు దాచి పెట్టాను. పై నుంచి దేవుడు దిగి వచ్చినా కూడా నేను ఈ నగలు దాచి పెట్టినట్లు ఎవరికీ తెలీదు, ఎవరూ కనిపెట్టలేరు’ అని గర్వంగా చెబుతుంది.
మరోవైపు నర్మద... ఈ విషయాన్ని తేల్చడానికి ఓ వ్యక్తిని దించుతుంది. అతన్ని చూసి నర్మద, ప్రేమ సంతోషిస్తారు.‘ స్వామిజీ గారు... రండి మీకోసమే ఎదురు చూస్తున్నాం’ అని చెబుతారు. అతనిని లోపలికి తీసుకువస్తారు. అతనిని చూసి వేదవతి తిడుతుంది. కానీ అతను సన్యాసి కాదని.. నగలు ఎవరు తీశారో కనిపెట్టడానికి వచ్చారు అని ప్రేమ చెబుతుంది. కానీ... ఇతని వల్ల కాదు అని వేదవతి తీసి పడేస్తుంది. కానీ.. ప్రేమ, నర్మద.. నచ్చచెప్పడానికి ప్రయత్నించి.. అతనిని లోపలికి తీసుకువస్తారు.
అతన్ని చూసి ఎవరు అని వల్లి అడిగితే... ‘ నా నగలు కొట్టేసిన వాళ్ల పని పట్టడానికి వచ్చారు’ అని ప్రేమ చెబుతుంది. వెంటనే వల్లి భయపడుతుంది. అంటే.. ఎలా అని అడుగుతుంది. ‘ పుట్టలో నుంచి చీమలు బయటకు వచ్చినట్లుగా.. నా నగలు కొట్టేసినవాళ్లు కాసేపట్లో బయటకు ఎలా వస్తారో నువ్వే చూస్తావ్’ అని ప్రేమ చెబుతుంది. ఇక.. ఇంటికి వచ్చిన అతను పూజలు చేయడం మొదలుపెడతాడు. అది చూసి వల్లి భయపడుతుంది. మరి, అతని ద్వారా అయినా బంగారం కనిపెడతారో లేదో తెలియాలంటే.. సోమవారం వరకు ఆగాల్సిందే