నాగబాబు మాట్లాడుతూ.. చిరంజీవి, సుధాకర్, హరిప్రసాద్ ముగ్గురూ ఉండే రూమ్ పక్క ఇంట్లో పురాణం సూర్య అనే డైరెక్టర్ తన ఫ్యామిలీతో ఉండేవారు. అప్పటికి పురాణం సూర్య ఇంకా డైరెక్టర్ కాలేదు. చిరంజీవి గారి లాగే అతడు కూడా కుర్రాడు. వాళ్ళ నాన్నకి పూర్ణ పిక్చర్స్ అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఉండేది. పక్క ఇల్లే కాబట్టి పురాణం సూర్య తల్లి చిరంజీవి, సుధాకర్, హరిప్రసాద్ తో ఆప్యాయంగా మాట్లాడుతూ అవసరమైనప్పుడు కాఫీలు, టీలు ఇచ్చేవారు. డిస్ట్రిబ్యూషన్ ఫ్యామిలీ కాబట్టి పరిచయాల కోసం చిరంజీవి గారు కూడా వారితో మంచిగా ఉండేవారు. అప్పట్లో సెలెబ్రిటీలు, బయ్యర్ల కోసం రిలీజ్ కి ముందే ప్రీ వ్యూ ప్రదర్శించేవారు. పురాణం సూర్య వాళ్ళ నాన్న డిస్ట్రిబ్యూటర్ కాబట్టి సినిమా ప్రీ వ్యూ లకు వాళ్ళకి ఎంట్రీ ఉండేది. వాళ్ళ తరపున వచ్చిన వాళ్లకు కూడా ఎంట్రీ ఉండేది. ఒక సినిమా ప్రీవ్యూ ఉంది వెళ్లి చూస్తారా అని పురాణం సూర్య తల్లి.. చిరంజీవి, సుధాకర్, హరిప్రసాద్ ముగ్గురికీ చెప్పింది. దీనితో తప్పకుండా వెళతాం అని చిరంజీవి, సుధాకర్, హరిప్రసాద్ ముగ్గురూ వెళ్లారు.