Nandamuri Balakrishna
నందమూరి బాలకృష్ణ ఆల్ టైం క్లాసిక్ మూవీ ఆదిత్య 369 ఏప్రిల్ 4న రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇప్పటివరకు టాలీవుడ్ లో చాలా చిత్రాలు రీ రిలీజ్ అయ్యాయి. కానీ ఆదిత్య 369 పై క్రమంగా ఆసక్తి పెరిగిపోతోంది. తెలుగులో వచ్చిన ఫస్ట్ టైం ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఇదే. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీ రీ రిలీజ్ అవుతుండడంతో కొన్ని ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి.
ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు నలుగురు హీరోయిన్లు పోటీ పడ్డారట. కానీ చివరికి ఒక్కరికి మాత్రమే అవకాశం దక్కింది. ఈ విషయాన్ని నిర్మాత కృష్ణ ప్రసాద్ తెలిపారు. ముందుగా ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఊర్మిళ మంటోడ్కర్ ని అనుకున్నారట. నిర్మాత వెళ్లి ఆమె కుటుంబాన్ని కూడా అడిగారు. అప్పట్లో సింగితం శ్రీనివాసరావు కి బాలీవుడ్ లో కూడా గుర్తింపు ఉండేది. దీనితో ఊర్మిళ వెంటనే ఆదిత్య 369 చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ప్రస్తుతం తాను నటిస్తున్న ఒక హిందీ చిత్రానికి అగ్రిమెంట్ ఉందని, వెళ్లి వాళ్ళ అనుమతి తీసుకోమని ఊర్మిళ కోరింది. షెడ్యూల్స్, డేట్ల సమస్యలు వస్తాయని ఆ నిర్మాతలు ఒప్పుకోలేదు.
దీంతో మరో హీరోయిన్ కోసం వెతకడం ప్రారంభించాం. అదే సమయంలో వెంకటేష్ బొబ్బిలి రాజా చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఆ చిత్ర హీరోయిన్ దివ్యభారతిని ఆదిత్య 369 లో తీసుకోవాలని అనుకున్నాం. ఆ టైంలో దివ్యభారతి పదవ తరగతి పరీక్షలు రాస్తుంది. చాలా చిన్న అమ్మాయి. వాళ్ళ అమ్మని అడిగితే వెంటనే ఒప్పేసుకుంది.
రామానాయుడు గారు కూడా దివ్యభారతి చాలా టాలెంటెడ్, అందమైన అమ్మాయి తప్పకుండా తీసుకోండి అని చెప్పారు. కానీ మేము షూటింగ్ ప్రారంభించే సమయానికి బొబ్బిలి రాజా తో డేట్లు క్లాష్ అయ్యాయి. ఆమె కోసం ఇంకా కొన్ని రోజులు ఎదురు చూసే పరిస్థితి లేదు.అదే టైంలో బాలకృష్ణ, సింగీతం కాంబినేషన్లో సినిమా ప్రారంభం అవుతుందని విజయశాంతికి తెలిసింది. తాను నటిస్తాను అంటూ విజయశాంతి చాలా ఎక్సైట్ అయింది. మేం కూడా ఓకే అనుకున్నాం.
కానీ అంతకుముందే విజయశాంతి బాలయ్యతో భలే దొంగ, ముద్దుల మామయ్య లాంటి చిత్రాల్లో నటించింది. లారీ డ్రైవర్ చిత్ర షూటింగ్ కూడా అప్పుడే జరుగుతోంది. మళ్లీ ఆమెని ఆదిత్య 369 లో హీరోయిన్ గా తీసుకుంటే వరుసగా నాలుగు చిత్రాల్లో బాలయ్యకి విజయశాంతి హీరోయిన్ అవుతుంది. అది కరెక్ట్ కాదని ఆమెను పక్కన పెట్టాం. చివరికి ఆ అవకాశం హీరోయిన్ మోహిని కి దక్కింది అని కృష్ణ ప్రసాద్ తెలిపారు.