Kaikala Satyanarayana: వెండితెర యముడు... ఆ పాత్రలో తిరుగులేని రారాజు!

First Published Nov 20, 2021, 9:01 PM IST


నవరస నట సార్వభౌముడిగా తెలుగు సినిమా చరిత్రలో కైకాల సత్యనారాయణ ఓ అధ్యాయం లిఖించారు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయడం ఆయన నైజం... కనికరం లేని విలనిజం, కన్నీళ్లు తెప్పించే కరుణరసం, కడుపుబ్బా నవ్వించే హాస్యం... వ్యక్తీకరణ ఏదైనా కైకాల సత్యనారాయణకు కొట్టిన పిండి.

ఒక్కో నటుడికి ఒక్కో సిగ్నేచర్ రోల్ ఉంటుంది. కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayaana) కూడా ఓ పాత్ర విషయంలో తనకు పోటీ లేదని నిరూపించుకున్నాడు. రాముడు, కృష్ణుడు పాత్రలు ఎన్టీఆర్ మాత్రమే చేయాలి, యముడి రోల్ కైకాల సత్యనారాయణ మాత్రమే చేయాలి.ఆహార్యం, ఆంగికంతో యముడి పాత్రలో ఆయనకు సరిలేరని రుజువు చేశారు. . 
 

అందుకే కెరీర్లో పదుల సంఖ్యలో కైకాల సత్యనారాయణ యముడిగా కనిపించారు. ముఖ్యంగా సోసియో ఫాంటసీ చిత్రాలలో యముడిగా ఆయన చేసిన మ్యాజిక్.. విజయంలో కీలక పాత్ర పోషించింది. అనేక చిత్రాలలో కైకాల సత్యనారాయణ యముడి రోల్ చేయగా యమగోల, యముడికి మొగుడు, యమలీల చిత్రాలు చాలా ప్రత్యేకం. 
 

1977లో తాతినేని రామారావు దర్శకత్వంలో విడుదలైన యమగోల బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఎన్టీఆర్ (NTR) కెరీర్ లో అతిపెద్ద హిట్ గా ఉన్న ఈ మూవీ విజయంలో యముడిగా కైకాల సత్యనారాయణ నటన అమోఘం. నిజంగా యముడు అంటే ఇలానే ఉంటాడా, అనే కొత్త అనుభూతి తన పాత్ర ద్వారా కైకాల క్రియేట్ చేశారు. 
 


ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన యమగోల, ఆ తర్వాత అనేక చిత్రాలకు స్ఫూర్తిగా నిలిచింది. ఇదే ఫార్ములాలో తర్వాత జెనరేషన్ స్టార్ హీరోలు సినిమాలు చేశారు. హీరో ఎవరైనా యముడు అంటే కైకాల సత్యనారాయణే కనిపించేవారు. యమగోల సినిమాలో కైకాల చెప్పే.. ''యముండ'' డైలాగ్ సూపర్ ఫేమస్. అది యముడి ఇగోని రిప్రజెంట్ చేసే డైలాగ్. 
 

1988లో విడుదలైన యముడికి మొగుడు ఇదే ఫార్ములాతో తెరకెక్కిన సోసియో ఫాంటసీ చిత్రం. చిత్రగుప్తుడు తప్పిదంతో ఆయువు తీరకుండానే చనిపోయిన చిరంజీవి (Chiranjeevi), యమలోకంలో యముడిని ముప్పతిప్పలు పెడతాడు. యముడికి మొగుడు మూవీలో కూడా యముడిగా కైకాల నటించారు. ఈ మూవీ సైతం అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 
 

ఇక దర్శకుడు ఎస్ వి కృష్ణారెడ్డి తెరకెక్కించిన యమలీల అప్పట్లో  ఓ సంచలనం. కమెడియన్ ఆలీతో ఇండస్ట్రీ రికార్డ్స్ అందుకున్న చిత్రం అది. భవిష్యవాణి పోగొట్టుకున్న యముడు చిత్రగుప్తుడు భూలోకానికి వస్తే పరిస్థితి ఏమిటీ? అనే కాన్సెప్ట్ తో యమలీల తెరకెక్కింది. 

యమలీల మూవీలో కామెడీ, ఎమోషన్స్, సీరియస్ నెస్ కలగలిపి గొప్పగా కైకాల పాత్రను దర్శకుడు తీర్చిదిద్దాడు. హిమ క్రీములు అంటే అమితంగా ఇష్టపడే యముడిగా... కైకాల నటన కడుపుబ్బా నవ్విస్తుంది. యమలీల భారీ విజయాన్ని నమోదు చేసి, స్టార్ హీరోలకు కూడా చుక్కలు చూపించింది.


యముడి పాత్రలతో వెండితెరపై కైకాల క్రియేట్ చేసిన చరిత్రకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. పౌరాణిక పాత్రలలో ఆయన ప్రస్థానం గురించి మాట్లాడుకోవాలంటే, పెద్ద పుస్తకమే అవుతుంది. భీముడు, ఘటోత్కచుడు పాత్రలలో కూడా నటించిన కైకాల తన మార్క్ క్రియేట్ చేశారు.  

click me!