పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బ్రో సినిమా నిన్న శుక్రవారం విడుదల అయ్యింది. ఈ సినిమాలో మరొక మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా హీరోగా నటించారు. ఈ సినిమా తమిళ్ లో రూపొందిన వినోదయ సిత్తం సినిమాకి రీమేక్. తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేసి తెరకెక్కించారు. ముఖ్యంగా రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాకి మాటలు రాయటం తో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది.
ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా మెల్లిమెల్లిగా మిక్స్డ్ రివ్యూస్ ప్రారంభం మొదలయ్యాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తప్ప పెద్దగా చెప్పుకోదగ్గ అంశాలు ఏమీ లేవు అని పెదవి విరిచేస్తున్నారు. ఈ క్రమంలో సినిమాలో మైనస్ ల చర్చ మొదలైంది. హిట్ అయితే కనపడనవి ఇప్పుడు హైలెట్ అవుతున్నాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ ని సోషల్ మీడియా జనం టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
ఇలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాకి డైలాగ్స్ అనేవి బలం. డైలాగ్స్ ఎంత బాగుంటే జనాలకు అంత బాగా కనెక్ట్ అవుతుంది. అలాంటి డైలాగ్స్ రాయడంలో స్పెషలిస్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే ఈ ప్రాజెక్టు అప్పచెప్పారు. కానీ ఈ సినిమాలో ప్రాస పేరుతో త్రివిక్రమ్ రాసిన కొన్ని డైలాగ్స్ మాత్రం ప్రేక్షకులకు చిరాకు తెప్పించాయి. ముఖ్యంగా ఓ డైలాగు అయితే విపరీతమైన ట్రోలింగ్ అవుతోంది.
హాల్లో షర్ట్ విప్పొచ్చు
బెడ్ రూంలో ప్యాంట్ విప్పొచ్చు
బాత్ రూంలో అండర్ వేర్ కూడా విప్పొచ్చు
కానీ వీడిని ఎక్కడ విప్పాలో తెలియదు
ఈ డైలాగు ప్రాస కోసం వాడారా లేక ఎవరినైనా టార్గెట్ చేస్తూ రాసారా అనే సందేహం కలిగింది చాలా మందికి.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను ప్రజాక్షేత్రంలో బట్టలు ఊడదీసి నిలబెడతా అని ఈ మధ్య పొలిటికల్ స్పీచుల్లో పవన్ కళ్యాణ్ అంటున్నారు. దానికి రిలేట్ చేస్తూ ఈ డైలాగ్ వాడారు అని కొందరు వ్యాఖ్యానం చేస్తున్నారు. నిజమేమో కానీ ఎవరికి తోచినట్లు వాళ్లు సినిమాని అర్దం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇంత చెత్త ప్రాస ఉన్న డైలాగు రాయటమేంటి అని కొందరు డైరక్ట్ గా త్రివక్రమ్ ని ట్రోల్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమాకు మైనస్ ... ఫస్ట్ హాఫ్ ఉన్నట్టు సెకండ్ హాఫ్ ఉండకపోవటమే అని విమర్శకులు తేల్చారు. సెకండాఫ్ కూడా కాస్త శ్రద్దగా చేసి ఉంటే ఈ కామెంట్స్ కూడా వచ్చేవి కావు అని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ మీద పెట్టిన శ్రద్ధలో సగం కూడా సెకండ్ హాఫ్ లో పెట్టలేదు అని చెప్తున్నారు. త్రివిక్రమ్ ఏదో మ్రొక్కుబడిగా పైపైన రాసాసే ఈ రీమేక్ ని మన ముందుకు తెచ్చాడంటున్నారు.
ఇక సినిమాలో పవన్ కళ్యాణ్ పాత సినిమాల రిఫరెన్స్ లు బాగున్నాయనేది నిజం. అయితే ఆ రిఫరెన్స్ ఏదో కొంచెం సేపు ఉంటే బాగుండేది అంటున్నారు. అభిమానులకి ఈ సీన్స్ అన్ని ఒక సెలబ్రేషన్ లాగా అనిపిస్తాయి. కానీ కామన్ ఆడియన్స్ కు ఫ్యాన్స్ కు ఎక్కినట్లు ఎక్కాలని లేదుగా అంటున్నారు. అయినా ఈ మధ్యన స్టార్ హీరోల సినిమాల్లో వారి పాత వింటేజ్ సినిమాలో రిఫరెన్స్ లు చూపించటం మామూలు అయ్యిపోయింది.
ఫైనల్ గా ఇలాంటి కాన్సెప్టు ఓరియెంటెడ్ సినిమాకి ప్రధానంగా ఉండాల్సినవి ఎమోషన్స్. ఈ సినిమాలో అక్కడక్కడా ఉన్నాయి. కానీ ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ అయ్యేలా ఎమోషన్ బిల్డ్ కాలేదు. తమిళ్ లో యాభై సంవత్సరాలు దాటిన ఒక వ్యక్తి అహంకారంతో,తన మీదే కుటుంబం ఆధారపిడి ఉన్నట్లు ఉన్నట్టు చూపిస్తారు. తెలుగులో 30 ఏళ్ళు వచ్చిన ఒక వ్యక్తి తన తండ్రి తర్వాత బాధ్యతలు తీసుకొని తన గురించి తాను పెద్దగా పట్టించుకోలేదు అన్నట్టు చూపించారు. రెంటికి తేడా ఇదే. ఎమోషన్స్ పరంగా ఒరిజినల్ తో పోల్చి చూస్తే ఈ పాయింట్ ప్రేక్షకులకు కాస్త తక్కువగా కనెక్ట్ అయ్యింది.
అలాగే సినిమా క్లైమాక్స్ కి వచ్చేటప్పటికి ఇంక సినిమా అయిపోవడానికి వచ్చింది, కాబట్టి ఒక ఎమోషనల్ సీన్ పెట్టి సినిమాని కరెక్ట్ గా ఎండ్ చేయాలి అని ఏదో హడావిడిలో ఆ ఎమోషనల్ సీన్స్ వచ్చినట్టు అనిపిస్తాయి. ఇంకా కొంచెం సహజంగా ఉండి ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది అనే కామెంట్స్ వస్తున్నాయి. పాత్రల ఎస్టాబ్లిష్మెంట్లు, లైట్ కామెడీతో ఇంటర్వెల్ దాకా వచ్చిన త్రివిక్రమ్ సెకండ్ హాఫ్ లో ట్రాక్ తప్పేశారు. ప్రెడిక్టబుల్ గా సాగే కథా కథనాలతో పాటు అంతగా కనెక్ట్ కానీ ఎమోషన్లతో క్లైమాక్స్ వైపు ప్రయాణించడం ఫీల్ ని తగ్గించేసింది.