
కారులో వెళ్లినప్పుడు ప్రభావతి బొట్టు.. సత్యంకి అంటుకుంటుంది. దానిని తిరిగి ప్రభావతి నుదుటి మీద పెట్టమని సుశీలమ్మ ఆర్డర్ వేస్తుంది. సత్యం అలానే చేస్తాడు. అది చూసి కుటుంబ సభ్యులు సంతోషిస్తారు. మీరిద్దరూ ఇలా గొడవలు పడి మాట్లాడకుండా ఉండొద్దని... మీరు మిగిలిన జంటలకు ఆదర్శంగా ఉండాలని సుశీలమ్మ సలహాలు ఇస్తుంది. మిమ్మల్ని చూసే వాళ్లు నేర్చుకుంటారు అని చెబుతుంది. ఇంతలో శ్రుతి... ‘ నేను, రవి గొడవ పడితే పది నిమిషాల కంటే ఎక్కువ సేపు మాట్లాడకుండా ఉండలేము బామ్మ’ అని అంటుంది. ‘ తర్వాత మళ్లీ మీరే మాట్లాడుకుంటారా?’ అని మీనా అడిగితే.. ‘ అబ్బే.. తర్వాత వీడే వచ్చి సారీ చెబుతాడు’ అని చెబుతుంది. ‘ అవును.. తప్పు శ్రుతి చేసినా.. సారీ మాత్రం నేనే చెప్పాలి.. ’ అని రవి అమాయకంగా చెబితే.. ‘ ఆ కండిషన్ మీదే పెళ్లి చేసుకున్నాం’ అని శ్రుతి బదులిస్తుంది. వీరి మాటలకు అందరూ నవ్వేసుకుంటారు. అయితే... వీరు కలిసిపోయారు కదా భోజనం చేసి వెళ్లిపోతాను అని సుశీలమ్మ అంటే.. కొద్ది రోజులు ఉండమని కుటుంబ సభ్యులు అడుగుతారు.
సీన్ కట్ చేస్తే.... సంజూ ఏదో ఫంక్షన్ కి వెళ్తూ ఉంటాడు. వెళ్తున్న అతనిని ఆపి.. తనతో మౌనికను కూడా తీసుకువెళ్లమని అతని తల్లి చెబుతుంది. కానీ.. సంజు మాత్రం... మౌనికను చాలా తక్కువ చేసి మాట్లాడతాడు. తనతో తీసుకువెళ్తే.. తన స్టేటస్ తగ్గిపోతుందని, ఇంట్లో పనులు చేయించుకోమని మాట్లాడతాడు. కానీ వాళ్ల ఒప్పుకోదు. కొడుక్కి సర్ది చెప్పి.. మౌనికను బయటకు తీసుకువెళ్లడానికి ఒప్పిస్తుంది. ఇక తప్పక.. మౌనికను తీసుకువెళ్తాను అంటాడు. తన స్టేటస్ కి తగినట్లు కాస్ట్లీ చీర కట్టుకొని రమ్మని చెబుతాడు. మౌనిక సరే అని లోపలికి వెళ్లి రెడీ అవుతుంది. అయిష్టంగానే సంజూ మౌనికను తీసుకొని వెళతాడు. అక్కడకు వెళ్లిన తర్వాత కూడా మౌనికను సంజూ తిడుతూనే ఉంటాడు. కాస్ట్లీ చీర కట్టుకోమంటే.. పనిమనిషి కట్టుకునే చీర కట్టుకున్నావ్ అని, మాటలతోనే బాధ పెడతాడు. సంజూ మాటలకు మౌనిక చాలా బాధపడుతుంది. ఈలోగా సంజూని అతని స్నేహితులు పిలవడంతో వెళతాడు. మౌనిక అక్కడే ఉండి బాధపడుతూ ఉంటుంది.
అదే సమయంలో అక్కడికి బాలు వస్తాడు. మౌనికను చూసి పలకరించేలోగా... ఆమె పర్సు చేజార్చుకుంటుంది. అది చూసి బాలు ఇవ్వాలని లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. కానీ సెక్యూరిటీ ఆపుతాడు. ‘ లోపల ఉన్నవారంతా గొప్పంటివాళ్లు.. మీ చెల్లి లోపల ఉందని నమ్మేదెలా’ అని సెక్యూరిటీ అడుగుతాడు. బాలు ఫోటో చూపించి లోపలికి వెళతాడు. పర్సుతీసుకు వెళ్లి.. మౌనిక దగ్గరకు వెళతాడు. సంజూ తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ బాలుని చూస్తాడు. మౌనికతో మాట్లాడతాడేమో అని ఓ కంట గమనిస్తూనే ఉంటాడు. ఆలోగా.. బాలు మౌనిక దగ్గరకు వచ్చి పిలుస్తాడు. సంజూ దూరం నుంచి చూస్తూ ‘ నిజంగానే ఇది వాడిని కొట్టినట్లు నటించిదా? నా ముందు కావాలని పుట్టింటి వాళ్లను దూరం పెట్టినట్లు నటిస్తోందా?చూడాలి’ అని దూరం నుంచి గమనిస్తూ ఉంటాడు
కానీ... సంజూ తమను గమనించడాన్ని మౌనికకు తెలిసిపోతుంది. అందుకే బాలుతో మాట్లాడకుండా వెళ్లిపోతుంది. కానీ.. బాలు ఆగడు. ‘ మౌనిక.. ఎందుకు నన్ను చూసి కూడా మాట్లాడకుండా వెళ్లిపోతున్నావ్? గుడిలో మీ ఆయన్ను కొట్టాను అని కోపం వచ్చిందా? నిన్ను కొట్టబోతుంటే కోపం వచ్చి అలా చేశాను. అదీ కాదా.. అయితే నువ్వు నా మీద చేయి చేసుకున్నందుకు ఫీల్ అవుతున్నావు అంతే కదా’ అని బాలు అడుగుతూనే ఉంటాడు. కానీ.. మౌనిక నోటి నుంచి ఒక్క మాట కూడా రాదు. దూరం నుంచి సంజూ చూస్తూ‘ మాట్లాడవే.. నువ్వు ఈ రోజు వాడితే మాట్లాడు.. అప్పుడు నా చేతిలో నీకు ఈ రోజు ఉంటంది’ అనుకుంటాడు. మౌనిక సమాధానం చెప్పకుండా వెళ్లిపోతూ ఉంటే.. బాలు ఆపి.. ‘ ఇంట్లో కూడా ఆ రోజు తప్పు నాదే అన్నారు. నిన్ను బాధపెట్టే పని నేను మాత్రం చేస్తానా? నువ్వు బాగుంటే, నీ కాపురం బాగుంటే నాకు అంతకన్నా ఏం కావాలమ్మా’ అని బాలు మాట్లాడుతుంటే మౌనిక గుండె కరిగిపోతుంది. అన్నతో మాట్లాడదాం అనుకునేలోగా దూరం నుంచి సంజూని చూస్తుంది. అంతే.. ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోతుంది.
మౌనిక బాధను అర్థం చేసుకోకుండా బాలు పిలుస్తూనే ఉంటాడు. ‘ మౌనిక.. ఆగమ్మా.. ఏదైనా ప్రాబ్లమా..? నేను ఉన్నాను కదా’ అని ఆపబోతుంటే.. బౌన్సర్లు వచ్చి బాలుని ఆపుతారు. ‘ మా సిస్టర్ కనిపిస్తే మాట్లాడుతున్నాను’ అని బాలు చెబితే.. ‘ నిజంగా ఇతను మీ బ్రదరేనా?’ అని ఆ బౌన్సర్ అడుగుతాడు. ‘ ఇప్పుడు ఏం చెబుతుందో చూద్దాం...’ అని సంజూ అనుకుంటాడు. ఆ బౌన్సర్ మరోసారి రెట్టించి అడగడంతో.. సంజూ మీద భయంతో.. ‘ ఇతను ఎవరో నాకు తెలీదు.. ఇక్కడి నుంచి వెళ్లమని చెప్పండి’ అనేసి.. మౌనిక అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మౌనిక సమాధానంతో సంజూ ముఖం వెలిగిపోతుంది. బాలు గుండె మాత్రం పగిలిపోతుంది. అలానే నిలపడి చూస్తూ ఉంటాడు. అతన్ని అక్కడి నుంచి బౌన్సర్ వెళ్లగొడుతూ ఉంటాడు. అది దూరం నుంచి చూస్తూ మౌనిక చాలా బాధపడుతుంది.
‘నన్ను క్షమించు అన్నయ్య... నా కాపురం కూలిపోకూడదని.. నువ్వు బాధపడేలా మాట్లాడాను. నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావో.. అంతకు వంద రెట్లు నా గుండె రగిలిపోతుంది అన్నయ్య.. కానీ చూస్తూ ఊరుకోవడం తప్ప నేను ఏం చేయలేను’ అని మౌనిక తనలో తానే మాట్లాడుకుంటుంది. దూరం నుంచి బాలు బాధపడుతుంటే సంజూ చూసి చాలా సంతోషిస్తాడు. ‘ ఇది కదా నాకు కావాల్సింది.. నీ చెల్లెలి చేతులతోనే నిన్ను బయటకు గెంటించేశాను. ఇక నుంచి నీకు అన్నీ అవమానాలే’ అని సంజూ సంబరపడిపోతాడు. బాలు బాధగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
శ్రుతి ఇంకా.. డబ్బింగ్ వీడియో గురించే ఆలోచిస్తూ ఉంటుంది. పిల్లల్ని కనేటప్పుడు అంత నొప్పి పడాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రవి వచ్చి పట్టుకోగానే గట్టిగా అరుస్తుంది... లాగి పెట్టి కొడుతుంది. ‘ నేనే ’ అని రవి అంటే.. నువ్వని తెలిసే కొట్టాను అని చెబుతుంది. ఎందుకు అని రవి అడిగితే...‘ నన్ను ఎందుకు హగ్ చేసుకున్నావ్’ అని అడుగుతుంది. రవి ఏదో రొమాంటిక్ గా మాట్లాడుతున్నా కూడా శ్రుతి పట్టించుకోదు. డెలివరీ నొప్పుల గురించి మాట్లాడి.. రవిని కన్ఫ్యూజ్ చేస్తుంది. తనకు ఇప్పట్లో పిల్లలు వద్దు అని... డెలివరీ పెయిన్స్ గురించి తన అనుభవాన్ని చెబుతుంది. శ్రుతి మాటలకు రవి బాధపడతాడు. నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు కానీ.. శ్రుతి వినిపించుకోదు. తాను పిల్లలు కనను అని.. సరోగసికి వెళ్దాం అని సలహా ఇస్తుంది. ‘ మా అమ్మ ఒప్పుకోదు’ అని రవి అంటే.. ‘ ఆవిడ ఎవరు?’ అని ఎదురు తిరుగుతుంది. రవి ఎంత సర్ది చెప్పాలని ప్రయత్నించినా వినిపించుకోకుండా వాదిస్తుంది.
రాత్రికి బాలు ఇంటికి చేరుకుంటాడు. చాలా బాధగా ఉంటాడు. కనీసం ఇంట్లోకి వెళ్లకుండా ఇంటి ముందే కూర్చొంటాడు. తన చెల్లి మౌనిక అన్న మాటలనే తలుచుకుంటూ ఫీలౌతూ ఉంటాడు. అప్పుడే మీనా వచ్చి బాలుని చూస్తుంది. వచ్చి పక్కనే కూర్చొని.. ‘ ఏమైందండి? ఇంత ఆలస్యం అయ్యింది?’ అని అడుగుతుంది. ‘ ఈ మాత్రం ఆలస్యంగా కూడా నేను రాకూడదా?’ అని బాలు అంటే.. ‘ మామూలుగా అడిగాను.. ఇది మీ ఇల్లు.. మీరు ఎప్పుడైనా రావచ్చు.. ఏమైంది? అలా ఉన్నారు’ అని అడుగుతుంది. ‘ ఈ రోజు మౌనిక కనిపించింది.’ అని బాలు చెబుతాడు. ‘ అవునా.. ఎలా ఉంది? బాగుందా? మీతో బాగా మాట్లాడిందా? నా గురించి అడిగిందా?’ అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. బాలు ముభావంగా ఉండటంతో.. ‘ ఇవన్నీ జరగలేదని అర్థం అవుతోంది? ఏమైంది’ అని అడుగుతుంది. బాలు జరిగినందంతా చెబుతాడు.. ‘ మౌనిక నేను ఎవరో తెలీయదు అంటుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఈ రోజు మౌనిక నోట ఆ మాట విన్నాక నా గుండె ఆగినంత పని అయ్యింది.. మౌనిక అలా ఎందుకు అన్నదో నాకు అర్థం కాలేదు మీనా.. తను నన్ను కొట్టినా.. నా చెల్లే కదా నన్ను కొట్టింది.. చిన్నప్పుడు నా గుండెలపై ఆడుకుంది.. ఇప్పుడు చెంప మీద కొట్టింది అనుకున్నాను. కానీ, కొంచెం కూడా కోపం రాలేదు’ అని బాధగా చెబుతాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.