ఎవర్‌గ్రీన్ క్లాసిక్ ‘పాతాళభైరవి’తో కెరీర్ మొదలెట్టిన కె. విశ్వనాథ్... మాస్ సినిమాలు చేసే మెగాస్టార్‌తో..

First Published Feb 3, 2023, 12:50 AM IST

తెలుగు సినీలోకంలో మరో విషాదం జరిగింది. ‘శంకరాభరణం’, ‘సాగరసంగమం’, ‘స్వాతిముత్యం’ వంటి  ఎవర్‌గ్రీన్ క్లాసిక్ సినిమాలను తెలుగు ప్రేక్షకులను అందించిన దర్శకుడు, ‘కళా తపస్వి’ బిరుదుకి సార్థకత తీసుకొచ్చిన డైరెక్టర్ కె. విశ్వనాథ్ తుదిశ్వాస విడిచారు. దర్శకుడిగా విశ్వనాథ్ చేసిన ప్రతీ సినిమా  ఓ ఆణిముత్యమే...

ఐదు సార్లు జాతీయ అవార్డులు, ఏడు సార్లు నంది అవార్డులు, 11 సార్లు ఫిల్‌ఫేర్ అవార్డులు అందుకున్న కె.విశ్వనాథ్, ఫ్రాన్స్‌లో జరిగిన బెసాన్‌కన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘ప్రైజ్ ఆఫ్ ది పబ్లిక్’ అవార్డును అందుకున్నారు. ‘పద్మశ్రీ’, ‘దాదాసాహెబ్ పాల్కే’ వంటి ఎన్నో పురస్కారాలను అందుకున్న కె. విశ్వనాథ్.. దాదాపు 70 ఏళ్ల పాటు సినీ రంగానికి తన విలువైన సేవలు అందించారు...

ఆడియోగ్రాఫర్‌గా కెరీర్ మొదలెట్టిన కె. విశ్వనాథ్ పూర్తిపేరు కాశీనాథుని విశ్వనాథ్. ఆ తర్వాత దర్శకత్వం వైపు ఆసక్తి చూపించిన విశ్వనాథ్, ఇండియన్ సినిమా ఎవర్‌గ్రీన్ క్లాసిక్ ‘పాతాళభైరవి’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు...
 

కె. రాఘవేంద్ర రావు, దాసరి నారాయణరావు, కోదండ రామిరెడ్డి వంటి దర్శకులు కమర్షియల్ సినిమాలతో బాక్సాఫీస్‌ని కొల్లగొడుతుంటే కె.విశ్వనాథ్ మాత్రం ఎప్పుడూ అటు వైపు వెళ్లలేదు. సామాజిక సమస్యలను, సగటు మనిషి నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలే ఇతివృత్తంగా సినిమాలు చేస్తూ వచ్చారు కె. విశ్వనాథ్...

భారతీయ సంప్రదాయ కళలకు ఆదరణ తగ్గుతున్న సమయంలో కె.విశ్వనాథ్ తీసిన ‘శంకరాభరణం’, ‘సాగర సంగమం’ వంటి సినిమాలు జనాల్లో వాటికి మళ్లీ క్రేజ్ తీసుకొచ్చాయి. ‘సాగర సంగమం’ తర్వాత చాలామంది జనాలు, వాళ్ల పిల్లలను ‘కూచిపూడి’, ‘భరతనాట్యం’ వంటి సంప్రదాయ నాట్య తరగతుల్లో చేర్చారంటే... ఆయన సినిమాలు జనాల్లో ఎలాంటి ప్రభావం చూపించేవో అర్థం చేసుకోవచ్చు...

‘ఆత్మగౌరవం’ సినిమాతో దర్శకుడిగా మారిన కె.విశ్వనాథ్, మొదటి సినిమాకే ‘నంది’ అవార్డు అందుకున్నారు. ‘ప్రైవేటు మాస్టారు’, ‘కలిసొచ్చిన అదృష్టం’, ‘ఉండమ్మ బొట్టు పెడా’, ‘నిండు హృదయాలు’ సినిమాల తర్వాత వచ్చిన ‘చెల్లెలి కాపురం’ సూపర్ హిట్‌గా నిలిచింది...

‘కాలం మారింది’, ‘నేరం శిక్ష’, ‘ఓ సీత కథ’, ‘సరదా’, ‘జీవన జ్యోతి’ వంటి సినిమాలు విశ్వనాథ్‌కి నంది అవార్డులను తెచ్చిపెట్టాయి. అయితే ‘సిరిసిరి మువ్వ’ తర్వాత విశ్వనాథ్ ఆలోచనావిధానం పూర్తిగా మారింది...

ఎన్టీఆర్, శోభన్‌ బాబు, కృష్ణ వంటి స్టార్ హీరోలు, విశ్వనాథ్‌తో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా, స్టార్లను నమ్ముకోకుండా కథలకే ప్రాధాన్యం ఇచ్చారాయన. ‘సీతామహాలక్ష్మీ’ తర్వాత వయసు పైబడిన సోమయాజులుని ప్రధాన పాత్రలో ‘శంకరాభరణం’ సినిమా తీసి, దాన్ని ఎవర్‌గ్రీన్‌గా నిలబెట్టగలిగారు విశ్వనాథ్...

‘శంకరాభరణం’ సినిమా మలయాళంలో డబ్ అయి 200 రోజులకు పైగా ఆడింది. అయితే మలయాళంలో వినిపించే పాటలు కూడా తెలుగువే. భాష తెలియకపోయినా తెలుగు పాటలను తెగ విన్నారు మలయాళీలు. ఈ ఘనత ఒక్క ‘శంకరాభరణం’ సినిమాకి మాత్రమే దక్కింది...

‘సప్తపది’, ‘శుభలేఖ’, ‘స్వాతిముత్యం’, ‘సిరివెన్నెల’, ‘శృతిలయలు’, ‘స్వయంకృషి’, ‘స్వర్ణ కమలం’, ‘సూత్రధారులు’, ‘ఆపద్భాంధవుడు’, ‘స్వాతికిరణం’, ‘శుభసంకల్పం’ ఒక్కటేమిటి... కె.విశ్వనాథ్ తీసిన ప్రతీ సినిమాకి మనసు ఉంటుంది. మనసు పెట్టి చూస్తే, ప్రతీ సినిమాలో విశ్వనాథ్ సమాజానికి చెప్పిన ఓ గొప్ప సందేశం ఉంటుంది...

Sirivennela Seetharama Sastry

తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాలను బాలీవుడ్‌లో రీమేక్ చేసి అక్కడ కూడి హిట్లు కొట్టిన కె.విశ్వనాథ్.. ఎప్పుడూ కమర్షియల్ హంగుల్లో ఇరుక్కుపోలేదు. అందుకేమో ‘ఖైదీ’,‘హీరో’, ‘ఘరనా మొగుడు’ వంటి మాస్ మసాలా సినిమాలు చేస్తున్న చిరంజీవితో ‘స్వయం కృషి’లో చెప్పుకుట్టుకునేవాడి పాత్ర వేయించారు విశ్వనాథ్...

Chiranjeevi

మెగాస్టార్ (అప్పటికి సుప్రీం హీరో) ఏంటి, చెప్పులు కుట్టడం ఏంటి? అని ‘స్వయం కృషి’ సినిమా పోస్టర్లు చూసి చాలామంది చిరంజీవి అభిమానులు గొడవ చేశారు. అయితే సినిమా రిలీజైన తర్వాత వాళ్లే గుండెల మీద చేతులు వేసుకుని, మా హీరో మంచి సినిమా చేసాడ్రా అనుకుంటూ వచ్చారు. అలా వచ్చేలా చేశారు విశ్వనాథ్.. 

నటుడిగానూ కొన్ని సినిమాల్లో నటించిన కె.విశ్వనాథ్, ‘పూర్ణోదయ మూవీ క్రియేషన్స్’ బ్యానర్‌లో చాలా సినిమాలు చేశారు. విశ్వనాథ్ చేసిన సినిమాలు రష్యన్ భాషల్లో కూడా డబ్ అయ్యాయి. అలాంటి గొప్ప దర్శకుడికి టాలీవుడ్‌లో దక్కాల్సినంత గౌరవం దక్కలేదన్నది మాత్రం నిజం.. 

click me!