సినీ నటి పూనమ్ కౌర్(poonam kaur).. గురునానక్ జయంతి (Etela rajender) సందర్భంగా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ని కలిశారు. ఈ సందర్భంగా శాంతికి గుర్తుగా పావురాలను ఎగరవేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను ఆమె తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేశారు.
ఆయనకు ఏక్ ఒంకార్ అని రాసి ఉన్న ఫొటోను ఈటల దంపతులకు అందజేశారు. ఈ ఫొటోలను షేర్ చేసిన పూనమ్ కౌర్.. ధర్మ పోరాటం ఎప్పటికీ గెలుస్తందని.. హుజురాబాద్ ఉప ఎన్నికను ఉద్దేశించి కామెంట్స్ చేశారు.
అలాగే ఈటల రాజేందర్‌తో కలిసి పావురాలను ఎగరవేసిన పూనమ్ కౌర్.. రైతు చట్టాలు రద్దు చేయడంతో మళ్లీ స్వేచ్ఛ స్వాతంత్ర్యం వచ్చినట్లు అనిపించిందని పూనమ్ కౌర్ అభిప్రాయపడింది. ‘నిజాయితీ, నిబద్దత, కరుణ గల ప్రజలను బాబా నానక్ ఎల్లప్పుడూ దీవిస్తారు. బాబా నానక్ ను నేనెప్పుడూ చూడలేదు. కానీ కష్టం వచ్చిన ప్రతిసారీ ఆయన ఉన్నారన్న నా నమ్మకం బలపడింది. ధర్మ యుద్దం ఎప్పుడూ గెలుస్తుంది’ అంటూ ఆమె కామెంట్స్ చేసింది.
అయితే పూనమ్ కౌర్ ఈటల రాజేందర్‌ను కలవడం.. ఆ ఫొటోలను షేర్ చేసిన సందర్భంగా చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మరాయి. ఆమె బీజేపీలో చేరనున్నారని.. అందుకోసమే ఈటల రాజేందర్‌ను కలిశారనే చర్చ సోషల్ మీడియాలో విపరీతంగా సాగుతుంది. వరుసగా మూడు పోస్ట్‌లు చేయడం కూడా ఆమె ఈటలను కలవడం వెనక ఏదో బలమైన కారణం ఉందనే వార్తలకు బలం చేకూర్చినట్టయింది.
అవినీతి ఆరోపణల నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌లో నుంచి బయటకు వచ్చిన ఈటల రాజేందర్.. ఆ తర్వాత బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన పదవులకు కూడా రాజీనామా చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ తరఫున పోటీ చేసిన రాజేందర్ విజయం సాధించారు.
ఇక, మాయాజలంతో తెలుగు తెరపై కనిపించిన పూనమ్ కౌర్.. ఆ తర్వాత పలు చిత్రాల్లో మెప్పించింది. అయితే ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. కొంతకాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆమె సోషల్ మీడియాలో చేసే పోస్టులతో.. రకరకాలు వార్తలు ప్రచారంలోకి వస్తూనే ఉన్నాయి.