కె విశ్వనాథ్‌లోని దర్శకుడిని బయటకు తీసిన ఏఎన్నార్‌.. డైరెక్టర్‌గా తొలి చిత్రమదే!

First Published | Feb 3, 2023, 12:41 AM IST

కళాతపస్వి, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత కె విశ్వనాథ్‌ హఠాన్మరణం తెలుగు చిత్ర పరిశ్రమే కాదు, ఇండియన్‌ చిత్ర పరిశ్రమకి తీరని లోటు. అయితే ఆయన దర్శకుడిగా మారడం విచిత్రంగా జరిగింది. అక్కినేని నాగేశ్వరరావు ప్రోత్సాహంతో ఆయన దర్శకుడిగా మారాల్సి వచ్చింది. మరి అది ఎలా జరిగింది, ఆ విచిత్రం ఏంటనేది చూస్తే, 
 

దాదాపు ఐదు దశాబ్దాలపాటు దర్శకుడిగా సత్తా చాటిని, తెలుగు సినిమాని కొత్త పుంతలు తొక్కించారు కె. విశ్వనాథ్‌. తొలితరం దర్శకుల ధోరణిలను మార్చి తెలుగు సినిమాని మరో దారి మళ్లించారు. తెలుగు సినిమాని మరో మెట్టు ఎక్కించారు. ఆర్ట్స్, సమాజ అసమానతలు, సమాంతర సినిమా పోకడలు, కమర్షియాలిటీ మేళవించి సినిమాలు చేసి హిట్‌ కొట్టిన ఏకైక దర్శకుడు కళాతపస్వి. ఆయన దర్శకుడిగా ఎలా మారనేది చూస్తే. 
 

వాహినీ స్టూడియోలో సౌండ్‌ రికార్డింగ్‌ విభాగంలో కెరీర్‌ ప్రారంభించారు కె. విశ్వనాథ్‌. బి.ఎన్‌. రెడ్డి, కె.వి. రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు లాంటి వాళ్ళ పనితీరును సన్నిహితం గా పరిశీలిస్తూ వచ్చిన కె. విశ్వనాథ్‌ స్క్రిప్టులో తోచిన సలహాలు, సూచనలు ఇస్తుండేవారు. ఆదుర్తి తన సినిమాలకు స్క్రిప్ట్‌ అసిస్టెంట్‌గా, అసోసియేట్‌గా పనిచేసే అవకాశం ఆయనకిచ్చారు. అలా కథా విస్తరణ, స్క్రీన్‌ ప్లే రచనలో విశ్వనాథ్‌కు ఉన్న ప్రతిభను ఆదుర్తి దగ్గర గుర్తించి, ఆయన ను వాహినీ వదిలేసి, తమ అన్నపూర్ణా పిక్చర్స్‌ సంస్థలోకి, పూర్తిగా దర్శకత్వశాఖలోకి రమ్మని ప్రోత్సహించింది హీరో అక్కినేని నాగేశ్వరరావే అని విశ్వనాథ్‌ పలు ఇంటర్వ్యూలో తెలిపారు. 


 ఆదుర్తి వద్ద అక్కినేని, దుక్కిపాటి మధుసూదనరావుల అన్నపూర్ణా పిక్చర్స్‌లో దర్శకత్వ శాఖలోకి వచ్చారు విశ్వనాథ్‌. అలా ఆయన సినీ జీవితం ఓ ఊహించని మలుపు తిరిగింది. స్వతహాగా క్రియేటివ్‌ పర్సన్ అయిన విశ్వనాథ్‌ని ఓ వజ్రంలా తీర్చిదిద్దారు ఆదుర్తి. కథ, స్క్రీన్‌ ప్లే రచన, ఇలా విశ్వనాథ్‌ చేయనిది లేదు. ఆయన వద్ద `వెలుగు నీడలు`, `ఇద్దరు మిత్రులు`, `చదువుకున్న అమ్మాయిలు`, `డాక్టర్‌ చక్రవర్తి` వంటి చిత్రాలకు ఆయన వద్ద అసిస్టెంట్‌గా పనిచేశారు విశ్వనాథ్‌. ఆ సమయంలో ఆయనకు దర్శకుడిగా చేస్తానని మాటిచ్చారు ఆదుర్తి. ఆ తర్వాత `ఆత్మగౌరవం` సినిమాతో దర్శకుడిగా మారే అవకాశం కల్పించారు. అలా డైరెక్టర్‌ అయ్యారు విశ్వనాథ్‌. ఈ లోపు ఆయన సినిమాకి సంబంధించిన అన్ని విభాగాల్లో పనిచేయడంతో సినిమాపై మంచి పట్టు ఏర్పడింది. 
 

`ఆత్మగౌరవం` చిత్రానికి దర్శకుడిగా మారడంతో ఆదుర్తితోపాటు ఏఎన్నార్‌ ప్రోత్సాహం చాలా ఉండేదట. అలా విశ్వనాథ్‌ తొలి సినిమాకి ఏఎన్నార్‌ని డైరెక్ట్ చేయడం విశేషం. ఇందులో ఏఎన్నార్‌తోపాటు కాంచన, రాజశ్రీ నటించారు. ఈసినిమా  పెద్ద విజయం సాధించింది. 1965లో విడుదలైన ఈ చిత్రంతో హిట్‌ అందుకోవడంతోపాటు రెండు నంది అవార్డులు వరించాయి. ఆ తర్వాత కె విశ్వనాథ్‌ తెలుగు సినిమాని కొన్నాళ్లపాటు శాషించారనే చెప్పాలి. ఏడాదికి ఒకటి రెండు సినిమాలు చేసుకుంటూ వచ్చారు. మొత్తంగా 53 సినిమాలకు దర్శకత్వం వహించారు. 
 

పాశ్చాత్య సంగీతపు హోరులో కొట్టుకుపోతున్న భారతీయ సాంప్రదాయం సంగీతానికి పూర్వవైభవాన్ని పునస్థాపించాలనే ఉద్దేశ్యాన్ని ‘శంకరాభరణం’ సినిమాలో ఆయన చూపించిన తీరు వర్ణనాతీతం. ‘శంకరాభరణం’, ‘సాగరసంగమం’, ‘సిరివెన్నెల’, ‘స్వాతిముత్యం’, ‘సిరిసిరి మువ్వ’, ‘స్వర్ణకమలం’,‘శుభసంకల్పం’, ‘ఆపద్భాందవుడు’ సినిమాలు కె.విశ్వనాథ్ దర్శకత్వానికి మచ్చుతునకలు.

కేవలం దర్శకుడిగానే కాదు నటుడిగాను విశ్వనాథ్ అలరించారు. ఆయన సినిమాలోని పాటలు శ్రవణారమ్యంగా ఉంటాయి. సిరివెన్నెల సీతారామశాస్త్రిని కళామ్మతల్లికి పరిచయం చేసారు కళాతపస్వి. వేటూరి కలం నుంచి జాలువారిన ఎన్నో ఆణిముత్యాలు కళాతపస్వి సినిమాల్లో ప్రాణంగా నిలిచాయి. తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి  కె.విశ్వనాథ్. ఆయన్ని కేంద్ర ప్రభుత్వం `పద్మశ్రీ`, `దాదా సాహెబ్‌ ఫాల్కే` వంటి అత్యున్నత పురస్కారాలతో సత్కరించడం విశేషం. పలు జాతీయ అవార్డులు అందుకున్నారు. 

Latest Videos

click me!