
ఈ వారం(అక్టోబర్ 20-25) ఓటీటీలో రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దీపావళి పండుగని పురస్కరించుకుని చాలా సినిమాలు, సిరీస్‌లు ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తున్నాయి. అయితే ఈ సారి వెబ్ సిరీస్‌ల హడావుడి కంటే ఓటీటీ సినిమాల హంగామా ఎక్కువగా ఉంది. అందులోనూ పవన్ కళ్యాణ్ మూవీపై అందరి చూపు ఉంది. ఇప్పటికే థియేటర్లలో దుమ్ములేపిన పవన్ కళ్యాణ్ `ఓజీ` ఇప్పుడు ఓటీటీ రచ్చ చేసేందుకు వస్తోంది. దీంతోపాటు ఇంకా ఏ ఏ సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో చూద్దాం.
ఈ వారం ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది, తెలుగు ఆడియెన్స్ మొత్తం వెయిట్ చేస్తున్నది `ఓజీ` మూవీ కోసం. పవర్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ మూవీ దీపావళి పండగ స్పెషల్‌గా ఈ నెల 23న విడుదల కాబోతుంది. ఇది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో పవన్ కళ్యాణ్‌కి జోడీగా హీరోయిన్ ప్రియాంక మోహన్ నటించింది. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. వీరితోపాటు ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, శుభలేఖ సుధాకర్, వెంకట్, హరీష్ ఉత్తమన్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ సుమారు రూ.320కోట్లు వసూలు చేసినట్టు టాక్. ఈ ఏడాది తెలుగులో అత్యధిక కలెక్షన్లని సాధించిన చిత్రంగా `ఓజీ` నిలిచింది. ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తోంది. పవన్ ఫ్యాన్స్ కి మరోసారి ట్రీట్ ఇవ్వబోతుందని చెప్పొచ్చు.
విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన `భద్రకాళి` మూవీ కూడా ఓటీటీలోకి రాబోతుంది. ఈ చిత్రం జీయో హాట్‌స్టార్ లో ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. `బిచ్చగాడు`తో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైన విజయ్ ఆంటోని రీసెంట్‌గా `భద్రకాళి` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. సెప్టెంబర్ 19న ఈ చిత్రం విడుదలైంది. కానీ ఆకట్టుకోలేకపోయింది. అరుణ్ ప్రభు దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ థియేటర్లలో సక్సెస్ కాలేదు. మరి ఓటీటీలో అయినా అలరిస్తుందా అనేది చూడాలి.
`దేవర` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైంది అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. ఇటీవల ఆమె హిందీలో `పరమ్ సుందరి` అనే చిత్రంలో నటించింది. సిద్దార్థ్ మల్హోత్రా హీరో. తుషార్ జలోటా దర్శకత్వం వహించారు. ఏఐ కథతో రూపొందిన ఈ మూవీ థియేటర్లలో యావరేజ్‌గా ఆడింది. కేరళాలో వివాదానికి కారణమైంది. ఆగస్ట్ 29న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం ఎట్టకేలకు ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఈ నెల 24న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. మలయాళంలో గతేడాది విడుదలైన `నడికర్` మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. లాల్ జూనియర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టొవినో థామస్, దివ్య పిళ్లై, బాలు వర్గేసే, సురేష్ కృష్ణ, సౌబిన్ షాహిర్, షైన్ టామ్ చాకో, అనూప్ మీనన్ వంటి వారు నటించారు. ఈ చిత్రం అక్కడ డిజాస్టర్ అయ్యింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు లయన్స్ గేట్ ప్లేలో ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
వీటితోపాటు సోమవారం(అక్టోబర్ 20)న `పిచ్చ్ టూ గెట్ రిచ్` అనే హిందీ రియాలిటీ షో స్టార్ట్ అవుతోంది. జీయో హాట్ స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యాషన్ రంగానికి సంబంధించిన బిజినెస్ రియాలిటీ షో ఇది. కరణ్ జోహార్‌తోపాటు అక్షయ్ కుమార్, మలైకా అరోరా, మనీష్ మల్హత్రా భాగమయ్యారు. ఇండియాలోనే మొదటిసారిగా ఒక ఫ్యాషన్ బిజినెస్‌పై ఒక షోని స్టార్ట్ చేయడం విశేషం. సోమవారమే మలయాళ ఫిల్మ్ `చుట్టులి` స్ట్రీమింగ్ అవుతుంది. రాజ్ బాబు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో షైన్ టామ్ చాకో హీరోగా నటించారు. ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదలైంది. ఎనిమిది నెలల తర్వాత ఇప్పుడు మనోరమ మాక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
మరోవైపు వెబ్ సిరీస్‌ల విషయానికి వస్తే మహాభారతం ప్రధానంగా రూపొందిన యానిమేషన్ సిరీస్ `కురుక్షేత్రః పార్ట్ 2` ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇది నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతుంది.
దీంతోపాటు 25న మహాభారతం కథతోనే ఇండియాలోనే మొదటిసారి పూర్తి ఏఐ టెక్నాలజీతో `మహాభారత్‌ః ఏక్ ధర్మయుధ్` పేరుతో సిరీస్‌ని రూపొందించారు. ఇది అక్టోబర్ 25న జీయో హాట్ స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. పూర్తి ఏఐతో రూపొందించిన ఈ సిరీస్‌పై అందరిలోని ఆసక్తి నెలకొంది.