
హాస్పిటల్ లో ఉద్యోగం తీసేస్తున్నాం అని పై అధికారి చెబుతారు. అయితే.. ఈ ఉద్యోగం తనకు చాలా అవసరమని.. బతిమిలాడుకుంటుంది. అయితే.. ఉద్యోగం కావాలి అంటే ఈ నెల సగం జీతం మాత్రమే ఇస్తాం అని చెబుతారు. సుమతి చాలా బతిమిలాడినా వినిపించుకోరు. దీంతో.. ఎక్కడ ఉద్యోగం పోతుందో అనే భయంతో సగం జీతానికి సుమతి అంగీకరిస్తుంది.
మీనా కి తన పూలు అమ్మే ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఇంటి బయటకు రమ్మని పిలుస్తారు.బయటకు వచ్చిన మీనా‘ ఏంటక్కా.. ఇంటిదాకా వచ్చి లోపలికి రాకుండా ఆగిపోయారు?’ అని అడుగుతుంది. ‘ నేను కుక్క ఉన్న ఇంటికీ, మీ అత్త ఉన్న ఇంటికీ రాములే మీనా’ అని చెబుతారు. ‘ ఇంతకీ విషయం ఏంటి?’ అని మీనా అడిగితే..‘ పెళ్లి ఇంట్లో బంతిపూల మాల కట్టాలి. కళ్యాణ మాల కూడా కట్టాలి. నీ చేతితో కడితే మంచి జరుగుతుందని వాళ్ల నమ్మకం.. నువ్వు వస్తావని పిలవడానికి వచ్చాం’ అని చెబుతారు. ‘ మా ఆయన ట్రిప్ కి వెళ్లారు.. వచ్చే సరికి నేను ఇంట్లో లేకపోతే ఆయనకు అన్నం పెట్టడానికి కూడా ఎవరూ ఉండరు, ఆయన్ని ఎవరూ పట్టించుకోరు... నేను రాలేను’ అని మీనా చెబుతుంది. బాలుకి ఫోన్ చేసి అడగమని వాళ్లు చెప్పినా.. రాలేను అని చెబుతుంది. సరే అని.. వాళ్లు వెళ్లిపోగానే.. బాలు ఫోన్ చేస్తాడు.
‘ మీకు వందేళ్లు.. ఇలా తలచుకోగానే.. అలా ఫోన్ చేశారు’ అని మీనా అంటుంది. ‘ తలుచుకుంటేనే వందేళ్లు బతికేస్తే.. ఇక హాస్పిటల్స్ తో పని ఏముంది’ అని బాలు అంటాడు. తర్వాత.. ‘ ఈ రోజు నేను ఇంటికి రావడం లేదు.. పిఠాపురం వెళ్లాలి.. వెళ్లేసరికి రాత్రి అవుతుంది. అక్కడే పడుకొని.. ఉదయాన్నే బయలుదేరి వస్తాను’ అని బాలు చెబుతాడు.‘మీరు ఇంటికి వస్తారని.. నేను పూలు అమ్మే పని వస్తే వెళ్లను అని చెప్పాను’ అని మీనా చెబితే.. ఇప్పుడు వెళ్లు అని బాలు ఫోన్ పెట్టేస్తాడు. వెంటనే మీనా వాళ్ల ఫ్రెండ్స్ కి కాల్ చేస్తుంది. కానీ..వాళ్లు ఈలోగా మరో అమ్మాయిని రమ్మని పిలిచినట్లు చెబుతారు. దీంతో.. ఇక చేసేది లేక మీనా సరే అని అంటుంది.
రాత్రి అవుతుంది.. శ్రుతి చీకట్లో నడుచుకుంటూ వస్తూ.. రవికి ఫోన్ చేస్తుంది. తొందరగా ఇంటికి రమ్మని.. డిన్నర్ కి బయటకు వెళ్దాం అని శ్రుతి అడుగుతుంది. ‘ ఈరోజు రెస్టారెంట్ లో బర్త్ డే పార్టీ ఉంది.. మిడ్ నైట్ 12 కి వాళ్లు స్లాట్ బుక్ చేసుకున్నారు.. నేను ఇక్కడే ఉండాలి’ అని రవి చెబుతాడు. దీంతో... శ్రుతికి కోపం వస్తుంది.. ‘ ఈరోజు నీకు ఇంట్లోకి ఎంట్రీ కూడా లేదు.. ’ అని కోపంతో ఫోన్ ఆఫ్ చేస్తుంది. వెంటనే.. రవి.. మీనాకి ఫోన్ చేసి.. ‘ వదిన.. ఈరోజు ఎలాగైనా నువ్వే కాపాడాలి’ అని అంటాడు. ఏమైంది? అని మీనా కంగారుగా అడిగితే.. ‘ శ్రుతితోనే ప్రాబ్లం.. రెస్టారెంట్ లో లేట్ అవుతుంది అంటే...శ్రుతి డోర్ కూడా తీయనంటోంది’ అని రవి చెబుతాడు. ‘ కోపంలో అలా అన్నదిలే..’ అని మీనా నవ్వుతుంది. ‘ లేదు వదిన.. శ్రుతి మాటంటే మాటే..తన గురించి నీకు తెలీదు’ అని రవి చెబుతాడు. ‘ నేను డోర్ తీస్తానులే’ అని మీనా చెబుతుంది. అంతేకాకుండా.. శ్రుతిని కొంచెం కూల్ చేయమని అడుగుతాడు. మీనా సరే అంటుంది.
అప్పుడే శ్రుతి వస్తుంది. రవి తనకు ఫోన్ లో చెప్పిన విషయం మీనా అడుగుతుంది. శ్రుతి కోపం పోగొట్టేందుకు.. మీనా ప్రయత్నిస్తుంది. బాలు కూడా రాత్రికి ఇంటికి రాను అని చెప్పిన విషయం మీనా చెబుతుంది. అయితే.. లేడీస్ నైట్ ప్లాన్ చేసుకుందాం అని శ్రుతి అడుగుతుంది. అంటే..? అని మీనా అడిగితే.. ‘ ఫుల్ గా తినేసి.. దెయ్యం సినిమా చూద్దాం ’ అని చెబుతుంది. మీనా తనకు భయం అనిచెప్పినా.. శ్రుతి వినదు.. నేను పక్కనే ఉన్నాను కదా అని ధైర్యం ఇస్తుంది. తర్వాత ఇద్దరూ కలిసి ఫోన్ లో దయ్యం సినిమా చూస్తూ ఉంటారు. మీనా భయపడుతూ ఉంటే.. శ్రుతి బాగా ఎంజాయ్ చేస్తుంది.
అప్పుడే వచ్చి ప్రభావతి లైట్ వేస్తుంది.. నిజంగా దెయ్యం వచ్చిందని మీనా అనుకొని భయపడుతుంది. ఇక.. ప్రభావతి.. వచ్చి ఇద్దరినీ అరుస్తుంది. ‘ మీనా దెయ్యం అంటే భయపడుతుంది’ అని శ్రుతి చెబితే.. ‘ ఇది దయ్యానికి భయపడటం ఏంటి? దయ్యాలే దీనిని చూసి భయపడతాయి’ అని ప్రభావతి సెటైర్ వేస్తుంది. ‘దయ్యం అంటే ఎవరైనా భయపడతారు కదా’ అని శ్రుతి అంటే.. నేను భయపడను అని ప్రభావతి ఫోజులు కొడుతుంది. నిజంగా దయ్యం వస్తే.. లాగిపెట్టి ఒక్కటిస్తాను అని ప్రభావతి అంటుంది. వాళ్లను పడుకోమని చెప్పి వెళ్లిపోతుంది. దీంతో.. శ్రుతి ఓ ప్లాన్ వేస్తుంది. ప్రభావతికి నిజమైన భయం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను అంటుంది. వద్దు అని.. మీనా చెప్పినా.. శ్రుతిని వినిపించుకోదు.
టెక్నాలజీ, సౌండ్ ఎఫెక్ట్స్ తో ప్రభావతిని భయపెట్టడానికి రెడీ అవుతుంది. ప్రభావతి గది ముందు దయ్యం నవ్విన సౌండ్ ప్లే చేస్తుంది. ఆ శబ్దాలకు ప్రభావతి వణికిపోతుంది. మరోవైపు ఈ శబ్ధాలకు మనోజ్ కూడా భయపడతాడు.భయంతో రోహిణీని నిద్రలేపుతాడు. కానీ.. రోహిణీ లేవదు. శ్రుతి తన మిమిక్రీ టాలెంట్ తో.. వాయిస్ మార్చి.. ప్రభావతిని భయపడుతుంది. ఆ మాటలు మనోజ్ కి కూడా వినిపిస్తాయి. భయపడుతూనే ప్రభావతి, మనోజ్ బయటకు వస్తారు. ఈలోగా శ్రుతి, మీనా దాక్కుంటారు. మనోజ్, ప్రభావతులు ఒకరినొకరు చూసుకొని భయపడతారు. సీన్ మాత్రం చాలా ఫన్నీగా ఉంటుంది. ‘ మనకంటే ముందు ఈ ఇంట్లో ఎవరైనా చనిపోయారా?’ అని మనోజ్ అడిగితే.. ‘ ఇంట్లోకి దయ్యం వచ్చింది’ అని ప్రభావతి చెబుతుంది. వీళ్ల మాటలు విని మీనా, శ్రుతి నవ్వుకుంటారు. వాళ్లు భయపడుతుంటే.. శ్రుతి ఇంకా భయపెడుతుంది.మరీ భయపెడితే బాగోదని.. మీనా వచ్చి లైట్ వేస్తుంది. ఇదంతా నీ పనా అని.. మీనాపై ప్రభావతి సీరియస్ అవుతుంది.. కానీ.. శ్రుతి వచ్చి.. పగలపడి నవ్వుతుంది. దయ్యానికి భయపడను అన్నారు కదా అని వెటకారం చేస్తుంది. కమింగప్ లో.. మీనాకి శ్రుతిని దూరం చేయాలని రోహిణీతో కలిసి ప్రభావతి ప్లాన్ చేస్తుంది. శ్రుతి తల్లిని పిలిచి దూరంగా ఉండమని చెప్పమని అంటుంది.