ఈ ఏడాది తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని దిగ్గజ నటులు, సీనియర్ యాక్టర్స్ సహా దర్శకులు, నిర్మాతలు వరుసగా కన్నుమూశారు. ఒక్కొక్కరుగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో సినీలోకం శోక సంద్రంలో మునిగిపోయింది. 2022 జనవరి 8న ప్రముఖ నటుడు మహేష్ బాబు అన్నయ్య, నటుడు-నిర్మాత రమేష్ బాబు (Ramesh Babu) మరణించారు. అప్పటి నుంచి విషాద ఘటనలు ప్రారంభమయ్యాయి. రమేష్ బాబు ‘అల్లూరి సీతారామరాజు’లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించారు. నటుడిగా బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు వంటి చిత్రాలతో గుర్తింపు పొందారు.
ఇక ఏప్రిల్ లో టాలీవుడ్ కు చెందిన ముగ్గురు ప్రముఖులు మరణించారు. 74 ఏళ్ల వయసులో దర్శకుడు శరత్ (Sarath) క్యాన్సర్‌తో పోరాడి ఏప్రిల్ 1న కన్నుమూశారు. 1986లో ‘చాదస్తపు మొగుడు’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. తన కెరీర్‌లో 20కి పైగా సినిమాలు తీశారు. ప్రధానంగా నటులు నందమూరి బాలకృష్ణ, సుమన్‌లతో కలిసి పనిచేశారు.‘వంశానికొక్కడు, సుల్తాన్, పెద్దన్నయ్య, వంశోద్ధారకుడు వంటి సూపర్‌హిట్‌లను అందించారు. అలాగే, ఏప్రిల్ 20న ప్రముఖ దర్శకుడు తాటినేని రామారావు (Tatineni Rama Rao) మృతి టాలీవుడ్‌కు మరో తీరని లోటు. 84 ఏళ్ల వయసులో ఈయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు.
తాటినేని రామారావు సహాయ దర్శకుడిగా కేరీర్ ను ప్రారంభించారు. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ప్రధాన పాత్రలలో నటించిన నవరాత్రి (1966)తో దర్శకుడిగా పరిచయం అయ్యి.. తెలుగు, హిందీ భాషల్లో 65కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘బ్రహ్మచారి, మంచి మిత్రులు, జీవన తరంగాలు, దొరబాబు, యమగోల, అనురాగ దేవత, పచ్చని కాపురం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇక అదే నెల ఏప్రిల్ 9న ప్రముఖ నటుడు మన్నవ బాలయ్య (M Balayya) కూడా మరణించారు. 94 ఏండ్ల వయస్సులో ఈయన కన్నుమూశారు. 300 కంటే ఎక్కువ సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. అనేక సూపర్ హిట్ చిత్రాలలో వృద్ధుల పాత్ర, కీరోల్స్ లో నటించి ప్రజాదరణ పొందారు.
సెప్టెంబర్‌లో టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ యూవీ కృష్ణం రాజు (UV Krishnam Raju)ను కోల్పోయింది. 83 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. తెలుగు సినిమా ‘రెబల్ స్టార్’గా పేరొందిన కృష్ణం రాజు ప్రముఖ నటుడు ప్రభాస్‌కు పెద్దనాన్న. 50 ఏళ్ల కెరీర్‌లో కృష్ణంరాజు 180కి పైగా సినిమాల్లో నటించి చెరగని ముద్ర వేసుకున్నారు. కృష్ణం రాజు దశదిశ కర్మ సందర్బంగా ప్రభాస్ రూ.5 నుంచి 7 కోట్లతో అభిమానులకు మొగల్తూరులో భోజనాలు ఏర్పాటు చేయించిన విషయం తెలిసిందే. ఇక కృష్ణం రాజు 2000- 2002 మధ్య కేంద్ర సహాయ మంత్రిగానూ సేవలందించారు. 12, 13వ లోక్‌సభకు కాకినాడ, నరసాపురం నియోజకవర్గాల నుంచి ఎన్నికయ్యారు.
నవంబర్ 15న దిగ్గజ నటుడు, నట శేఖరుడు, సాహసాల వీరుడు, సూపర్ స్టార్ కృష్ణ (Krishna) తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో టాలీవుడ్‌కు భారీ నష్టం చేకూరింది. 79 ఏండ్లలో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. కృష్ణ అకాల మరణంతో అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. తన కెరీర్‌లో 350 కి పైగా చిత్రాలలో నటించారు. టాలీవుడ్‌లో ఎన్నో కొత్త ట్రెండ్స్‌ని పరిచయం చేశారు.
అంతకుముందే సెప్టెంబర్ 28న భార్య ఇందిరాదేవి మరణించింది. ఆయన తన పెద్ద కుమారుడు రమేష్‌బాబు కూడా చనిపోయారు. ఒకే ఏడాదిలో మహేశ్ బాబు ముగ్గుర్ని కోల్పోవడం అత్యంత బాధాకరం. దీంతో పుట్టెడు శోకంలో మునిగిపోయారు. ఇప్పుడిప్పుడే బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. అభిమానులు కూడా మహేశ్ బాబుకు భరోసానిస్తున్నారు. త్వరలో నే తదుపరి చిత్ర షూటింగ్స్ లో బిజీ కానున్నారు. ప్రస్తుతం వేకషన్స్ లో ఉన్నారు.
డిసెంబర్ నెలలో టాలీవుడ్ మరో ఇద్దరు ప్రముఖ నటులను కోల్పోయింది. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana) 87వ ఏట డిసెంబర్ 23న కన్నుమూశారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందిన ఆయన 750కి పైగా సినిమాల్లో నటించి చెరగని ముద్ర వేసుకున్నారు. 60 ఏళ్ల కెరీర్‌లో 200 మందికి పైగా దర్శకులతో పనిచేశాడు. ఈ షాక్ నుంచి టాలీవుడ్ తేరుకోకముందే మరో ప్రముఖ నటుడు తమ్మారెడ్డి చలపతిరావు (Chalapathi Rao) డిసెంబర్ 25న కన్నుమూశారు. హాస్య, విలన్ పాత్రలకు పేరుగాంచిన అతను ఐదు దశాబ్దాల కెరీర్‌లో మూడు తరాల అగ్ర తారలతో నటించాడు. దాదాపు 600కు పైగా చిత్రాల్లో నటించారు.
ఇలా వరుస ఘటనలతో 2022 విషాదాలనే మిగిల్చింది.