The paradise: నాని హీరోగా వచ్చిన ది ప్యారడైజ్ సినిమాలో సీనియర్ నటుడు బాబూమోహన్ కూడా నటించబోతున్నారనే ప్రచారం జరిగినా.. చివరకు తెరపై కనిపించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై బాబూమోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘ది ప్యారడైజ్’ చిత్రంలో ఓ మంచి పాత్ర కోసం తనను సంప్రదించారని బాబూమోహన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సినిమా కోసం తన కెరీర్‌లోనే తొలిసారిగా మేకప్ టెస్ట్ చేయించుకున్నానని తెలిపారు. ఆ సమయంలో తన లుక్ బాగుందని అక్కడున్నవారు ప్రశంసించినట్లు చెప్పారు. దీంతో సినిమాలో తనకు మంచి పాత్ర దక్కుతుందని ఆశించారట. అయితే మేకప్ టెస్ట్ పూర్తయిన తర్వాత చిత్ర బృందం నుంచి ఎలాంటి సమాచారం అందలేదని పేర్కొన్నారు. షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో, తన పాత్రకు సంబంధించిన వివరాలు ఏమిటో కూడా చెప్పలేదని తన అనుభవాన్ని వివరించారు.
25
షూటింగ్‌కు పిలుస్తారని ఎదురుచూశా.. కానీ
మేకప్ టెస్ట్ పూర్తయినప్పటికీ చిత్ర బృందం నుంచి పిలుపు రాకపోవడంతో బాబూమోహన్ కొంతకాలం ఎదురుచూశారట. సినిమా విడుదల తేదీ ప్రకటించే వరకు అయినా తనను షూటింగ్‌కు ఆహ్వానిస్తారని భావించినట్లు చెప్పారు. కానీ చివరి వరకు ఎలాంటి సమాచారం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాలో తనను తీసుకోవడం లేదనే విషయాన్ని కూడా అధికారికంగా తెలియజేయలేదని అన్నారు. ఒక నటుడిని పాత్ర కోసం పిలిపించినప్పుడు, చివరకు ఎంపిక చేయకపోతే ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత చిత్ర బృందానికి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
35
నా కంటే మంచి నటుడు దొరికాడా? అంటూ ప్రశ్నలు
తనను సినిమా నుంచి తప్పించడానికి అసలు కారణమేంటో ఇప్పటికీ తెలియదని బాబూమోహన్ అన్నారు. తన నటన నచ్చలేదా? తనకంటే మెరుగైన నటుడు దొరికాడా? అనే సందేహాలను వ్యక్తం చేశారు. అంతేకాకుండా తనను తాను లక్కీ హ్యాండ్‌గా అభివర్ణిస్తూ ప్యారడైజ్ టీమ్‌పై కామెంట్స్ చేశారు. తనను సినిమాలోకి తీసుకోకపోవడం వెనుక ఏ కారణం ఉందో చెప్పాలని ప్రశ్నించారు.
తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించానని బాబూమోహన్ గుర్తుచేసుకున్నారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘చెవిలో పువ్వు’ ఆశించిన విజయాన్ని అందుకోలేదని, ఆ తర్వాత ఆయనతోనే చేసిన ‘ప్రేమ ఖైదీ’ మంచి విజయాన్ని సాధించిందని వివరించారు. ‘మామగారు’, ‘మాయలోడు’, ‘చిన్నరాయుడు’, ‘పెద్దరాయుడు’, ‘బావ బావమరిది’ వంటి చిత్రాల్లో తన నటనకు మంచి గుర్తింపు లభించిందన్నారు. ఒక్కో సినిమాలో ఒక్కో రకమైన హావభావాలు, మాటతీరు, బాడీ లాంగ్వేజ్‌తో పాత్రలకు ప్రత్యేకత తీసుకొచ్చానని చెప్పారు. ఇన్ని విభిన్న పాత్రలు చేసిన తనకు ప్యారడైజ్ టీమ్ నుంచి ఇలాంటి అనుభవం ఎదురవడం బాధ కలిగించిందని పేర్కొన్నారు.
55
కనీస మర్యాద పాటించాల్సింది..
ఇంటర్వ్యూలో బాబూమోహన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తనను పాత్ర కోసం పిలిచి, మేకప్ టెస్ట్ చేయించి, చివరకు సినిమాలో అవకాశం ఇవ్వకపోవడం కంటే.. ఆ విషయాన్ని చెప్పకుండా మౌనంగా ఉండటమే తనను ఎక్కువగా బాధించిందని ఆయన పేర్కొన్నారు. ఒక నటుడి సమయాన్ని, గౌరవాన్ని గుర్తించడం చిత్ర నిర్మాణ బృందాల బాధ్యత అని అభిప్రాయపడ్డారు. ‘ది ప్యారడైజ్’ సినిమా థియేటర్లలో ఒక్కరోజు కూడా ఆడలేదని తాను విన్నానంటూ విమర్శించారు. తనను సినిమాలోకి తీసుకోకపోవడానికి కారణం ఏదైనా కనీసం సమాచారం ఇచ్చి ఉంటే బాగుండేదని అన్నారు. ప్రస్తుతం బాబూమోహన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంపై ‘ది ప్యారడైజ్’ చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.